డీసీసీబీకి కొత్తగా ఎనిమిది బ్రాంచ్‌లు

ABN , First Publish Date - 2021-02-26T05:36:15+05:30 IST

డీసీసీబీకి కొత్తగా ఎనిమిది బ్రాంచ్‌లు

డీసీసీబీకి కొత్తగా ఎనిమిది బ్రాంచ్‌లు

హన్మకొండ టౌన్‌, ఫిబ్రవరి 25 : ఉమ్మడి వరంగల్‌ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌ పరిధిలో నూతనంగా మరో ఎనిమిది బ్రాంచీలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర సహకార కేంద్ర  బ్యాంక్‌ ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర సహకార బ్యాంక్‌ ఉత్తర్వులు జారీ చేయగా డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు ఆధ్వర్యంలో పాలకవర్గం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రైతులకు మరిన్ని సేవలందించేలా ఆరు నెలల కిందట 10 నూతన బ్రాంచ్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపంగా 8 కొత్త బ్రాంచ్‌లకు అనుమతి వచ్చింది. ప్రస్తుతం బ్యాంకు పరిధిలో 19 బ్రాంచ్‌ల ఉండగా కొత్త వాటితో 27కు చేరనున్నాయి. ప్రస్తుతం ఉన్న బ్రాంచుల్లో రెండు లక్షలకు పైగా ఖాతాదారులు, రూ.400 కోట్ల మేర డిపాజిట్లు ఉన్నాయి. పాలకుర్తి, కొడకండ్ల, కేసముద్రం, మడికొండ, కాజీపేట, ధర్మసాగర్‌, చిట్యాల, ఏటూరునాగారం, నల్లబెల్లి, పర్వతగిరి కొత్త బ్రాంచ్‌లకు ప్రతిపాదనలు పంపగా నల్లబెల్లి, కాజీపేట మినహా మిగతా ఎనిమిదింటికి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. కొత్తవాటి ఏర్పాటుకు ఆరు నెలల గడువు ఉండగా పాలకవర్గం, అధికారులు అద్దె భవనాల్లో బ్రాంచ్‌ల ఏర్పాటుకు కసరత్తు  చేస్తున్నారు. కలెక్టర్‌ ప్రభుత్వ స్థలం కేటాయిస్తే శాశ్వత భవనాల్లో ఏర్పాటు చేస్తామని, అప్పటి వరకు అద్దె భవనాల్లో కార్యకలాపాలు సాగించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు పేర్కొన్నారు. కొత్త బ్రాంచీల్లో సిబ్బంది నియామకానికి కేంద్ర సహకార బ్యాంక్‌ అనుమతులు ఇవ్వలేదని అందుబాటులో ఉన్న సిబ్బందినే సర్దుబాటు చేసి కార్యకలాపాలు కొనసాగిస్తామన్నారు. ప్రస్తుతం గూడూరు, హన్మకొండ, జనగామ, మహబూబాబాద్‌, మరిపెడ, ములుగు, నర్సంపేట, నర్మెట, నెక్కొండ, పరకాల, తొర్రూరు, వరంగల్‌, వర్ధన్నపేటలో బ్రాంచ్‌లు కొనసాగుతున్నాయి.

Updated Date - 2021-02-26T05:36:15+05:30 IST