విజయగర్జన బదులు దీక్షాదివస్‌

ABN , First Publish Date - 2021-11-02T08:44:34+05:30 IST

ఈ నెల 15న వరంగల్‌లో జరపతలపెట్టిన తెలంగాణ విజయగర్జన సభను తెలంగాణ దీక్షాదివ్‌సగా ఈ నెల 29న నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.

విజయగర్జన బదులు దీక్షాదివస్‌

  • 15న కాదు 29న నిర్వహణ 
  • నేతల అభ్యర్ధన మేరకు సీఎం నిర్ణయం


హైదరాబాద్‌, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి) : ఈ నెల 15న వరంగల్‌లో జరపతలపెట్టిన తెలంగాణ విజయగర్జన సభను తెలంగాణ దీక్షాదివ్‌సగా ఈ నెల 29న నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లా మం త్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్‌, ఆరూరి రమేశ్‌, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ధర్మారెడ్డితో పాటు ముఖ్య నేతలు మాజీ మంత్రి కడియం శ్రీహరి, మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి, తదితర పార్టీ ముఖ్యనేతలు వరంగల్‌లో సమావేశమై ఈ మేరకు సీఎం కేసీఆర్‌ను అభ్యర్థించారు. ‘తెలంగాణ వచ్చుడో  కేసీఆర్‌ సచ్చుడో ’ అనే నినాదంతో ఆ నాడు సీఎం కేసీఆర్‌ దిక్షాదివస్‌ ప్రారంభించిన నవంబరు 29వ తేదీయే తెలంగాణ విజయగర్జన సభ నిర్వహణకు తగిన సందర్భమని నేతలు అభిప్రాయపడ్డారు. దాంతో సీఎం కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే చేసుకున్న ఏర్పాట్లను, బస్సులు తదితర రవాణా వ్యవస్థలను  ఈ నెల 29వ తేదీకి మార్చుకోవాలని సీఎం సూచించారు. విజయగర్జన సభ నిర్వహించాలనుకున్న వరంగల్‌నగర శివారు ప్రాంతాలు మడికొండ, ఉనికిచర్ల, రాంపూర్‌ వద్ద ఖాళీ స్థలాలను మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతిరాథోడ్‌తో పాటు చీఫ్‌విప్‌ వినయ్‌భాస్కర్‌ తదితరులు సోమవారం పరిశీలించారు. అయితే ఆ ప్రాం తంలో వరిపొలాలు ఉన్నాయి. అవి పొట్టదశలో ఉండటంతో సభ నిర్వహిస్తే పాడవుతాయి. రైతులకు నష్టపరిహారం చెల్లించాల్సివుంటుంది. కొద్దిరోజులు పాటు సభను వాయిదా వేయడానికి ఇది  కూడా ఒక కారణంగా చెబుతున్నారు.   


29న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నిక

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికల షెడ్యూల్‌ ఆదివారం విడుదలయింది. ఆ ఎన్నిక ఈ నెల 29న జరగనుంది.  అయితే, ఎమ్మెల్యేల సంఖ్యా బలం ప్రకారం  ఎన్నికలు నిర్వహించే ఆరు స్థానాల్లో టీఆర్‌ఎసే గెలుస్తుంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులంతా ఏకగ్రీవం కానున్నారు. అందువల్ల 29న పోలింగ్‌ నిర్వహించాల్సిన అవసరం  ఉండదు. ఈ నేపథ్యంలో 29నే వరంగల్‌లో దీక్షాదివ్‌సను నిర్వహించాలని నిర్ణయించారు. 

Updated Date - 2021-11-02T08:44:34+05:30 IST