పిల్లలపై ఒత్తిడి చేయొద్దు

ABN , First Publish Date - 2021-08-25T08:29:27+05:30 IST

వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పాఠశాలలు, కళాశాలలను ప్రారంభించే కసరత్తును ప్రభుత్వం వేగవంతం చేసింది.

పిల్లలపై ఒత్తిడి చేయొద్దు

 • విద్యార్థుల్లో ఎవరికైనా అనారోగ్యం వస్తే వెంటనే వైద్యపరీక్షలకు ఏర్పాట్లు చేయాలి
 • ఒక్కరికి పాజిటివ్‌ వస్తే అందరికీ టెస్టులు
 • విద్యార్థులందరూ కొవిడ్‌ నిబంధనలను సక్రమంగా పాటించేలా చూడండి
 • సమస్యలొస్తే జిల్లా అధికారులదే బాధ్యత
 • విద్యాసంస్థలను 30లోపు సిద్ధం చేయండి
 • పారిశుధ్య పనులను పూర్తిచేయండి
 • పాఠ్యపుస్తకాల పంపిణీ పూర్తిచేయండి
 • నెలాఖరుకల్లా భగీరథ కనెక్షన్లు ఇవ్వండి
 • కలెక్టర్లకు సూచించిన మంత్రులు
 • స్కూల్‌ బస్సుల్నీ శానిటైజ్‌ చేయాలని సూచన
 • ప్రభుత్వ విద్యాసంస్థల్లో పారిశుధ్య పనులకు మార్గదర్శకాలు జారీ చేసిన పురపాలక శాఖ


హైదరాబాద్‌, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పాఠశాలలు, కళాశాలలను ప్రారంభించే కసరత్తును ప్రభుత్వం వేగవంతం చేసింది. అందుకు వీలుగా ఈ నెల 30లోపు రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీలన్నింటినీ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లకు మంత్రులు సూచించారు.  సెప్టెంబరు 1వ తేదీ నుంచి రాష్ట్రంలో విద్యాసంస్థలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు మంగళవారం జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కొవిడ్‌ మార్గదర్శకాలను పాటిస్తూ, విద్యా సంస్థలను నిర్వహించాలని.. అందుకు అవసరమైన చర్యల్ని వెంటనే తీసుకోవాలని ఆదేశించారు. ఏవైనా సమస్యలు వస్తే.. అందుకు జిల్లా అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.


ముఖ్యంగా ఎడ్యుకేషన్‌ మానిటరింగ్‌ కమిటీలు ఎక్కువ బాధ్యత తీసుకోవాలని పేర్కొన్నారు. అధికారులకు, విద్యాసంస్థలకు  మంత్రులు చేసిన సూచనలు.. పట్టణ ప్రాంతాల్లో మునిసిపాలిటీలు, మునిసిపల్‌ కార్పొరేషన్లు, గ్రామీణ  ప్రాంతాల్లో గ్రామ పంచాయితీల సహకారంతో విద్యా సంస్థల్లో శానిటైజేషన్‌ ప్రకియ్ర చేపట్టాలి. మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలి. పారిశుధ్యానికి సంబంధించిన పనులు పూర్తిచేయాలి. ఆయా పనుల వివరాలను జిల్లా విద్యాధికారులు రోజూ ప్రభుత్వానికి నివేదించాలి. పాఠశాలల్లో, వసతిగృహాల్లో మధ్యాహ్న భోజనం అందించేందుకు వీలుగా కలెక్టర్లు సరుకులను సమకూర్చాలి. విద్యార్థుల్లో ఎవరికైనా అనారోగ్యం వస్తే వైద్య పరీక్షలు చేయించాలి. ఒకవేళ వారికి కరోనా పాజిటివ్‌ వస్తే.. ఆయా పాఠశాలల్లోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు వైద్యపరీక్షలు చేయించాలి. ప్రతి పాఠశాలకూ మిషన్‌ భగీరథ పథకంలో భాగంగా ఈ నెల 30వ తేదీ నాటికి మంచినీటి కనెక్షన్లను అందించాలి. ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీని ఈ నెల 30లోగా పూర్తి చేయాలి. స్కూలుకు/కాలేజీకి తప్పనిసరిగా రావాలంటూ విద్యాసంస్థలు విద్యార్థులపై ఒత్తిడి తీసుకురాకూడదు. విద్యార్థుల రవాణ కోసం వినియోగిస్తున్న వాహనాలకు కూడా శానిటైజేషన్‌ కార్యక్రమాన్ని చేపట్టాలి. 


