డిగ్రీ, పీజీ పరీక్షలన్నీ యథాతథం
ABN , First Publish Date - 2021-03-24T07:38:13+05:30 IST
నేటినుంచి విద్యాసంస్థలు, హాస్టళ్లు, గురుకులాలను మూసివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ..

- నేటినుంచి డిగ్రీ పరీక్షలు ప్రారంభం
- పరీక్ష కేంద్రంలో 12 మందికే అనుమతి
- షెడ్యూల్ మేరకే జేఎన్టీయూ సప్లిమెంటరీ
హైదరాబాద్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): నేటినుంచి విద్యాసంస్థలు, హాస్టళ్లు, గురుకులాలను మూసివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ.. ఇప్పటికే ప్రకటించిన డిగ్రీ, పీజీ వార్షిక, సెమిస్టర్ పరీక్షలు మాత్రం యథాతథంగా జరగనున్నాయి. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల పరిధిలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఈనెల 24 నుంచి, తృతీయ సంవత్సరం పరీక్షలు ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవి ఏప్రిల్ 15 వరకు కొనసాగనున్నాయి. పరీక్షల కోసం ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. పరీక్షల నిలుపుదలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదని, పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని ఓయూ రిజిస్ట్రార్ ఆచార్య గోపాల్‌రెడ్డి తెలిపారు. మరోవైపు జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం సైతం బీటెక్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను ఇప్పటికే ప్రకటించింది. ఈ పరీక్షలు సైతం యథావిఽధిగా కొనసాగుతాయని జేఎన్టీయూ రిజిస్ట్రార్ ఆచార్య మన్జూర్ హుసేన్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో యూజీ, పీజీ ప్రత్యక్ష తరగతులను రద్దు చేశామని, ఆన్‌లైన్ తరగతులు మళ్లీ ప్రారంభమవుతాయని వెల్లడించారు. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలు కూడా షెడ్యూల్ ప్రకారమే జరగనున్నాయి.