నిందితులను పట్టుకునే ఉద్దేశం లేదా?
ABN , First Publish Date - 2021-10-29T08:31:38+05:30 IST
‘‘నిందితుల నడుము పైభాగంలో ఎందుకు కాల్చారు? వాళ్లను సజీవంగా పట్టుకునే ఉద్దేశం లేదా? ఓ ఎస్సైకి ఏకే-47 ఉపయోగించే అధికారం లేదు కదా.. మరి మీరెలా ఉపయోగించారు?’’ అంటూ దిశ
నడుము పైభాగంలో ఎందుకు కాల్చారు?.. దిశ కమిషన్ ప్రశ్నలు
హైదరాబాద్, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ‘‘నిందితుల నడుము పైభాగంలో ఎందుకు కాల్చారు? వాళ్లను సజీవంగా పట్టుకునే ఉద్దేశం లేదా? ఓ ఎస్సైకి ఏకే-47 ఉపయోగించే అధికారం లేదు కదా.. మరి మీరెలా ఉపయోగించారు?’’ అంటూ దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో ఎస్‌వోటీ ఎస్సై షేక్ లాల్‌మదార్‌పై విచారణ కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసు విచారణ గురువారం హైకోర్టు ప్రాంగణంలో జరిగింది. ఎస్సై లాల్‌మదార్‌తో పాటు హెడ్‌కానిస్టేబుల్ సిరాజుద్దీన్ వాంగ్మూలాన్ని విచారణ కమిషన్ నమోదు చేసింది. పోలీ్‌సపార్టీని, పంచ్‌లను రక్షించేందుకు కాల్పులు జరపాలని షాద్‌నగర్ ఏసీపీ సురేందర్ ఆదేశాలిచ్చారని వారు చెప్పారు. లొంగిపోవాలని ఏసీపీ మూడు సార్లు గట్టిగా అరిచినా.. నిందితులు దాడి ఆపలేదని తెలిపారు. నిబంధనల ప్రకారం ఎస్సై స్థాయి అధికారులకు ఏకే-47ను ఉపయోగించే అధికారం లేకున్నా.. ఎందుకు వెంట తీసుకువెళ్లారన్న కమిషన్ ప్రశ్నకు.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తీసుకెళ్లాల్సి వచ్చిందని వారు సమాధానం చెప్పారు. పొలం గట్టు కింద ఉండి 18 రౌండ్లు కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. ఏసీపీ సురేందర్, ఇన్‌స్పెక్టర్ మాదిరిగానే తమనూ ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం బెదిరించి వాంగ్మూలంపై సంతకాలు చేయించిందని వారు కమిషన్‌కు వివరించారు. ఈ సందర్భంగా కమిషన్ అడిగిన పలు ప్రశ్నలకు ఎస్సై లాల్‌మదార్.. ‘నాకు తెలియదు. అవగాహన లేదు. నా పరిధిలోకి రాదు. నాకు సంబంధం లేదు’ అని సమాధానాలివ్వడంతో.. కమిషన్.. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
కమిషన్ అధికారాల్లో జోక్యం చేసుకోలేం: హైకోర్టు
తమను స్వతంత్ర సాక్షులుగా గుర్తించి, చివరలో విచారించేలా కమిషన్‌కు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ.. దిశ ఎన్‌కౌంటర్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న పోలీసు అధికారులు సురేందర్, నర్సింహారెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌ను.. హైకోర్టు కొట్టివేసింది. విచారణకు సంబంధించి విధివిధానాలను రూపొందించుకునే అధికారం కమిషన్‌కే ఉంటుందని, ఇందులో తాము జోక్యం చేసుకోలేమని న్యాయమూర్తులు స్పష్టంచేశారు. ఎవరి సాక్ష్యాన్ని ముందు తీసుకోవాలనేది కమిషన్ పరిధిలోని అంశమని, ఎవరి సాక్ష్యాన్ని ఎప్పుడు తీసుకోవాలో తాము ఆదేశించలేమని చెప్పారు.