డ్యాముల వద్ద ఢీ అంటే ఢీ

ABN , First Publish Date - 2021-07-02T08:11:37+05:30 IST

నాగార్జున సాగర్‌లో గురువారం సాయంత్రానికి 534 అడుగుల (176.0590 టీఎంసీలు) మేర నీరుంది. ప్రాజెక్టు నుంచి ఎస్‌ఎల్‌బీసీ ద్వారా వెయ్యి క్యూసెక్కులు, ప్రధాన జల విద్యుత్కేంద్రానికి 30,723 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.

డ్యాముల వద్ద ఢీ అంటే ఢీ

  • సాగర్‌, శ్రీశైలం, పులిచింతలలో భారీ బందోబస్తు
  • డ్యాంలకు ఇటు తెలంగాణ అటు ఏపీ పోలీసులు
  • నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు వద్ద టెన్షన్‌ టెన్షన్‌
  • ఏపీ అధికార్లను అడ్డుకున్న తెలంగాణ పోలీసులు
  • ప్రతిగా ఏపీలో తెలంగాణ ఎస్‌ఈ అడ్డగింత
  • పులిచింతలలో మాత్రం లేఖ తీసుకున్న ఎస్‌ఈ
  • జూరాల వద్ద కూడా 130 మందితో బందోబస్తు


నాగార్జున సాగర్‌/చింతలపాలెం, గద్వాల, నాగర్‌కర్నూల్‌ జూలై 1: నాగార్జున సాగర్‌ జలాశయం.. అటు ఆంధ్రా పోలీసులు! ఇటు తెలంగాణ పోలీసులు! శ్రీశైలం పవర్‌ హౌస్‌కు అటూ ఇటూ భారీ భద్రత! ఎడమ గట్టు కాల్వపై వందమంది నిఘా! పులిచింతల ప్రాజెక్టుకు ఇరువైపులా రెండు వందల మందికిపైగా బలగాల మోహరింపు! చివరికి, తెలంగాణలోని జూరాల ప్రాజెక్టు వద్దా భారీ పోలీసు బందోబస్తు! కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల వద్ద పోలీసు పహారా! అటు పులిచింతల, ఇటు నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుల వద్ద గురువారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు రోజులుగా ప్రధాన విద్యుత్కేంద్రంలో తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తుండగా.. దానిని నిలిపి వేయాలని ఆంధ్రప్రదేశ్‌ అధికారులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే, ఇటువైపు తెలంగాణ పోలీసులు, అటు ఏపీ పోలీసులు మోహరించారు. శ్రీశైలం ఎడమ గట్టు  పవర్‌ హౌస్‌ చుట్టూ గురువారం నాగర్‌కర్నూల్‌ ఎస్పీ వై.సాయిశేఖర్‌ పర్యవేక్షణలో వందమంది పోలీసులు పహారా కాశారు. సరిహద్దులోని పాతాళగంగ వద్ద ఇరు రాష్ట్రాల నుంచి వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్నారు. 


ఈ పరిణామాల మధ్య సాగర్‌ ప్రధాన జల విద్యుత్కేంద్రంలో ఉత్పత్తిని నిలిపి వేయాలంటూ జెన్‌కో అధికారులకు లేఖ ఇచ్చేందుకు ఏపీ నీటి పారుదల శాఖ ఎస్‌ఈ పురుషోత్తం గంగరాజు తెలంగాణ వైపునకు రాబోయారు. ఆయనను తెలంగాణ పోలీసులు అడ్డుకుని వెనక్కు పంపారు. దీనికి బదులుగా అన్నట్లు విజయపురి సౌత్‌ వైపున్న లేక్‌ వ్యూ గెస్ట్‌ హౌస్‌ వద్దకు వెళ్తున్న తెలంగాణ ఎస్‌ఈ ధర్మానాయక్‌ను ఏపీ పోలీసులు ప్రధాన డ్యాంకు అవతలి వైపున అడ్డుకున్నారు. ఇక పులిచింతల ప్రాజెక్టు వద్ద కూడా ఇదే పరిస్థితి. కాకపోతే, ఏపీలోని గుంటూరు జిల్లా ఎస్పీ భాస్కరన్‌, సాగునీటి అధికారులు.. పులిచింతల టీఎస్‌ జెన్‌కో ఎస్‌ఈ దేశ్యా నాయక్‌తో చర్చలు జరిపారు. విద్యుదుత్పత్తి నిలిపివేయాలంటూ ఏపీ ఇరిగేషన్‌ ఎస్‌ఈ రమే్‌షబాబు ఇచ్చిన వినతిప్రతం అందజేశారు. దానిని తీసుకున్న దేశ్యా నాయక్‌.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కాగా, సాగర్‌ ప్రధాన డ్యామ్‌ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో గుంటూరు జిల్లా ఎస్పీ విశాల్‌ గున్నీ, నల్లగొండ జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్‌ ఏపీ పరిధిలోని విజయపురి సౌత్‌ లేక్‌ వ్యూ అతిథి గృహంలో సమావేశమయ్యారు. ఈ భేటీలో శాంతిభద్రతల సమస్య లేకుండా సామరస్యంగా ముందుకెళ్దామని చర్చ జరిగినట్లు తెలిసింది. 


24 గంటల్లో 660 మెగావాట్ల ఉత్పత్తి

శ్రీశైలంతోపాటు నాగార్జున సాగర్‌ టెయిల్‌పాండ్‌, పులిచింతలలోనూ విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. సాగర్‌ ప్రధాన విద్యుత్కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం నుంచి 24 గంటల్లో 660 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. పులిచింతలలఓ గంటకు 30 మెగావాట్లను ఉత్పత్తి చేస్తున్నారు.


జూరాలపై రాకపోకలు నిలిపివేత

గద్వాల జిల్లాలోని జూరాల డ్యాంపై కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గద్వాల, వనపర్తి జిల్లాలకు చెందిన సుమారు 130 మంది పోలీసులు పహారా నిర్వహిస్తున్నారు. ప్రాజెక్టు మీదుగా మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాల ప్రజలు గద్వాల, రాయిచూరుకు వెళ్లడాన్ని నిలిపివేశారు. దిగువ జూరాల విద్యుదుత్పత్తి కేంద్రంతో పాటు ఎగువ జూరాల కేంద్రం వద్ద కూడా పహారా నడుస్తోంది.


సాగర్‌ నీటి మట్టం 534 అడుగులు

నాగార్జున సాగర్‌లో గురువారం సాయంత్రానికి 534 అడుగుల (176.0590 టీఎంసీలు) మేర నీరుంది. ప్రాజెక్టు నుంచి ఎస్‌ఎల్‌బీసీ ద్వారా వెయ్యి క్యూసెక్కులు, ప్రధాన జల విద్యుత్కేంద్రానికి 30,723 క్యూసెక్కులను  విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి అంతే మొత్తంలో నీరు వస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టులో 823.20 అడుగుల (43.34  టీఎంసీలు) మేర నీరుంది. శ్రీశైలం నుంచి 12,901 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. పులిచింతల ప్రాజెక్టుకు స్వల్పంగా వరద చేరుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 175 (45.77టీఎంసీలు) అడుగులు కాగా 156.29 (21.49టీఎంసీలు) అడుగులకు చేరుకుంది. ఎగువనుంచి 44,639 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.

Updated Date - 2021-07-02T08:11:37+05:30 IST