దళిత బంధు వద్దని నేను లేఖ రాశానా?
ABN , First Publish Date - 2021-10-20T08:50:48+05:30 IST
దళిత బంధు వద్దని నేను లేఖ రాశానా?

సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ నిరూపిస్తారా..?: ఈటల
హుజూరాబాద్, అక్టోబరు 19: ‘దళిత బంధు వద్దని నేను లేఖ రాసినట్లు నిరూపిస్తావా..? చెల్పూర్‌లోని పోచమ్మ గుడికి వస్తా.. నువ్వు వస్తావా కేసీఆర్..? నువ్వు వస్తావా హరీశ్..?’ అని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. మంగళవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో ఈటల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తన పేరుతో రోజుకో దొంగ ఉత్తరం పుట్టిస్తున్నారని, డ్రామాలు ఆడే హరీశ్‌రావు, కేసీఆర్ ఇప్పుడు కొత్త నాటకానికి తెరలేపారని అన్నారు. దళితబంధు పథకాన్ని మొదట ఇక్కడ ప్రారంభించలేదని, భువనగిరి జిల్లా వాసాలమర్రిలో మొదలు పెట్టారని చెప్పారు. ఎన్నికల కోడ్ వస్తుందనే ఆలోచనతో అక్కడ మొదలు పెట్టారని, సీఎం కేసీఆర్‌కు నిజంగా ఈ పథకంపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే అమలు చేయాలని గతంలోనే తాను డిమాండ్ చేశానని గుర్తుచేశారు. పథకాన్ని ప్రకటించి 70 రోజులైనా ఇంకా ఎందుకు అందరికీ అందించలేదని ప్రశ్నించారు. దళితులకు మూడెకరాల భూమిని ఎవరు అడ్డుకున్నారని, ఎందుకు ఇవ్వలేదని ఈటల ప్రశ్నించారు.