పురపాలక శాఖ మార్గదర్శకాలు..

పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో పారిశుధ్య పనులు చేపట్టేందుకు పురపాలక శాఖ పరిపాలనా విభాగం డైరెక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ మంగళవారం మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలకు సంబంధించి తరగతి గదులు, పరిసరాలు, నీటిట్యాంకులు, సంప్‌లు, మరుగుదొడ్లను శుభ్రం చేసే బాధ్యత స్థానిక సంస్థలదేనని ఆ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఈగలు, దోమలు వ్యాపించకుండా.. మురుగునీటి నిల్వలను తొలగించాలని సూచించారు. నెలాఖరులోగా ఈ పనులన్నీ పూర్తిచేయాలని, వార్డులవారీగా అధికారులు ఈ పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. మరోవైపు.. పాఠశాలల్లో ఒక్క విద్యార్థికి కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చినా ఇతర విద్యార్థులు, సిబ్బంది అందరికీ ఆర్టీపీసీఆర్‌, ఆర్‌ఏటీ పరీక్షలను తప్పనిసరిగా చేయించాల్సిందేనని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది.


గురుకులాలు, రెసిడెన్షియల్‌ పాఠశాలలు, హాస్టళ్లలో కొవిడ్‌ కేసుల సంఖ్య పెరిగితే వెంటనే ఆ సమాచారాన్ని పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌, జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాలని సూచించింది. గురువారం నుంచి బోధన, బోధనేతర సిబ్బంది పాఠశాలలకు క్రమం తప్పకుండా హాజరు కావాలని ఆదేశించింది. 30లోగా విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు అందించాలని సూచించింది. తాగునీటి వసతి లేని పాఠశాలలకు త్వరగా మిషన్‌ భగీరథ నీరు అందించాలని పేర్కొంది. కాగా, మిడ్‌డే మీల్స్‌ ఏర్పాట్లకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక మెమో జారీ చేసింది. విద్యార్థులకు భోజనం పెట్టడానికి వీలుగా పౌరసరఫరాల శాఖ నుంచి నాణ్యత గల సరకులను సేకరించాలని పేర్కొంది.


మాస్కు పెడితేనే బడికి

ప్రవేశాలపై వైద్యశాఖ మార్గదర్శకాలు

బడులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. విద్యార్ధులు, విద్యా సంస్థలు పాటించాల్సిన మార్గదర్శకాలను వైద్య శాఖ విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలన్నీ కొవిడ్‌ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అందులో పేర్కొంది. ఆ మార్గదర్శకాల ప్రకారం.. విద్యార్థులు తప్పనిసరిగా మాస్కు ధరించాలి. ఒకవేళ ఏదైనా విద్యా సంస్థ లేదా హాస్టల్‌లో ఒక విద్యార్థికి కొవిడ్‌ లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రిన్సిపల్‌, వార్డెన్‌, వారిని సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి కొవిడ్‌ టెస్టు చేయించాలి. పాజిటివ్‌గా నిర్థారణ అయితే, ఆ విద్యార్థితో సన్నిహితంగా ఉన్న వారందర్నీ గుర్తించి, అందరికీ కరోనా పరీక్షలు చేయించాలి. ఒక విద్యా సంస్థలో ఐదుకు మించి కేసులు ఒకేసారి నమోదు అయితే దాన్ని క్లస్టర్‌గా పరిగణించాలి. ఆ సమాచారాన్ని తక్షణమే ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయానికి తెలపాలి. తద్వారా తదుపరి చర్యలు తీసుకునేందుకు వీలుంటుంది. అలాగే.. పంచాయతీరాజ్‌ కమిషనర్‌, పురపాలక శాఖ కమిషనర్ల పరిధిలోని అన్ని విద్యాసంస్థలనూ ఆగస్టు 30లోగా శుభ్రపరచాలి.

Updated Date - 2021-08-25T08:29:27+05:30 IST