భక్తజన సందడి షురూ..

ABN , First Publish Date - 2021-06-21T05:45:26+05:30 IST

భక్తజన సందడి షురూ..

భక్తజన సందడి షురూ..
కాళేశ్వరం వద్ద గోదావరిలో స్నానాలు చేస్తున్న భక్తులు

తెరుచుకున్న ఆలయాలు

పునఃప్రారంభమైన దర్శనాలు


మహదేవపూర్‌, జూన్‌ 20: మండలంలోని  పుణ్యక్షేత్రం  కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలోకొద్ది రోజులుగా ఇక్కడ దర్శనాలు నిలిపివేశారు. లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో భక్తులను ఆదివారం అనుమతించారు. త్రివేణి సంగమం గోదావరిలో స్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.  

రామప్ప దేవాలయంలో...

వెంకటాపూర్‌(రామప్ప) : రామప్ప రామలింగేశ్వరస్వామి దేవాలయంలో  దర్శనాలు పునఃప్రారంభమయ్యాయి. కొవిడ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో  ఏప్రిల్‌ 15న ఆలయంలో భక్తుల ప్రవేశాన్ని నిలిపివేశారు. అప్పటి నుంచి రోజూ ఉదయం స్వామివారికి నిత్యపూజలు మాత్రమే నిర్వహించినట్టు ఈవో బిల్ల శ్రీనివాస్‌ తెలిపారు. లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో ఆలయంలో యధావిధిగా స్వామివారికి అర్చ నలు, అభిషేకాలు చేసుకోవచ్చని, అలాగే వాహన పూజలు కొనసాగుతాయని పేర్కొన్నారు.  భక్తులు, పర్యాటకుల కొవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించారు.

కోటంచ ఆలయంలో ..

రేగొండ : కోటంచ ఆలయంలో ఆర్జిత సేవలు ప్రారంభమయ్యాయని ఈవో  శ్రీనివాస్‌, చైర్మన్‌ హింగె మహేందర్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ భక్తులు స్వామివారి పూజా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు.

హేమాచల క్షేత్రంలో..

మంగపేట :  మల్లూరు హేమాచల లక్ష్మీనరసింహస్వామి  క్షేత్రంలో ఆదివారం దర్శనాలు ప్రారంభమయ్యాయి. కొవిడ్‌ కారణంగా ఏప్రిల్‌ 15న ఆలయాన్ని మూసివేశారు. భక్తులను అనుమతించకుండా అర్చకులు మాత్రమే నిత్య పూజలు   చేశారు. లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో దర్శనాలు పునఃప్రారంభమయ్యాయి. ఆదివారం సుమారు 700 మంది భక్తులు దైవ దర్శనాలను చేసుకున్నారని ఆలయ ఉద్యోగులు తెలిపారు. 


Updated Date - 2021-06-21T05:45:26+05:30 IST