సైదాపురంలో అగ్గలయ్య.. ఫణిగిరిలో దేమసేన
ABN , First Publish Date - 2021-01-20T08:46:21+05:30 IST
ప్రాచీన కాలపు వైద్య, శస్త్ర చికిత్సావిధానం, వైద్యనిపుణుల ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడానికి ఆయూష్ మంత్రిత్వ శాఖ పురాతన శాసనాల ఆధారంగా డాక్యుమెంటరీ

పురాతన వైద్య, శస్త్ర చికిత్స నిపుణులపై డాక్యుమెంటరీ
యాదాద్రి, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): ప్రాచీన కాలపు వైద్య, శస్త్ర చికిత్సావిధానం, వైద్యనిపుణుల ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడానికి ఆయూష్ మంత్రిత్వ శాఖ పురాతన శాసనాల ఆధారంగా డాక్యుమెంటరీ చిత్రీకరణకు శ్రీకారం చుట్టింది. నేషనల్ సెంటర్ ఫర్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్, హైదరాబాద్‌కు చెందిన పురావస్తుశాఖ పరిశోధకులు యాదాద్రి భువనగిరి జిల్లా సైదాపురం, సూర్యాపేట జిల్లా ఫణిగిరి ప్రాచీన పురాతత్వ కేంద్రాలను సోమవారం సందర్శించారు. అక్కడి శాసనాలపై చెక్కిన ప్రాచీన వైద్య, శస్త్రచికిత్స విధానాలు, శస్త్రచికిత్స వైద్య నిపుణుల వివరాల ఆధారంగా చాళుక్యుల కాలపు నాటి అగ్గలయ్య, ఇక్ష్వాకుల నాటి ప్రధాన వైద్యుడు దేమసేనలపై డాక్యుమెంటరీ చిత్రీకరణను ప్రారంభించారు. చారిత్రక ఆధారాలతో పురాతన కాలం నాటి వైద్య, శస్త్ర చికిత్సవిధానం, వైద్య నిపుణులకు దక్కిన గౌరవాలను చాటే శాసనాధార డాక్యుమెంటరీలను రూపొందిస్తున్నట్టు నేషనల్ సెంటర్ ఫర్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జీపీ ప్రసాద్, రీసెర్చ్ ఆఫీసర్ డాక్టర్ సాకేత్ రామ్ తెలిపారు.
తొలి శస్త్రచికిత్స నిపుణుడు అగ్గలయ్య
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామంలోని ఓ శాసనం, క్రీ.శ.1144 చాళుక్యుల కాలపు నాటి అగ్గలయ్య మొట్టమొదటి శస్త్రచికిత్స నిపుణుడని చెబుతోంది. రెండో జయసింహ అనే రాజు ఆధ్వర్యంలో అగ్గలయ్య జైన వైద్య విధానంలో నైపుణ్యం సాధించారు. ఆయనకున్న వైద్యశాస్త్ర పరిజ్ఞానం, నైపుణ్యతను గుర్తిస్తూ అగ్గలయ్యకు రెండో జయసింహ వైద్య రత్నాకర బిరుదును ప్రదానం చేశాడు. సైదాపురం పరిసరాల్లోని గ్రామాలను దానం చేశాడు. 20 అడుగుల శిలపై చెక్కించిన శాసనం ఇప్పటికీ సైదాపురంలో పదిలంగా ఉందని జీపీ ప్రసాద్, సాకేత్ రామ్ తెలిపారు. కాగా సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో బ్రహ్మీలిపి, సంస్కృత, ప్రాకృత భాషల్లో రాసివున్న శాసన స్తంభం ఉంది.
క్రీ.శ. 3, 4 శతాబ్దాల కాలపునాటిదైన ఈ స్తంభం, 122 అంగుళాల చదరపు కొలతలతో అష్టభుజి కోణాలు, ప్రతి కోణం 5, 6 అంగుళాలుగా చెక్కి ఉంది. ఇక్ష్వాకుల రాజు రుద్రపురుషదత్త తన 18వ ఏట దీనిని ప్రతిష్టించినట్లు ఆధారాలున్నాయి. నాడు రాజులకు ప్రధాన వైద్యుడిగా ఉన్న దేమసేన పరిజ్ఞానానికి గుర్తింపుగా ఈ ధర్మచక్ర బౌద్ధ స్తంభ స్తూప శాసనం ప్రతిష్టాపన జరిగింది. ఇక్ష్వాకుల రాజు తన హయాంలోని వైద్యుడి గౌరవాన్ని గుర్తిస్తూ ఈ స్తంభం నిర్మించడం చాలా అరుదైన విషయంగా చరిత్రకారులు భావిస్తున్నారు. ఈ శాసనాన్ని ఫణిగిరిలోని జైన ఆధ్యాత్మిక కేంద్రమైన కొండపై గుర్తించి, గ్రామంలోని ఓ స్టోర్‌హౌ్‌సలో భద్రపరిచారు.
