మహబూబాబాద్‌ జిల్లాలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2021-03-15T05:22:53+05:30 IST

వరంగల్‌, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా మహబూబాబాద్‌ జిల్లాలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ వర్గీయుల మ ధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది.

మహబూబాబాద్‌ జిల్లాలో ఉద్రిక్తత
నెల్లికుదురులో ఘర్షణకు దిగిన టీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తలు

మహబూబాబాద్‌, మార్చి 14 (ఆంధ్రజ్యోతి) : వరంగల్‌, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా మహబూబాబాద్‌ జిల్లాలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ వర్గీయుల మ ధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది.  వివరాల్లోకెళ్తే.. మహబూబాబాద్‌ జిల్లాలోని నెల్లికుదురు మండలకేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ ఎన్నికల సరళిని పరిశీలించి వెళ్తుండగా, బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జాటోతు హుస్సేన్‌నాయక్‌ తన వాహనంలో అక్కడికి వచ్చాడు. ఆ వాహనం తన వాహనానికి తాకిందని ఎమ్మెల్యే వెంట ఉన్న టీఆర్‌ఎస్‌ కార్యకర్త ఒకరు ఆరోపించగా టీఆర్‌ఎస్‌ నాయకులు హుస్సేన్‌నాయక్‌తో వాగ్వాదానికి దిగారు. బీజేపీ నేతలు ప్రతిఘటించడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువర్గాలను శాంతింపజేశారు.  అలాగే నెల్లికుదురుకు సమీపంలోని పార్వతమ్మగూడెం స్టేజీ వద్ద ఓ ఫంక్షన్‌హాల్లో  ఓటర్లకు భోజనాలు ఏర్పాటు చేసి డబ్బులు పంచుతున్నారని బీజేపీ కార్యకర్తలు  ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, హుస్సేన్‌నాయక్‌కు సమాచారం అందించగా వారు వాహనాల్లో అక్కడికి చేరుకున్నారు. తమ వద్దకు ఎందుకు వచ్చారని టీఆర్‌ఎస్‌ నాయకులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం తలెత్తి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌ వర్గీయులు కొందరు రాళ్లు రువ్వడంతో హుస్సేన్‌నాయక్‌ వాహనంతో పాటు బీజేపీ మండల అధ్యక్షుడు కారుపోతుల చంద్రమౌళి కారు అద్దాలు పగిలాయి. దీంతో బీజేపీ శ్రేణులు ఎదురుదాడికి దిగారు. టీఆర్‌ఎస్‌ వర్గీయులు తమపై దాడి చేశారని బీజేపీ  అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి, హుసేన్‌నాయక్‌, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వద్దిరాజు రామచందర్‌రావు మండల అధ్యక్షుడు చంద్రమౌళి ఆధ్వర్యంలో కార్యకర్తలు నెల్లికుదురు-మహబూబాబాద్‌ ప్రధాన రాహదారిపై రాస్తారోకో చేశారు. దీంతో గంట పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.  జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అక్కడికి చేరుకోని బీజేపీ నాయకులతో మాట్లాడారు. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రాస్తారోకోను విరమించారు.  మరోవైపు గూడూరులో టీఆర్‌ఎస్‌ యూత్‌ నాయకుడు కోడి రవి పుట్టినరోజు వేడుకల పేరుతో స్థానిక ఫంక్షన్‌హాల్లో లంచ్‌ ఏర్పాటు చేశారు.  అదనపు కలెక్టర్‌ అభిలాషఅభినవ్‌ అక్కడికి చేరుకొని ఓటర్లను, టీఆర్‌ఎస్‌ నాయకులను వెళ్లగొట్టారు. 

Updated Date - 2021-03-15T05:22:53+05:30 IST