మధుమేహ బాధితులు తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ!

ABN , First Publish Date - 2021-08-20T09:43:20+05:30 IST

రక్తపోటు, మధుమేహం, జీర్ణ సంబంధ వ్యాధులు.. ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిపోతున్న ఆరోగ్య సమస్యలివి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ‘వయసులో ఉన్నాం కదా. మనకేం కాదులే’ అని యువకులు

మధుమేహ బాధితులు తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ!

దేశ సగటు కంటే ఏపీ, తెలంగాణలోనే అధికం

గడిచిన 20 ఏళ్లలో బాగా పెరిగిన రోగులు

థాట్‌ ఆర్బిట్రేట్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నివేదికలో వెల్లడి

కాలుష్యం, ఆహార అలవాట్లు, జీవనశైలితోనే ముప్పు

‘ఇల్‌నెస్‌ టు వెల్‌నెస్‌’ చర్చావేదికలో వైద్యులు


హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): రక్తపోటు, మధుమేహం, జీర్ణ సంబంధ వ్యాధులు.. ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిపోతున్న ఆరోగ్య సమస్యలివి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ‘వయసులో ఉన్నాం కదా. మనకేం కాదులే’ అని యువకులు నిర్లక్ష్యంగా ఉండొద్దని వైద్యులు సూచిస్తున్నారు. అసోచాం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ‘ఇల్‌నెస్‌ టు వెల్‌నెస్‌’ పేరుతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల ఆరోగ్యంపై ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో పలువురు వైద్యులు పాల్గొన్నారు. అపోలో ఆస్పత్రి సీనియర్‌ కన్సల్టెంట్‌ సీహెచ్‌ వసంత్‌కుమార్‌ మాట్లాడుతూ.. గడిచిన 20 ఏళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో హృద్రోగాలు, కేన్సర్‌, మధుమేహం, రక్తపోటు వంటి అసంక్రమణ వ్యాధుల బారినపడే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. వాయుకాలుష్యం, మారుతున్న ఆహార అలవాట్లు, జీవన శైలి కారణంగా రక్తపోటు, మధుమేహం, జీర్ణ సంబంధ సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు. ధూమపానం, మద్యపానం కారణంగా 60 శాతం వరకు కేన్సర్‌, మధుమేహం, బీపీ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. ముందుగా పరీక్షలు చేయించుకొని ఇలాంటి వ్యాధులను ప్రాథమిక దశలో గుర్తిస్తే ముప్పును తప్పించుకోవచ్చని సూచించారు.  మాంసాహారం మీద మక్కువతో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను తీసుకోకపోవడం, ఉప్పు ఎక్కువగా ఉండే పచ్చళ్లు ఆరోగ్యానికి చేటు చేస్తున్నాయని తెలిపారు. రిఫైన్డ్‌ ఉప్పు, పంచదార మనకు నష్టం కలిగిస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ 7-8 గంటలు తప్పనిసరిగా నిద్ర పోవాలని చెప్పారు. 


దిగువ మధ్యతరగతి వారే..

దిగువ మధ్యతరగతి వారే ఇలాంటి వ్యాధుల బారినపడే అవకాశం ఎక్కువగా ఉందని.. వీరు వైద్య ఖర్చులు భరించలేక రోగాలను తీవ్రతరం చేసుకుంటున్నారని వైద్యులు తెలిపారు. గడిచిన 20 ఏళ్లలో రక్తపోటు, హృద్రోగాలు, మధుమేహ బాధితులు తెలుగు రాష్ట్రాల్లో పెరిగారని థాట్‌ ఆర్బిట్రేట్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫౌండర్‌, కో డైరెక్టర్‌ కౌశిక్‌ దత్తా వెల్లడించారు. అధిక రక్తపోటు, ఊబకాయం, హృద్రోగాలు, కేన్సర్‌ వంటి అసంక్రమిత వ్యాధుల బారినపడ్డ వారిలో దేశ సగటుకు మించి రెండు తెలుగు రాష్ట్రాల వారు ఎక్కువన్నారు. మద్యపానంలోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు.పచ్చళ్ల పేరుతో ఉప్పు, వేపుళ్ల పేరుతో నూనెను ఎక్కువగా తీసుకోవడం, పెరిగిన కాలుష్యం కారణంగా జీర్ణ సమస్యలు వస్తున్నాయని అపోలో హెల్త్‌సిటీ గ్యాస్ట్రో ఎంట్రాలజీ కన్సల్టెంట్‌ కేఎస్‌ సోమశేఖర్‌రావు అన్నారు.


కాలుష్యం ఇతర కారణాలతో మద్యం తాగే వారిలో వచ్చే ఫాటీ లివర్‌ సమస్య, మద్యం తాగని వారికీ వస్తుందని చెప్పారు. మంచి బ్యాక్టీరియా ఉండే పెరుగు, గుడ్లు, పాలు, పండ్లు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. హృద్రోగాలు వచ్చేందుకు మధుమేహం, బీపీ, ఊబకాయం, ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, ఆహార అలవాట్లు ప్రధాన కారణాలుగా ఉంటున్నాయని విరించి ఆస్పత్రి కన్సల్టెంట్‌ కార్డియాలజిస్ట్‌ కె.శరత్‌చంద్ర అన్నారు. 

Updated Date - 2021-08-20T09:43:20+05:30 IST