విద్యార్థులు ఎక్కువున్న బడుల్లో రోజు విడిచి రోజు తరగతులు!

ABN , First Publish Date - 2021-08-27T10:01:31+05:30 IST

విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలల్లో రోజు విడిచి రోజు తరగతులు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. అయితే అలాంటి బడుల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించిన

విద్యార్థులు ఎక్కువున్న బడుల్లో రోజు విడిచి రోజు తరగతులు!

బడికి రాకున్నా విద్యార్థి అడ్మిషన్‌ ఉంటుంది

పాఠశాలకు వెళ్లాలని ఒత్తిడి చేయరాదు

ప్రైవేట్‌లో మధ్యాహ్నం వరకే స్కూల్‌ 

హాజరు శాతం ఆధారంగా నిర్ణయం


హైదరాబాద్‌, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలల్లో రోజు విడిచి రోజు తరగతులు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. అయితే అలాంటి బడుల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించిన తర్వాత అప్పటికప్పుడు తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. ఈ విషయంపై రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధానం కాకుండా, స్థానిక పరిస్థితిని బట్టి ఆయా జిల్లాల కలెక్టర్లు తగు నిర్ణయాలు తీసుకోవాలని విద్యా శాఖ అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో సెప్టెంబరు 1 నుంచి విద్యా సంస్థలను ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా స్కూళ్ల విషయంలో ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యార్థులు పెద్దఎత్తున ఒకేచోటు చేరితే వారిలో ఒక్కరికి కరోనా పాజిటివ్‌ ఉన్నా మిగతా వారూ ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇలాంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆయా జిల్లా కలెక్టర్లకు సూచనలు చేశారు. రాష్ట్రంలో సుమారు 28 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి.


80 శాతం బడుల్లో విద్యార్థుల సంఖ్య 150 లోపే ఉంటుందని అంచనా. 150 మందికి పైగా విద్యార్థులు ఉండే పాఠశాలలు సుమారు మూడువేల వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. అలాగే 100కు పైగా విద్యార్థులు ఉండే స్కూళ్ల సంఖ్య 6 వేల వరకు ఉంటాయని భావిస్తున్నారు. అంటే మెజారిటీ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య 100 లోపే ఉంది. ఇలాంటి బడుల్లో ఇబ్బందులు రావని అంచనా వేస్తున్నారు. అయితే కొన్ని చోట్ల ఒకే ఆవరణలో రెండు, మూడు పాఠశాలలు ఉన్నాయి. కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉంది. ఇలాంటి పాఠశాలల్లో రోజు విడిచి రోజు తరగతులు నిర్వహించాలని భావిస్తున్నారు. బడులు ప్రారంభమైన తర్వాత విద్యార్థుల హాజరు శాతాన్ని బట్టి నిర్ణయం తీసుకోనున్నారు. 


బడికి రావాలని ఒత్తిడి చేయరాదు

పాఠశాలలకు రావాల్సిందిగా విద్యార్థులను ఒత్తిడి చేయకూడదని నిర్ణయించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అభీష్టం మేరకు వారే నిర్ణయం తీసుకోవచ్చు. అలాగే తల్లిదండ్రుల నుంచి హామీ పత్రాన్ని కూడా తీసుకోవడం లేదు. విద్యార్థులు వరుసగా నెలల తరబడి బడికి రాకపోయినా అడ్మిషన్‌ను రద్దు చేయరు. అలాగే  మధ్యాహ్న భోజనం వడ్డించే సమయంలో గుంపులుగా చేరడాన్ని నిరోధించడానికి విద్యార్థులందరినీ ఒకేసారి కాకుండా దశలవారీగా భోజనానికి అనుమతించాలని నిర్ణయించారు. 


ప్రైవేట్‌లో మధ్యాహ్నం వరకే స్కూల్‌ 

కాగా విద్యార్థులు బడులకు అలవాటయ్యే వరకు మధ్యాహ్నం వరకే తరగతులు నిర్వహించాలని ప్రైవేట్‌ స్కూళ్ల యాజమాన్యాలు భావిస్తున్నాయి. ఇలా హాఫ్‌డే స్కూళ్ల ద్వారా కరోనా వ్యాప్తి నుంచి కొంత వరకు విద్యార్థులను రక్షించడానికి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నాయి. మధ్యాహ్నం తర్వాత కూడా తరగతులు నిర్వహిస్తే భోజన విరామ సమయంలో విద్యార్థులంతా గుంపులుగా చేరే అవకాశం ఉందని, దీంతో కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో యాజమాన్యాలు ఈ నిర్ణయానికి వచ్చాయి.

Updated Date - 2021-08-27T10:01:31+05:30 IST