టీఆర్‌ఎస్‌ను ఓడిస్తేనే.. ఉద్యోగులకు అనుకూలమైన ఫిట్‌మెంట్‌

ABN , First Publish Date - 2021-03-14T07:22:01+05:30 IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఓడిస్తేనే ఉద్యోగులకు అనుకూలమైన ఫిట్‌మెంట్‌ను ప్రభుత్వం ప్రకటిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు.

టీఆర్‌ఎస్‌ను ఓడిస్తేనే.. ఉద్యోగులకు అనుకూలమైన ఫిట్‌మెంట్‌

  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అక్రమాలు
  • ప్రచారంలో పీవీ ఫొటోపై ఈసీకి ఫిర్యాదు: ఉత్తమ్‌

హైదరాబాద్‌, మార్చి 13(ఆంధ్రజ్యోతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఓడిస్తేనే ఉద్యోగులకు అనుకూలమైన ఫిట్‌మెంట్‌ను ప్రభుత్వం ప్రకటిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. ఫిట్‌మెంట్‌ను 43% మించి ప్రకటించాలని ఉద్యోగులు కోరుతుంటే 29 శాతమే ప్రకటిస్తామని ప్రభుత్వం లీకులు ఇచ్చిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్‌ గోయల్‌కు ఉత్తమ్‌ ఫిర్యాదు చేశారు. పార్టీ ముఖ్య నేతలు మర్రి శశిధర్‌రెడ్డి, అంజన్‌ కుమార్‌ యాదవ్‌, నిరంజన్‌ తదితరులు ఉత్తమ్‌తో పాటు ఉన్నారు. అనంతరం మీడియాతో ఉత్తమ్‌ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అన్ని రకాలుగా అక్రమాలకు పాల్పడుతోందని, నిబంధనలను తుంగలో తొక్కి ఓటర్లను ప్రలోభ పెడుతోందన్నారు. ఓటర్లకు విచ్ఛలవిడిగా డబ్బు పంపిణీ చేస్తోందని, ఓటర్లను తరలించడానికి ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులను బలవంతంగా వాడుకుంటున్నారని తెలిపారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరామన్నారు. నకిలీ ఓటర్లు, డిగ్రీ లేని వారిని ఓటింగ్‌కు అనుమతి ఇవ్వొద్దని, దొంగ ఓట్లు వేయించుకునేందుకు టీఆర్‌ఎస్‌ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరామన్నారు. పోస్టల్‌ ఓట్లనూ పోలీసులు సేకరించి టీఆర్‌ఎ్‌సకు వేసేలా పని చేస్తున్నారని, వారిని అడ్డుకుని చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకుడైన దివంగత ప్రధాని పీవీ నర్సింహారావు ఫొటోను టీఆర్‌ఎస్‌ పార్టీ తమ ప్రచారానికి వాడుకోవడం పట్ల సీఈవోకు ఫిర్యాదు చేశామని వెల్లడించారు. పీవీ బతికున్నప్పుడు ఆయన్ను విమర్శించి.. ఇప్పుడు ఆయన బొమ్మను ప్రచారానికి వాడుకోవడాన్ని ఆక్షేపించామన్నారు. 

Updated Date - 2021-03-14T07:22:01+05:30 IST