యాసంగిలో వరిసాగు వద్దు
ABN , First Publish Date - 2021-11-28T08:24:39+05:30 IST
యాసంగిలో రైతులు వరిసాగు చేయొద్దని సీఎస్ సోమేశ్ కుమార్ అన్నారు.

- ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయండి
- అవసరమైతే కొత్త కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
- ఇతర రాష్ట్రాల ధాన్యాన్ని కొనుగోలు చేయొద్దు
- అధికారులకు సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశం
హైదరాబాద్, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): యాసంగిలో రైతులు వరిసాగు చేయొద్దని సీఎస్ సోమేశ్ కుమార్ అన్నారు. తెలంగాణ ఉప్పుడు బియ్యాన్ని కేంద్రం, ఎఫ్‌సీఐ కొనుగోలు చేయొద్దని నిర్ణయం తీసుకున్నాయని గుర్తుచేశారు. యాసంగి ధాన్యం ఉప్పుడు బియ్యానికే అనుకూలంగా ఉందని, రైతులు సాగు చేయొద్దని సూచించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై సీఎస్ శనివారం డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి బీఆర్‌కే భవన్ నుంచి కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విత్తన కంపెనీలు, మిల్లర్లతో రైతులు ఒప్పందం కుదుర్చుకుని యాసంగిలో వరి సాగు చేసుకోవచ్చని సీఎస్ తెలిపారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, సాఫీగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట కొత్త కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. ఇతర రాష్ట్రాల ధాన్యాన్ని కొనుగోలు చేయొద్దని ఆదేశించారు. వడ్లను తొందరగా మిల్లింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.