విచారణ కాదు.. తీర్పులే ముఖ్యం

ABN , First Publish Date - 2021-02-06T09:52:39+05:30 IST

రెవెన్యూ ప్రత్యేక ట్రైబ్యునల్‌లో కేసులను సత్వరమే తేల్చాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇందుకు సంబంధించి సీఎంవో అధికారి రెవెన్యూ ట్రైబ్యునళ్లలో

విచారణ కాదు.. తీర్పులే ముఖ్యం

నోటీసులివ్వడం.. వాదనలు వినడం వద్దు 

కలెక్టర్లకు సీఎంవో అధికారి మౌఖిక ఆదేశాలు


హైదరాబాద్‌, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ ప్రత్యేక ట్రైబ్యునల్‌లో కేసులను సత్వరమే తేల్చాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇందుకు సంబంధించి సీఎంవో అధికారి రెవెన్యూ ట్రైబ్యునళ్లలో కేసులపై జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు వెలువరించారు. రాష్ట్రవ్యాప్తంగా 16 వేలకు పైగా రెవెన్యూ కోర్టు కేసులను తేల్చడానికి నెల సమయం ఇచ్చిన ప్రభుత్వం.. 400-500 కేసులు ఉన్న జిల్లాల్లో కేసులను ఈనెల 6లోగా, 500కు పైగా కేసులున్న జిల్లాల్లో ఈనెల 10లోగా పరిష్కరించాలని సీఎంవో అధికారి ఆదేశించారు. ‘‘నేను ఇప్పటికే అందరితో మాట్లాడాను. అయితే మీరు ఫైళ్ల లోతుల్లోకి వెళ్లవద్దు. అంకెలే ముఖ్యం.. తీర్పులు ఎన్ని ఇచ్చామన్నదే కీలకం. త్వరలోనే జిల్లాల వారీగా ముఖ్యమంత్రి సమీక్ష చేయబోతున్నారు’’ అని అన్నారు. రెవెన్యూ కోర్టు కేసుల్లో తీర్పులను ఏకపక్షంగా ఇవ్వాలని, వాదులు, ప్రతివాదులకు నోటీసులు ఇవ్వడం.. వారి వాదనలు వినడం వంటి ప్రక్రియల జోలికి వెళ్లరాదని రెండు వారాల కిందటే సదరు అధికారి ఆదేశాలు ఇవ్వడం కలకలం సృష్టించింది. అయితే వాదనలు వినకుండా ఏ ప్రాతిపదికన తీర్పులు ఇస్తారని, అవి చెల్లుబాటు కావని న్యాయ నిపుణులు స్పష్టం చేసినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. తీర్పులు ఇచ్చే క్రమంలో న్యాయవాదులను కూడా అనుమతించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈనెల 10లోగా రెవెన్యూ కోర్టు కేసుల్లో తీర్పులు ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం, ఫైళ్లను ప్రామాణికం చేసుకోకుండా కేవలం అంకెలే లెక్కలోకి తీసుకోవాలని నిర్దేశించడం అధికారులను విస్మయానికి గురి చేస్తోంది. అయితే సీఎంవో అధికారి ఆదేశాలకు అనుగుణంగానే కేసులను వడివడిగా తేల్చే పనిలో కలెక్టర్లు పడ్డారు. కాగా, ప్రత్యేక ట్రైబ్యునళ్లలో కొత్తకేసులు స్వీకరించవద్దని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. 2020 అక్టోబరు 29 నాటికి దాఖలైన, స్వీకరించిన, పెండింగ్‌లో ఉన్న కేసులను మాత్రమే విచారించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ శుక్రవారం రాత్రి సర్క్యులర్‌ జారీ చేశారు. తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాసుపుస్తకం చట్టం-2020 అమలులోకి వచ్చినందున భూమితో ముడిపడిన అప్పీలను స్వీకరించే, పరిష్కరించే అధికారం రెవెన్యూ యంత్రాంగానికి లేదని చెప్పారు.

Updated Date - 2021-02-06T09:52:39+05:30 IST