హెచ్‌ఆర్‌సీటీ స్కానింగ్‌కు డిమాండ్‌!

ABN , First Publish Date - 2021-05-05T08:38:45+05:30 IST

కొవిడ్‌-19 నిర్ధారణకు చాలా మంది ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలను ప్రామాణికంగా తీసుకుంటున్నారు.

హెచ్‌ఆర్‌సీటీ స్కానింగ్‌కు డిమాండ్‌!

  • రిపోర్టు రావడానికి 6-72 గంటలు.. 
  • హైదరాబాద్‌లో ధరలూ పెంచారంటున్న రోగులు
  • స్వల్పంగానే పెరిగాయి: డయాగ్నస్టిక్స్‌ 
  • పరీక్షలపై యాప్‌ల్లో 10-25% రాయితీలు

హైదరాబాద్‌ సిటీ, మే 4 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌-19 నిర్ధారణకు చాలా మంది ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. మరికొందరు ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చినా వైరస్‌ తిష్ఠ వేసిందేమోనన్న అనుమానంతో హెచ్‌ఆర్‌సీటీ పరీక్షలను చేస్తున్నారు. కొందరికి ఈ పరీక్షలో వైరస్‌ సోకినట్లు నిర్ధారణ కావడంతో చికిత్స అందిస్తున్నారు. ఇక  కొవిడ్‌ వచ్చి తగ్గిన వారికి సైతం హెచ్‌ఆర్‌సీటీ పరీక్షలు చేయించుకుంటే మంచిదని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. దీంతో చాలామంది ఈ పరీక్షలను చేయించుకుంటుండడంతో ప్రైవేట్‌ల్యాబ్‌లపై ఒత్తిడి పెరిగిపోయింది. అలాగే టెస్టు ధరలు కూడా పెంచేశారు.


గతంలో హైదరాబాద్‌లో హెచ్‌ఆర్‌సీటీ పరీక్షకు రూ.3000-4500 వసూలు చేస్తే ఇప్పుడు మాత్రం రూ.6000 వరకూ వసూలు చేస్తున్నాయి. ఇక పరీక్షల నివేదికలకు అధిక శాతం ల్యాబ్‌లు 6 నుంచి 72 గంటల సమయం తీసుకుంటూ రోగుల సహనానికి పరీక్షలు పెడుతున్నాయి. ధరలు పెంచడానికి ప్రధాన కారణం ఒత్తిడి పెరగడమేనని కొందరు ప్రైవేట్‌ ల్యాబ్‌ల నిర్వాహకులు చెబుతున్నారు. గతంలో రోగులు ఎప్పుడో కానీ హెచ్‌ఆర్‌సీటీ పరీక్షకు వచ్చే వారనీ,  ఇప్పుడు రోజుకు కనీసం 10కు పైగా ఎంక్వైరీలు వస్తున్నాయని మూసాపేటలోని ఓ ల్యాబ్‌  ప్రతినిధి చెప్పారు. తాము నివేదిక ఇవ్వడానికి 6-8 గంటలు తీసుకుంటున్నామని, గతంలో రెండు గంటల్లోపే నివేదిక అందించేవాళ్లమని తెలిపారు. 


కార్పొరేట్‌ చెప్పిందే వేదం..!

తెలంగాణలో వైద్య రంగంలో కార్పొరేట్‌ ఆస్పత్రులు చెప్పిందే వేదంలా నడుస్తున్నట్లుందని రిటైర్డ్‌ ఉద్యోగి వామనరావు అంటున్నారు. ‘‘ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలకు పక్క రాష్ట్రాల్లో పరిమితి విధించిన తర్వాత ఎప్పటికో మేలుకుని ఇక్కడ ప్రభుత్వం నిబంధన విధించింది. అదీ సరిగ్గా అమలు కావడం లేదు. హెచ్‌ఆర్‌సీటీ పరీక్షలు మరీ దారుణం. ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో హెచ్‌ఆర్‌సీటీ పరీక్షల ధరలపై నియంత్రణ విధిస్తే, ఇక్కడ మాత్రం కనీసం ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామనే ప్రకటనలు కూడా లేవు. బహుశా ముఖ్యమంత్రి చెబుతున్నట్లు తెలంగాణ ధనిక రాష్ట్రమనే తగ్గించడం లేదేమో?’’ అని దుయ్యబట్టారు. మరోవైపు శానిటైజేషన్‌, సిబ్బంది భద్రత ఖర్చులు పెరగడంతో పాటు కరోనా వేళ రేడియాలజి్‌స్టలు ఎక్కువగా డిమాండ్‌ చేస్తుండడం కూడా ధరల పెరుగుదలకు కారణమని ప్రైవేటు ల్యాబ్‌ నిర్వాహకులు పేర్కొంటున్నారు. అయితే ధరలు స్వల్పంగానే పెరిగాయని చెబుతున్నారు. ఒక్కో ల్యాబ్‌లో ఒక్కో ధర ఎందుకో తమకు అర్థం కావడం లేదని రోగులు వాపోతున్నారు. నగరంలో రూ.3100కు హెచ్‌ఆర్‌సీటీ అందిస్తున్న ల్యాబ్‌లూ ఉన్నాయి, రూ.6300 వసూలు చేస్తున్న ల్యాబ్‌లూ ఉన్నాయని.. ప్రభుత్వం ధరల నియంత్రణ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


యాప్‌లపై నజరానాలు 

నేరుగా వెళ్తే రోగుల నుంచి అధికంగా డిమాండ్‌ చేస్తున్న ప్రైవేట్‌ ల్యాబ్‌లు, ఆస్పత్రులు.. యాప్‌లు, వెబ్‌సైట్‌ల ద్వారా అపాయింట్‌మెంట్‌ తీసుకుని వెళ్తే మాత్రం 10-25ు రాయితీలను అందిస్తున్నాయి. నగరంలోని పేరొందిన అన్ని డయాగ్నస్టిక్‌ కేంద్రాలూ ఇలా డిస్కౌంట్లు ఇస్తున్నాయి. వాస్తవానికి ఆ ల్యాబ్‌లతో తమకున్న ఒప్పందాల కారణంగానే తాము రాయితీలను అందించగలుగుతున్నామని యాప్‌ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. 

Updated Date - 2021-05-05T08:38:45+05:30 IST