కెల్విన్‌తో ఆర్థిక లింకులేంటి?
ABN , First Publish Date - 2021-09-03T08:13:22+05:30 IST
డ్రగ్స్ కేసుల్లో కీలక నిందితుడైన కెల్విన్‌కు పెద్దమొత్తంలో డబ్బులు ఎందుకు పంపారంటూ నటి, నిర్మాత చార్మి కౌర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రశ్నించింది. తన రెండు వ్యక్తిగత బ్యాంకు

- లావాదేవీలపై వివరణ ఇవ్వండి
- అతడెవరో తెలియదన్న చార్మి కౌర్
- వాట్సాప్ చాట్ చూపిన అధికార్లు
- 8 గంటల పాటు ఈడీ విచారణ
- డాక్యుమెంట్లన్నీ సమర్పించా: చార్మి
హైదరాబాద్, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): డ్రగ్స్ కేసుల్లో కీలక నిందితుడైన కెల్విన్‌కు పెద్దమొత్తంలో డబ్బులు ఎందుకు పంపారంటూ నటి, నిర్మాత చార్మి కౌర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రశ్నించింది. తన రెండు వ్యక్తిగత బ్యాంకు ఖాతాలతోపాటు పూరికనెక్ట్స్, మరో సంస్థకు చెందిన బ్యాంకు ఖాతాల్లోని అనుమానాస్పద లావాదేవీలపై వివరణ ఇవ్వాలంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. టాలీవుడ్ డ్రగ్స్‌కేసుల వ్యవహారంలో చార్మిని గురువారం ఉదయం 10.30 నుంచి సుమారు 8 గంటల పాటు ప్రశ్నించింది. ముఖ్యంగా 2015-18 మధ్యకాలంలో ఆ నాలుగు ఖాతాల స్టేట్‌మెంట్లను ఆమె చార్టెట్ అకౌంటెట్ ఈడీ అధికారులకు సమర్పించారు. ఐదుగురు సభ్యులతో కూడిన బృందం చార్మిని విచారించింది. అందులో ఇద్దరు మహిళా అధికారులున్నారు. మంగళవారం కెల్విన్‌కు తనకున్న ఆర్థిక సంబంధాలపై ప్రశ్నలడిగారు.
ఈడీ అధికారుల విచారణలో కెల్విన్ ఎవరో తనకు తెలియదని చార్మి చెప్పడం గమనార్హం..! కెల్విన్ మొబైల్ కాంటాక్ట్ లిస్ట్‌లో తన నంబర్ దాదా అని ఉందని, అతడితో ఆర్థిక లావాదేవీలపై వాట్సాప్ చాటింగ్‌లో పలుమార్లు చర్చించారని అధికారులు వివరించారు. వాట్సాప్ చాటింగ్, కాల్‌డేటా వివరాలను ఆమెకు చూపిస్తూ ప్రశ్నించారు. చార్మి ఆ ప్రశ్నలకు సమాధానాలను దాటవేసినట్లుగా తెలుస్తోంది. కెల్విన్‌తో పాటు మరో ముగ్గురి డ్రగ్ పెడ్లర్ల ఫొటోలను చార్మికి చూపించగా.. వారెవరో తనకు తెలియదని సమాధానమిచ్చారు.
విచారణకు సహకరించా: చార్మి
ఈడీ నోటీసుల్లో పేర్కొన్న అన్ని డాక్యుమెంట్లను సమర్పించానని చార్మి కౌర్ మీడియాకు తెలిపారు. విచారణకు పూర్తిస్థాయిలో సహకరించానని చెప్పారు. విచారణలో అన్ని విషయాలను మీడియాతో పంచుకోలేనని, న్యాయపరమైన సమస్యలు తలెత్తుతాయన్నారు.