అన్నదాతలను మింగిన అప్పులు!

ABN , First Publish Date - 2021-12-30T07:12:17+05:30 IST

ఎన్నో ఆశలతో రేయింబవళ్లు కష్టపడి సాగు చేసిన పంటలు

అన్నదాతలను మింగిన అప్పులు!

  • పంట నష్టపోయి ముగ్గురి ఆత్మహత్య
  • భూమిని రికార్డు నుంచి తొలగించారని మరొకరి బలవన్మరణం
  • మహబూబాబాద్‌, సిరిసిల్ల, మెదక్‌ జిల్లాల్లో ఘటనలు


 (ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

ఎన్నో ఆశలతో రేయింబవళ్లు కష్టపడి సాగు చేసిన పంటలు నష్టపోయి, అప్పులు తీర్చే మార్గం లేక ముగ్గురు.. తనకు జీవనాధారమైన సాగు భూమిని అటవీ అధికారులు రికార్డు నుంచి తొలగించారన్న మనోవేదనతో ఒకరు.. ఇలా మొత్తం నలుగురు అన్నదాతలు మహబూబాబాద్‌, సిరిసిల్ల, మెదక్‌ జిల్లాల్లో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 


మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం కేసముద్రం విలేజికి చెందిన భూక్య  బాలు(43) మిర్చి సాగు చేయగా, ఇటీవల పంటకు తెగులు వచ్చి పూర్తిగా నష్టం వాటిల్లింది. దీంతో పెట్టుబడులు రాక, అప్పులు తీర్చే దారి కనిపించక జీవితంపై విరక్తితో మంగళవారం రాత్రి పురుగు మందు తాగి బలవన్మరణం చెందాడు. 


మరో ఘటనలో.. మిర్చి, పత్తి పంటలు సాగు చేయగా పంటలకు తెగుళ్లు సోకి దెబ్బతినడంతో రూ.10 లక్షల అప్పులు తీర్చే దారి కనిపించక జీవితంపై విరక్తి చెందిన రైతు నారామళ్ల సంపత్‌ (29) మంగళవారం పురుగు మందు తాగగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి చనిపోయాడు. ఈ ఘటన మహబూబాబాద్‌ మండలం పర్వతగిరిలో జరిగింది. అలాగే, రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటకు చెందిన పని నర్సయ్య (52) ఈ ఏడాది మూడెకరాల్లో వరి సాగు చేయగా ఇటీవల వర్షాలకు ఒక ఎకరం చెరువు నీటిలో మునిగిపోయి నష్టాల పాలయ్యాడు. దీంతో రూ.4 లక్షల వరకు ఉన్న అప్పులు ఎలా తీర్చాలో తెలియక చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 


కాగా, మెదక్‌ జిల్లా రామాయంపేట మండలం శివాయిపల్లికి చెందిన చిర్గాబోయిన ముత్యాలు (46) చాలా ఏళ్లుగా అటవీ భూమిని సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అన్నదమ్ములు ఆస్తులను వాటాలు పంచుకునే సమయంలో ముత్యాలుకు ఎకరంన్నర అటవీ భూమి వాటాగా వచ్చింది. అయితే రెండేళ్ల నుంచి అటవీ అధికారులు ‘ఈ భూమి మా పరిధిలోనిది. ఇక మీద పంటలు వేయొద్దు’ అంటూ ముత్యాలుకు చెబుతూ వచ్చారు.


 కానీ, రైతుబంధు డబ్బులు తన ఖాతాలో జమ అవుతుండడంతో ముత్యాలు పంటలు సాగు చేస్తున్నాడు. గత ఖరీఫ్‌ సీజన్‌లో రైతుబంధు డబ్బులు జమ కాగా, ఈసారి రాలేదు. దీంతో తన భూమిని అధికారులు రికార్డు నుంచి తొలగించడంతోనే రైతుబంధు డబ్బులు జమ కాలేదని తీవ్ర మనోవేదనకు గురై బుధవారం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. 


Updated Date - 2021-12-30T07:12:17+05:30 IST