గాంధీలోనూ ‘డైట్‌’ అక్రమాలు!

ABN , First Publish Date - 2021-07-12T08:29:32+05:30 IST

నిలోఫర్‌ ఆస్పత్రిలో ఆహార సరఫరాలో జరిగిన అక్రమాలే గాంధీ ఆస్పత్రిలోనూ జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గాంధీలో కూడా డైట్‌ బిల్లుల్లో ట్యాంపరింగ్‌ జరిగినట్లు

గాంధీలోనూ ‘డైట్‌’ అక్రమాలు!

ఆహార సరఫరా బిల్లుల్లో ట్యాంపరింగ్‌..

అంతర్గత విచారణలో అవకతవకల వెల్లడి.. కొద్ది నెలలపాటు బిల్లులు కూడా నిలిపివేత?

నిలోఫర్‌ కాంట్రాక్టరే గాంధీ, చెస్ట్‌ ఆస్పత్రికీ..

ఆరోపణలున్న వారిని కొనసాగించడంపై  ఇప్పటికే సర్కారుకు పలువురి ఫిర్యాదులు 

డీడీఎంసీ దృష్టిపెట్టాలంటున్న గాంధీ సిబ్బంది


హైదరాబాద్‌, జూలై 11 (ఆంధ్రజ్యోతి): నిలోఫర్‌ ఆస్పత్రిలో ఆహార సరఫరాలో జరిగిన అక్రమాలే గాంధీ ఆస్పత్రిలోనూ జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గాంధీలో కూడా డైట్‌ బిల్లుల్లో ట్యాంపరింగ్‌ జరిగినట్లు అక్కడి సిబ్బంది చెబుతున్నారు. నిలోఫర్‌ ఆస్పత్రి డైట్‌ కాంట్రాక్టరే గాంధీ, చెస్ట్‌ ఆస్పత్రుల్లో కూడా రోగులకు ఆహార సరఫరా చేస్తున్నారు. గాంధీలో డైట్‌ కాంట్రాక్టును అతడు రెండేళ్ల క్రితం దక్కించుకున్నాడు. టెండర్‌లో ఒక్కో డైట్‌కు రూ.36 చొప్పున సరఫరా చేసేందుకు కోట్‌ చేశారు. అయితే గతేడాది కొవిడ్‌ నేపథ్యంలో గాంధీ ఆస్పత్రిని పూర్తిగా కొవిడ్‌ ఆస్పత్రిగా మార్చారు. వారికి బలవర్ధకమైన ఆహారం అందించేందుకుగాను ఒక్కో డైట్‌కు ప్రభుత్వం రోగులకు రూ.275 చెల్లిస్తోంది. వైద్యులకైతే రూ.325 చొప్పున ఇస్తోంది. అయితే సాధారణ డైట్‌తోపాటు కొవిడ్‌ డైట్‌ సరఫరాలోనూ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. వార్డు డైట్‌ బుక్స్‌లో ఒకటి రాస్తే, కాం ట్రాక్టర్‌ డైట్‌ బుక్‌లో రాసేది మరోలా ఉంటుందన్న ఆరోపణలున్నాయి. దీనిపై గాంధీ ఆస్పత్రి ఉన్నతాధికారులు అంతర్గతంగా విచారణ కమిటీని వేశారు. బిల్లుల్లో ట్యాం పరింగ్‌ జరిగినట్లు, కాంట్రాక్టర్‌ అవకతవకలకు పాల్పడినట్లు విచారణలో తేలడంతో 3-4 నెలల బిల్లులను నిలిపివేసినట్లు అక్కడి సిబ్బంది చెబుతున్నారు. బిల్లుల చెల్లింపులోనూ కొంత కోత పెట్టినట్లు తెలుస్తోంది. 


సర్కారుకు ఫిర్యాదులు..

నిలోఫర్‌ ఆస్పత్రిలో అక్రమాలు జరిగి, కాంట్రాక్టర్‌ను అరెస్టు చేసేవరకు వెళ్లడంతో గాంధీ, చెస్ట్‌ ఆస్పత్రుల్లో అదే కాంట్రాక్టర్‌ను కొనసాగించడంపై ఇప్పటికే కొందరు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆహార సరఫరాకు సంబంధించిన మొత్తం వ్యవహారాలపై విచారణ జరపాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని ఆస్పత్రుల్లో ఆహార సరఫరాకు సంబంధించి డీడీఎంసీ( డిస్ట్రిక్‌ డైట్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ) ఉంటుంది. దానికి చైర్మన్‌గా జిల్లా కలెక్టర్‌ వ్యవహరిస్తారు. అయితే గాంధీలో జరుగుతున్న డైట్‌ అక్రమాలు డీడీఎంసీ దృష్టికి వెళ్లకుండా ఆస్పత్రిలో పాలన వ్యవహారాలు చూసేవారు తొక్కిపెడుతున్నారన్న ఆరోపణలున్నాయి. దీనిపై డీడీఎంసీ దృష్టిపెట్టాలని అక్కడి వైద్య సిబ్బంది కోరుతున్నారు. 


డైట్‌ కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టాలి 

నిలోఫర్‌ ఆస్పత్రిలో అక్రమాలకు పాల్పడిన డైట్‌ కాంట్రాక్టర్‌ ఇతర ఆస్పత్రుల్లో సక్రమంగా ఎలా వ్యవహరిస్తాడు? అతడ్ని ఇంకా కొనసాగించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆ కాంట్రాక్టర్‌ను వెంటనే బ్లాక్‌లిస్టులో పెట్టాలి. గాంధీ, చెస్ట్‌ ఆస్పత్రుల్లోని డైట్‌ కాంట్రాక్టును తక్షణమే రద్దు చేయాలి. 

 ఎం.శ్రీనివాస్‌, సీపీఎం గ్రేటర్‌ కార్యదర్శి

Updated Date - 2021-07-12T08:29:32+05:30 IST