దారుల్లేని ‘ధరణి’!

ABN , First Publish Date - 2021-02-26T07:11:42+05:30 IST

భూముల వివాదాలపై ధరణి పోర్టల్‌లో ప్రజలు విజ్ఞప్తులు చేసుకునే అవకాశానికి బ్రేక్‌ పడింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు పోర్టల్‌లో ఇచ్చిన రెండు ఆప్షన్లను తొలగించారు. భూముల సమస్యలపై ప్రజల నుంచి

దారుల్లేని ‘ధరణి’!

పోర్టల్‌లో ‘గ్రీవన్స్‌, ల్యాండ్‌ మేటర్స్‌’కు తాళం

అర్ధంతరంగా రెండు ఆప్షన్ల తొలగింపు

2 రోజుల్లో ధరణిపై కలెక్టర్లతో సీఎం కాన్ఫరెన్స్‌

మ్యుటేషన్లు, ట్రైబ్యునళ్లు, ఎన్నారై పాస్‌పుస్తకాలపై సమీక్ష సమావేశం!

7 రోజులుగా జిల్లాల్లో ద్విసభ్య కమిటీ పర్యటన

కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో కమిటీ నివేదికే కీలకం!


హైదరాబాద్‌, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): భూముల వివాదాలపై ధరణి పోర్టల్‌లో ప్రజలు విజ్ఞప్తులు చేసుకునే అవకాశానికి బ్రేక్‌ పడింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు పోర్టల్‌లో ఇచ్చిన రెండు ఆప్షన్లను తొలగించారు. భూముల సమస్యలపై ప్రజల నుంచి కలెక్టర్లు విజ్ఞప్తులు తీసుకోవడంతో పాటు ఆయా దరఖాస్తులను పరిశీలించడానికి వీలుగా ధరణి పోర్టల్‌లో ‘గ్రీవెన్స్‌, ల్యాండ్‌ మేటర్స్‌’ ఆప్షన్లు ఇచ్చారు. వీటికింద పట్టాదారు పాస్‌పుస్తకంలో విస్తీర్ణం తగ్గడం, అకారణంగా పార్ట్‌-బీ (వివాదాస్పద భూముల)జాబితాలో చేర్చడం, వివాదం లేనప్పటికీ పాస్‌పుస్తకాలు నిరాకరించడం, సర్వేనంబరులో తప్పిదాలు, పేర్ల తప్పు.. వంటి అంశాలపై ప్రజల నుంచి దాదాపు 6లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ల్యాండ్‌ మేటర్స్‌లో కూడా భూములతో ముడిపడిన అన్ని అంశాలపై దరఖాస్తులు వచ్చాయి. ఈ రెండు ఆప్షన్లను ధరణి నుంచి అర్ధాంతరంగా తొలగించారు. వాటిని ఎందుకు తొలగించారు? ఎప్పుడు పునరుద్ధరిస్తారన్న విషయమై స్పష్టత కొరవడింది. దీంతో భూముల సమస్యలు ఉన్నవారు వాటిని ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా.. శని లేదా ఆదివారం ధరణిపై సీఎం కేసీఆర్‌ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు.


ఈ కాన్ఫరెన్స్‌లో రెండు ఆప్షన్లపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ధరణిలో సమస్యలపై సీఎంవో నియమించిన ద్విసభ్య కమిటీ (రామయ్య, సుందర్‌ అబ్నార్‌) వారం రోజులుగా జిల్లాల్లో పర్యటిస్తోంది. ధరణిలో ఏమేం సమస్యలున్నాయి? వాటిని ఎలా పరిష్కరించాలో? వారు అధ్యయనం చేస్తున్నారు. ధరణిలోని సమస్యలపై సీఎం కేసీఆర్‌ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తుండడంతో ఈ కమిటీ ఇచ్చే నివేదిక కీలకం కానుంది. ఇక పెండింగ్‌ మ్యుటేషన్లను యుద్ధప్రాతిపదికన క్లియర్‌ చేస్తున్నారు. ఏకకాలంలో 20 దాకా విజ్ఞప్తులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చి.. తహసీల్దార్లకు అప్పగిస్తున్నారు. దీంతో ఈ సమస్య దాదాపుగా తీరే అవకాశం ఉంది. 


సీఎం చెప్పిందొకటి.. 

ఆధార్‌ కార్డులు లేవనే కారణంతో మూడున్నరేళ్లుగా ఎన్నారైలకు పాస్‌పుస్తకాలు ఇవ్వకుండా ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టగా.. పాస్‌పోర్ట్‌ ఆధారంగా పాస్‌పుస్తకాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. భూములు కొంటేనే ఆ వివరాలు రికార్డుల్లో చేర్చడానికి మ్యుటేషన్‌ చార్జీలు వసూలు చేస్తారు. కానీ, ఎన్నారైలు ఎకరానికి రూ.3 వేల చొప్పున మ్యుటేషన్‌ చార్జీలు చెల్లించాలని అధికారులు నిబంధన పెట్టారు. పాస్‌పోర్ట్‌ ఉన్నప్పటికీ ఓవర్సీస్‌ సిటిజన్‌ ఆఫ్‌ ఇండియా కార్డు నంబరు పేర్కొనాలనే నిబంధన పెట్టడంతో ప్రవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సులభతర విధానంలో పాస్‌పుస్తకాలు ఇవ్వాలని కోరుతున్నారు. 


అప్‌లోడ్‌ అవుతున్న ట్రైబ్యునల్‌ తీర్పులు 

రాష్ట్రంలోని రెవెన్యూ కోర్టుల్లో అపరిష్కృతంగా ఉన్న 16910 కేసులను పరిష్కరించడానికి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు  సభ్యులుగా ప్రత్యేక ట్రైబ్యునళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వాదులు, ప్రతివాదులకు నోటీసులు ఇవ్వకుండానే ఈ కేసులన్నింటినీ ఈ నెల 10లోపు క్లోజ్‌ చేసేశారు. సీసీఎల్‌ఏ వెబ్‌సైట్‌లో ఈ తీర్పులను అప్‌లోడ్‌ చేస్తున్నారు. వీటిని పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టలేదు. రెండురోజుల్లో సీఎం సమీక్ష ఉండడంతో తీర్పులన్నీ అప్‌లోడ్‌ చేయాలని సీఎస్‌ సోమేశ్‌ గురువారం కలెక్టర్లను ఆదేశించారు. దీంతో అధికారులు పాట్లు పడుతున్నారు. ఇవన్నీ పబ్లిక్‌ డొమైన్‌లో చేరితే ఏం సమస్యలు వస్తాయోనని ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2021-02-26T07:11:42+05:30 IST