పల్లెకు వెళ్తేనే డాక్టర్‌ పట్టా

ABN , First Publish Date - 2021-07-08T08:01:58+05:30 IST

వైద్య విద్య పట్టా కావాలంటే కచ్చితంగా పల్లెకు వెళ్లి పనిజేయాల్సిందే. అందులోనూ ప్రధానంగా కమ్యూనిటీ మెడిసిన్‌లో రెండు నెలల పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదంటే కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో పనిజేయాలని జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) స్పష్టం

పల్లెకు వెళ్తేనే డాక్టర్‌ పట్టా

2 నెలలపాటు పీహెచ్‌సీ లేదా 

కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లో వర్క్‌

గతంలో 11 సబ్జెక్టుల్లో ఇంటర్న్‌షిప్‌.. ఇప్పుడు 17

ఎంబీబీఎస్‌ పూర్తైన రెండేళ్లలోపే ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేయాలి

భారతీయ వైద్య విధానం, సూపర్‌సెష్పాలిటీలో ఇంటర్న్‌షిప్‌

ప్రవర్తన, అనుభవపూర్వక విజ్ఞానానికి ప్రాధాన్యం

భారీ మార్పులు చేసిన జాతీయ వైద్య మండలి

వైద్య విద్యార్ధుల ఇంటర్న్‌షిప్‌ ముసాయిదా విడుదల’


హైదరాబాద్‌, జూలై 7 (ఆంధ్రజ్యోతి): వైద్య విద్య పట్టా కావాలంటే కచ్చితంగా పల్లెకు వెళ్లి పనిజేయాల్సిందే. అందులోనూ ప్రధానంగా కమ్యూనిటీ మెడిసిన్‌లో రెండు నెలల పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదంటే కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో పనిజేయాలని జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) స్పష్టం చేసింది. ఎంబీబీఎస్‌ పూర్తయిన రెండేళ్లలోపు వైద్య విద్యార్థులు కచ్చితంగా ఇంటర్న్‌షిప్‌ (హౌజ్‌సర్జన్‌) పూర్తి చేయాలని హౌజ్‌సర్జన్‌ మూసాయిదాలో పేర్కొంది. బుధవారం ఆ మూసాయిదాను ఎన్‌ఎంసీ విడుదల చేసింది. ఎంబీబీఎస్‌ విద్యార్ధుల హౌజ్‌సర్జన్‌కు సంబంధించి భారీ మార్పులు చేసింది. గతంలో 11 సబ్జెక్టుల్లో మాత్రమే ఇంటర్న్‌షిప్‌ చేయాల్సివుంటే, ప్రస్తుతం దాన్ని 17కు పెంచింది. అలాగే గతంలో వైద్య విద్యలో విజ్ఞానానికే ప్రాధాన్యమిస్తే.. ప్రస్తుతం యాటిట్యూడ్‌ (ప్రవర్తన), పాక్ట్రికాలిటీ (అనుభవ పూర్వక విజ్ఞానం)కి పెద్దపీట వేశారు. 


ఆడుతూ పాడుతూ కుదరదు

ఇప్పటివరకు వైద్య విద్యార్దులు ఇంటర్న్‌షి్‌పను అడుతూపాడుతూ చేస్తున్నారు. కొందరైతే అసలు కాలేజీల్లో ఇంటర్న్‌షిప్‌ చేయకుండానే చేసినట్లు సర్టిఫికెట్లు తెచ్చుకుంటున్నారు.  ప్రస్తుతం అటువంటి వాటన్నింటికి చెక్‌ పడనుంది. ఇంటర్న్‌షిప్‌ పూర్తయితేనే ఎంబీబీఎస్‌ వైద్య విద్య పట్టాను ఇస్తారు. ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన  తర్వాత ఇంటర్న్‌షిప్‌ చేయడానికి ప్రస్తుతం రెండేళ్ల సమయం ఇచ్చారు. ఆలోపే హౌజ్‌సర్జన్‌ పూర్తి చేయాలి. లేకపోతే అంతే. గతంలో కొందరు ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన అనంతరం కొన్ని ఏళ్ల తర్వాత కూడా ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసేవారు. అలాగే విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన వారు ఇక్కడ ఎగ్జిట్‌ (వైద్య విద్యలో అర్హత సాధించే) పరీక్ష రాసిన అనంతరం ఇంటర్న్‌షిప్‌ చేయాల్సివుంటుంది. చాలామంది అందులో పాస్‌ కావడం లేదు. కొందరైతే నాలుగైదేళ్లు తీసుకుంటున్నారు. ఆ తర్వాతే హౌజ్‌సర్జన్‌ చేస్తున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితికి పూర్తిగా చెక్‌ పడనుంది. దీంతో విద్యార్థుల్లో సీరియె్‌సనెస్‌ పెరగనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 


సబ్జెక్టుల్లోనూ భారీ తేడా...

