పల్లె, పట్టణ ప్రగతిపైనేడు అసెంబ్లీలో చర్చ

ABN , First Publish Date - 2021-10-07T07:35:18+05:30 IST

పల్లె, పట్టణ ప్రగతి అంశంపై రాష్ట్ర శాసనసభలో గురువారం స్వల్పకాలిక చర్చ

పల్లె, పట్టణ ప్రగతిపైనేడు అసెంబ్లీలో చర్చ

  • ప్రశ్నోత్తరాల అనంతరం చేపట్టనున్న సభ
  • కార్యక్రమంపై అధికారులతో సీఎం సమీక్ష 


హైదరాబాద్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): పల్లె, పట్టణ ప్రగతి అంశంపై రాష్ట్ర శాసనసభలో గురువారం స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు. ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చిద్దామంటూ సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. దీని గురించి బుధవారం ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ అధికారులతో సమీక్షించారు. కార్యక్రమం కింద చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అయితే అసెంబ్లీలో చేపట్టే చర్చలో ముందుగా సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వనున్నారు. అనంతరం ప్రభుత్వం తరఫున సీఎం పూర్తి వివరాలు వెల్లడించే అవకాశముంది. దీనికంటే ముందు ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కాగానే.. ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టనున్నారు.


ఆహార భద్రత కార్డుల దరఖాస్తులు భారీగా పెండింగ్‌లో ఉండటంపై ఎంఐఎం సభ్యులు ప్రశ్నించనున్నారు. కార్డులకు అర్హులు ఎంతమంది ఉన్నారు, ఇప్పటివరకు ఎన్ని కార్డులను జారీచేశారన్న వివరాలను వెల్లడించాలని డిమాండ్‌ చేయనున్నారు. రాష్ట్రంలో  మత్స్యకారుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యల గురించి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అడగనున్నారు. వీటితోపాటు.. పట్టణాల్లో మిషన్‌ భగీరథ కింద ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో తాగునీటి సరఫరా; రాష్ట్రంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల అమలు, లబ్ధిదారుల సంఖ్య; కొరియర్‌ సేవల ద్వారా ఆర్టీసీ ఆర్జించిన ఆదాయం; 58, 59 జీఓల ప్రకారం ఇప్పటివరకు క్రమబద్ధీకరించిన ఇళ్ల స్థలాల సంఖ్య కు సంబంధించిన ప్రశ్నలు చర్చకు రానున్నాయి.


ప్రశ్నోత్తరాల అనంతరం జీరో అవర్‌ను చేపట్టి, సభ్యుల నుంచి వినతులను స్వీకరించనున్నారు. సభలో ప్రవేశపెట్టిన ‘ఇండియన్‌ స్టాంప్‌ (తెలంగాణ అమెండ్‌మెంట్‌) బిల్లు-2021’పై చర్చను చేపట్టి, ఆమోదించనున్నారు. అనంతరం పల్లె, పట్టణ ప్రగతిపై లఘు చర్చను చేపడతారు. ఇక శాసనమండలిలో ఉదయం చేపట్టే ప్రశ్నోత్తరాల సమయంలో...విశ్వవిద్యాలయ ఆచార్యులకు సవరించిన వేతన స్కేళ్ల వర్తింపు, బకాయిల చెల్లింపు, 1991 తర్వాత నియమితులైన ప్రత్యేక ఉపాధ్యాయుల సర్వీసు క్రమబద్ధీకరణ, సేంద్రియ వ్యవసాయంలోకి మారిన రైతులకు అందిస్తున్న ప్రోత్సాహకాలపై ఎమ్మెల్సీలు ప్రశ్నలు అడగనున్నారు. 


Updated Date - 2021-10-07T07:35:18+05:30 IST