హెచ్‌ఆర్‌ఏ తగ్గుతుందా?
ABN , First Publish Date - 2021-03-24T08:51:24+05:30 IST
ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇప్పటిదాకా అందుతున్న ఇంటి అద్దె అలవెన్సు(హెచ్‌ఆర్‌ఏ)కు కోత పడనుందా..

- కేంద్రం దారిలోనే తెలంగాణ..
- గ్రేటర్ హైదరాబాద్‌లో 24 శాతమే
- సిఫారసు చేసిన పీఆర్సీ..
- ఇప్పటికే తగ్గించిన కేంద్ర ప్రభుత్వం
హైదరాబాద్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇప్పటిదాకా అందుతున్న ఇంటి అద్దె అలవెన్సు(హెచ్‌ఆర్‌ఏ)కు కోత పడనుందా..? ఈ అంశంపై వేతన సవరణ కమిషన్(పీఆర్సీ) సిఫారసులకే ప్రభుత్వం మొగ్గు చూపనుందా..? అంటే అవుననే చెబుతున్నాయి సంకేతాలు. ఆది నుంచి ప్రభుత్వం ఇంటి అద్దె అలవెన్సును తగ్గించాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి అనుగుణంగా పలు సంఘాలు 24 శాతం హెచ్‌ఆర్‌ఏ పేరుతో వేతనాల పెరుగుదలపై గణాంకాలు కూడా విడుదల చేశాయి. హెచ్‌ఆర్‌ఏ తగ్గింపునకు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కూడా అంగీకారం కూడా తెలిపినట్లు సమాచారం ఉంది. పీఆర్సీ సిఫారసులను ప్రభుత్వం ఆమోదిస్తే.. గ్రేటర్ హైదరాబాద్‌లో ఇప్పటిదాకా 30 శాతం హెచ్‌ఆర్‌ఏ అందుతుండగా.. దాన్ని 24 శాతానికి కుదిస్తారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ఏడో వేతన కమిషన్ సిఫారసులను అనుసరించి హెచ్‌ఆర్‌ఏ కుదించింది. ఎక్స్ కేటగిరీ నగరాలు(హైదరాబాద్), వై కేటగిరీ నగరాలు(వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు)లో 16 శాతం, జడ్ కేటగిరీ నగరాల్లో 8 శాతం హెచ్‌ఆర్‌ఏ అమలు చేస్తోంది. ఇది 2017 జూలై 1 నుంచి అమలులో ఉంది. తెలంగాణలో ఆ తర్వాతే 2018లో వేతన సవరణ కమిషన్‌ను నియమించడం.. ఇటీవలే నివేదిక ఇవ్వడంతో హెచ్‌ఆర్‌ఏ తగ్గింపు దిశగానే ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశం ఉంది.