జీఎస్టీని పెంచొద్దు
ABN , First Publish Date - 2021-12-31T08:04:31+05:30 IST
చేనేత, వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

- చేనేత, వస్త్ర రంగంపై 12% పెంపు దారుణం
- ఆ నిర్ణయం వెనక్కి తీసుకోండి
- గుజరాత్ బీజేపీ అధ్యక్షుడి మాటైనా వినండి
- నిర్మలా సీతారామన్‌కు మంత్రి కేటీఆర్ లేఖ
- నేతన్నలకు అండగా ఉంటామని వ్యాఖ్య
హైదరాబాద్/సిటీ/దుబ్బాక, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): చేనేత, వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం 5 శాతంగా ఉన్న జీఎస్టీని 12 శాతానికి పెంచడం దారుణమన్నారు. జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ నిర్ణయంతో చేనేత, వస్త్ర పరిశ్రమ పూర్తిగా కుదేలవుతుందని చెప్పారు. ఈ మేరకు ఆయ న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు గురువారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున లేఖ రాశారు. శుక్రవారం జరగనున్న జీఎస్టీ కౌన్సిల్‌లో ఈ పన్ను పెంపు ప్రతిపాదనపై చర్చించాలని, ప్రజా వ్యతిరేక నిర్ణయా న్ని పునఃసమీక్షించుకోవాలని కోరారు. నూలు, రసాయనాలు, ప్యాకేజింగ్ మెటీరియల్, రవాణా వ్యయం వంటి ఖర్చులు భారీగా పెరిగాయని, దీనికితోడు పన్ను పెంచితే వస్త్ర ఉత్పత్తుల ధరలు కనీసం 15-20 శాతం పెరుగుతాయని తెలిపారు. పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకమవుతుందని, 15 లక్షల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదముందన్నారు. ముఖ్యంగా రూ. వెయ్యి లోపు ధరలో దుస్తులు కొనే మధ్యతరగతి వినియోగదారులకు జీఎస్టీ పెంపు భారం కానుందన్నారు.
జీఎస్టీ పెంపు ప్రతిపాదనను కేంద్రం విరమించుకునే వరకు దేశంలోని నేతన్నలు, వస్త్ర పరిశ్రమ వర్గాలకు తెలంగాణ తరఫున అండగా నిలబడతామని కేటీఆర్ వెల్లడించారు. చేనేత, వస్త్ర పరిశ్రమకు తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాల ద్వారా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయన్నారు. ఆయా వర్గాల నుంచి వస్తున్న వ్యతిరేకత, ఆందోళనలను పరిగణనలోకి తీసుకొని జీఎస్టీ పెంపు ప్రతిపాదనను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం మొండిగా వ్యవహరిస్తే వ్యవసాయ చట్టాల విషయంలో రైతన్నల మాదిరిగా.. దేశంలోని నేతన్నలు కూడా తిరగబడతారని చెప్పారు. చేనేత రంగంపై జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ గుజరాత్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా డిమాండ్ చేశారని, కనీసం ఆయన మాటైనా వినాలని కేటీఆర్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కోరారు. ఈ విషయాన్ని ఆయన ట్వీట్ చేశారు. కాగా, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన సాహితీవేత్తలకు కేటీఆర్ అభినందనలు తెలిపారు.
ఉసురు తీస్తున్న కేంద్రం: ఎల్.రమణ
చేనేతను బతికించాలనే తపనతో సీ ఎం కేసీఆర్ నిరంతరం శ్రమిస్తూ ఉంటే.. కేంద్రం మా త్రం చేనేత పరిశ్రమ నడ్డివిరిచేలా వ్యవహరించడం దారుణమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో గురువారం చేనేత కార్మికుల మహాధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు. కేంద్రం జీఎస్టీని ఎత్తివేయకుంటే, 5న హ్యాండ్లూమ్ మార్చ్ పేరుతో హైదరాబాద్‌లో ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. కాగా, వస్త్రాలపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేసి వస్త్ర పరిశ్రమ, వ్యాపార వర్గాలను ఆదుకునేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని హైదరాబాద్ హోల్‌సేల్ ఆర్ట్ సిల్క్ క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీకి వినతి పత్రం సమర్పించింది.
కొనుగోలుదారులపైనా భారం
అమ్మనబోలు ప్రకాశ్
వస్త్రాలపై జీఎస్టీని 12 శాతానికి పెంచడం వల్ల కొనుగోలుదారులపై 40 శాతం అధికభారం పడుతుందని తెలంగాణ స్టేట్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్ అసోసియేషన్ అధ్యక్షుడు అమ్మనబోలు ప్రకాశ్ అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి వస్త్రాలపై పన్నులు వేయలేదని.. ఆహారం, ఇళ్లు లేకపోయినా కొంతకాలం బతకొచ్చు కానీ, దుస్తులు లేకపోతే బతకలేమని చెప్పారు. అలాంటి దుస్తులపై 5 శాతం జీఎస్టీ వసూలు చేశారని, ఇప్పుడు దాన్ని 12 శాతానికి పెంచడం అన్యాయమని చెప్పారు.