గతంలో 11 సబ్జెక్టులో 12 నెలల పాటు ఇంటర్న్‌షిప్‌ చేస్తే సరిపోయేది. మెడిసన్‌, సర్జరీ, గైనకాలజీ, సోషల్‌ ప్రివెంటివ్‌మెడిసిన్‌(ఎస్పీఎమ్‌) సబ్జెక్టుల్లో రెండేసి నెలల ఇంటర్న్‌షిప్‌ చేయాల్సివుండేది. అలాగే క్యాజువాలిటీ,లో నెల్లాళ్లపాటు చేయాలి. మిగిలిన పిడియాట్రిక్‌, ఈఎన్‌టీ, ఆప్తమాలజీ, ట్రాపికల్‌ డిసిజ్‌, ఎలక్టివ్‌ పోస్టింగ్‌ ఏ, బీలలో 15 రోజుల పాటు హౌజ్‌సర్జన్‌గా పనిజేస్తే సరిపోయేది. ఇప్పుడు 17 సబ్జెక్టుల్లో తప్పనిసరిగా హౌజ్‌సర్జన్‌ పూర్తి చేయాలని ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది. ప్రధానంగా కమ్యూనిటీ మెడిసిన్‌లో రెండు నెలల పాటు పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలలోని ఏదో ఒకదానిలో పనిజేయాలని పేర్కొంది. ఇక జనరల్‌ మెడిసిన్‌ విభాగంలో నెలన్నర పాటు పనిజేయాలి.


సైకియాట్రీలో రెండువారాలు, పిడియాట్రిక్స్‌లో నెల, జనరల్‌ సర్జరీలో నెలన్నర, గైనకాలజీ, ఫ్యామిలీ వెల్ఫేర్‌ ప్లానింగ్‌లో నెలన్నర, ఆర్థోపెడిక్‌, ఎమర్జెన్సీ, ఆప్తమాలజీ, చెవిముక్కు గొంతువిభాగం, హస్పిటల్‌ సపోర్ట్‌ లైఫ్‌  సైన్స్‌, బ్రాడ్‌ స్పెషాలిటీ, మైక్రోబయాలజీ విభాగాల్లో కచ్చితంగా రెండువారాలు పనిజేయాలని స్పష్టం చేసింది. వీటితో  పాటు సూపర్‌ స్పెషాలిటీ గ్రూపు, భారతీయ వైద్య విధానం(ఆయుర్వేద, యోగా,యూనానీ, సిద్ద, హోమియోపతి) విభాగాల్లో కూడా వారం పాటు పనిజేయాలని పేర్కొంది. 


 లాగ్‌ బుక్‌లో నమోదు తప్పనిసరి

హౌజ్‌సర్జన్‌కు సంబంధించి ఈసారి లాగ్‌బుక్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అంటే  వైద్య విద్యార్ధులు అయా విభాగాల్లో ఇంటర్న్‌షిప్‌ చేసే సమయంలో కచ్చితంగా తాము చేసిన వైద్య సేవలను అందులో నమోదు చేయాలి. అది కూడా చేసిన రోజు, అధ్యాపకుల సమక్షంలోనే నమోదు చేయడాన్ని తప్పనిసరి చేసింది. అంటే ఒక విద్యార్థి గైనకాలజీ విభాగంలో హౌజ్‌సర్జన్‌గా ఉంటే కచ్చితంగా ప్రసవాలు చేయాల్సిందే. గతంలో ఇలా పకడ్బందీగా ఉండేది కాదు. అంతేకాకుండా ప్రతీ 15 మంది విద్యార్ధులను ఒక బ్యాచ్‌గా విభజించాలని అందులో పేర్కొంది. గతంలో ఇంతమంది అని ఉండేది కాదు.పైగా ఒకరిద్దరు విద్యార్ధులు మెడికల్‌ ప్రొసీజర్స్‌ చేస్తుంటే మిగతావారంతా కేవలం పరిశీలిస్తూ ఉండేవారు. ఇప్పుడు అలా కాకుండా ప్రతీ విద్యార్థి మెడికల్‌ ప్రొసీజర్స్‌ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. 

Updated Date - 2021-07-08T08:01:58+05:30 IST