దక్షిణాదిపై వివక్ష!

ABN , First Publish Date - 2021-12-15T07:55:02+05:30 IST

తమిళనాడు పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్‌ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌తో భేటీ అయ్యారు.

దక్షిణాదిపై వివక్ష!

  • ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర విధానం సరికాదు
  • తమిళనాడు సీఎం స్టాలిన్‌, సీఎం కేసీఆర్‌ల చర్చ
  • కుటుంబ సమేతంగా స్టాలిన్‌ ఇంటికెళ్లిన కేసీఆర్‌
  • యాదాద్రి ఆలయ పునఃప్రారంభానికి రావాలని ఆహ్వానం
  • ఐసీయూలో మాజీ గవర్నర్‌ నరసింహన్‌
  • కుటుంబ సభ్యులను పరామర్శించిన కేసీఆర్‌


చెన్నై/హైదరాబాద్‌, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్‌ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై చర్చ జరిగినట్లు సమాచారం. కుటుంబ సమేతంగా రెండు రోజుల పాటు తమిళనాడు పర్యటనకు వెళ్లిన కేసీఆర్‌.. సోమవారం శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మంగళవారం సాయంత్రం 4 గంటలకు కేసీఆర్‌, ఆయన సతీమణి శోభ, కేటీఆర్‌, ఆయన సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు, కూతురు అలేఖ్య, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌లు చైన్నెలోని అళ్వార్‌పేటలో ఉన్న స్టాలిన్‌ ఇంటికి వెళ్లారు. అక్కడ వారికి స్టాలిన్‌ దంపతులు, వారి కుమారుడు, సినీ హీరో ఉదయనిధి స్టాలిన్‌ సాదర స్వాగతం పలికారు. కేసీఆర్‌కు స్టాలిన్‌ శాలువా కప్పి, పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. అందరూ కలిసి గ్రూప్‌ ఫొటో తీసుకున్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌ల సతీమణులు, స్టాలిన్‌ సతీమణి కలిసి ముచ్చటించుకున్నారు. 


కేటీఆర్‌, ఉదయనిధి స్టాలిన్‌ అక్కడే ఉండి ప్రత్యేకంగా మాట్లాడుకోవడం విశేషం. మరోవైపు స్టాలిన్‌తో కేసీఆర్‌ భేటీ అయ్యారు. సీఎంలిద్దరూ మోదీ సర్కారు వైఖరిపై కూడా చర్చించినట్లు సమాచారం. దక్షిణాది రాష్ట్రాల నుంచి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం పక్షపాత ధోరణి అవలంబిస్తోందని, ఈ విధానాన్ని వ్యతిరేకించాలని అనుకున్నట్లు తెలిసింది. యాదాద్రి ఆలయ పునఃప్రారంభోత్సవానికి రావాలని సీఎం కేసీఆర్‌ స్టాలిన్‌ను ఆహ్వానించారు. స్టాలిన్‌ నివాసంలో కేసీఆర్‌ దాదాపు గంటా పది నిమిషాల పాటు ఉన్నారు. కాగా, ఇరు కుటుంబాలు ఆప్యాయంగా మాట్లాడుకున్నాయని, యాదాద్రి ఆలయానికి కుటుంబ సమేతంగా రావాలని కేసీఆర్‌ ఆహ్వానం పలికారని డీఎంకే వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో తమిళనాడు మంత్రి తంగం తెన్నరసు కూడా పాల్గొన్నారు. స్టాలిన్‌తో భేటీకి ముందు మంగళవారం ఉదయం కేసీఆర్‌ తెలంగాణ మాజీ గవర్నర్‌ ఈఎ్‌సఎల్‌ నరసింహన్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. నరసింహన్‌ అనారోగ్యంతో చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయనతో మాట్లాడే అవకాశం లేకపోవడంతో కుటుంబ సభ్యులను పరామర్శించారు. నరసింహన్‌ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ చేరుకోనున్నారు. 

Updated Date - 2021-12-15T07:55:02+05:30 IST