ప్రజాస్వామ్య సంస్థలు మరణిస్తున్నాయి

ABN , First Publish Date - 2021-06-22T07:32:26+05:30 IST

తెలంగాణలో ప్రజాస్వామ్య సంస్థలు మరణిస్తున్నాయని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు.

ప్రజాస్వామ్య సంస్థలు మరణిస్తున్నాయి

  • స్వతంత్ర భారతంలో ఇలాంటివి చూడలేదు
  • కేసీఆర్‌ కాళ్లుపట్టుకున్న కలెక్టర్ల తీరుపై ఉత్తమ్‌
  • కాళ్లు మొక్కించుకోవడం సిగ్గుచేటు: సంజయ్‌
  • ఇదెక్కడి దుష్ట సంప్రదాయం: కోదండరాం


హైదరాబాద్‌/కామారెడ్డి, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ప్రజాస్వామ్య సంస్థలు మరణిస్తున్నాయని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్లు సీఎం కేసీఆర్‌ కాళ్లు పట్టుకోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఈ విషయంపై ఉత్తమ్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాళ్లు మొక్కిన సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి, కామారెడ్డి కలెక్టర్‌ శరత్‌ ఫొటోలను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. స్వతంత్ర భారత దేశంలో ఇటువంటి ఘటనను ఎప్పుడూ చూడలేదని అన్నారు. తాను 32 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ఎప్పుడూ కలెక్టర్‌ హోదాలో ఉన్న అధికారులు ప్రజాప్రతినిధుల కాళ్లు మొక్కడం చూడలేదని  కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీ అన్నారు. కలెక్టర్లతో కాళ్లు మొక్కించుకునే దుస్థితి సిగ్గుచేటు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. ‘‘జిల్లా ప్రజల ప్రతినిధిగా ఉన్న ఒక కలెక్టర్‌.. సీఎం కాళ్లు మొక్కడం ఏం సంప్రదాయం? ఆయన ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాలి. అలాంటిది కాళ్లు మొక్కే దుష్ట సంప్రదాయాన్ని ఎందుకు పెంపొందిస్తున్నారు?’’ అని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం వ్యాఖ్యానించారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ వర్ధంతి సందర్భంగా సోమవారం జన సమితి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి కోదండరాం నివాళులర్పించారు. జయశంకర్‌ ఎవరికీ భయపడేవారు.. లొంగేవారు కాదని అన్నారు. ఒక్క కలంపోటుతో ఉద్యోగం నుంచి తీస్తానని అప్పటి సీఎం బ్రహ్మానందరెడ్డి హెచ్చరిస్తే.. తీసేయాలనుకుంటే తీసేయండి అంటూ సమాధానం ఇచ్చిన ఆత్మగౌరవం జయశంకర్‌దని కొనియాడారు. 

Updated Date - 2021-06-22T07:32:26+05:30 IST