నిన్నటి దాకా డ్రైవర్‌.. నేడు ఓనర్‌

ABN , First Publish Date - 2021-08-27T09:19:50+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంలో మరో అడుగు పడింది. ఈ నెల 16న ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా రూ.10 లక్షల చొప్పున..

నిన్నటి దాకా డ్రైవర్‌.. నేడు ఓనర్‌

‘దళిత బంధు’లో భాగంగా 15 మందికి 

యూనిట్లు పంపిణీ చేసిన మంత్రులు

దళితులకు వరం.. ఈ పథకం: కొప్పుల

అంబేడ్కర్‌ కలలు సాకారం: గంగుల

తాజాగా మరో రూ.500 కోట్ల విడుదల

కలెక్టర్‌ ఖాతాలో మొత్తం 2వేల కోట్లు

నేడు మంత్రులు, అధికార్లతో సీఎం సమీక్ష

ప్రత్యేక ప్రశ్నలతో హుజూరాబాద్‌లో సర్వే


కరీంనగర్‌/హైదరాబాద్‌, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంలో మరో అడుగు పడింది. ఈ నెల 16న ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా రూ.10 లక్షల చొప్పున చెక్కులు అందుకున్న 15 మంది లబ్ధిదారులకు.. వారు ఎంపిక చేసుకున్న యూనిట్లను గురువారం అందజేశారు. కరీంనగర్‌ కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో దాసారపు స్వరూప-రాజయ్య, ఎలుకపల్లి కొమురయ్య-కనుకమ్మ దంపతులకు ట్రాక్టర్లు, సుగుణ-మొగిలి దంపతులకు ట్రాలీని, రాచపల్లి శంకర్‌కు కారును మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌ అందించారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ ‘నిన్నటి వరకు ఒకరి వద్ద డ్రైవర్‌గా పనిచేసిన దళితుడు నేడు వాహనానికి ఓనర్‌గా మారడం దళితబంధుతోనే సాధ్యమైంది.. ఈ పథకం దళితులకు వరం లాంటిది’ అని అన్నారు. దళితుల సంక్షేమానికి కేసీఆర్‌ కట్టుబడి ఉన్నారనడానికి దళితబంధు అమలే చక్కటి ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. బీఆర్‌ అంబేడ్కర్‌ కలలను సీఎం కేసీఆర్‌ నిజం చేస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్‌ కొనియాడారు. నిన్నటి వరకు డ్రైవర్లు, కూలీలు, గుమస్తాలుగా పని చేసినవారు నేడు యజమానులుగా మారడమే దళితబంధు పథకంలోని గొప్పదనమని పేర్కొన్నారు.  


‘దళిత బంధు’ నిధుల లక్ష్యం పూర్తి

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పైలట్‌ ప్రాజెక్టుగా దళితబంధు పథకం అమలు కోసం మరో రూ.500కోట్లను సర్కార్‌ విడుదల చేసింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఎస్సీ కార్పొరేషన్‌ నుంచి కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ ఖాతాలోకి గురువారం నిధులు బదిలీ చేశారు. హుజూరాబాద్‌ పరిధిలోని 20,929 దళిత కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు రూ.2వేల కోట్లు అవసరం అవుతాయని గతంలోనే సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఇప్పటివరకు పలు విడతల్లో రూ.1500 కోట్లు విడుదల చేసిన సర్కార్‌ తాజాగా రూ.500కోట్ల కేటాయించింది. దీంతో ‘దళిత బంధు’ నిధుల లక్ష్యం పూర్తయింది.  


నేడు మూడు గంటల పాటు సమీక్ష

దళిత బంధు పథకాన్ని పకడ్బందీగా అమలుపై ప్రత్యేకంగా దృష్టి సారించిన కేసీఆర్‌.. కరీంనగర్‌ కలెక్టరేట్‌లో మంత్రులు, అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించనున్నారు. గురువారం రాత్రికి కేసీఆర్‌ వరంగల్‌ నుంచి నేరుగా కరీంనగర్‌ చేరుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటల నుంచి కరీంనగర్‌ కలెక్టరేట్‌లో నిర్వహించిన దళిత బంధు అమలుకు సంబంధించిన అంశాలపై ఆయన మార్గనిర్దేశం చేయనున్నారు. ఇక్కడి ఫలితాలపైనే రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు పథకం అమలు ఆధారపడి ఉన్నందున ప్రతి చిన్న విషయాన్ని కూలంకషంగా చర్చించేందుకు వీలుగా మూడు గంటలపాటు షెడ్యూల్‌ ఖరారైంది. లబ్ధిదారుల ఆర్థిక స్థితిగతుల్లో వచ్చే మార్పు, రక్షణ నిధి, తదితర అంశాలపై ఇందులో చర్చించనున్నారు.


నాలుగు రోజుల పాటు సర్వే

లబ్ధిదారుల ఎంపికపై స్థానిక మునిసిపల్‌, పంచాయతీరాజ్‌, ఇతర విభాగాల అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ప్రత్యేక ఫార్మాట్‌లో రూపొందించిన వివరాల ఆధారంగా శుక్రవారం నుంచి సర్వే చేపట్టనున్నారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు లోబడి సుమారు 50 ప్రశ్నలతో నిరుపేదలు ఎవరన్నది ముందుగా గుర్తిస్తారు. జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో ఏర్పాటైన గ్రామ, మండలస్థాయి కమిటీలు నాలుగు రోజుల్లో ఈ సర్వేను పూర్తి చేయనున్నాయి. అయితే, సంతృప్త స్థాయిలో అన్ని దళిత కుటుంబాలకు రూ.10 లక్షల మేర సాయం అందిస్తామని చెప్పి, ఇప్పుడు మళ్లీ సర్వే చేయడమేంటని దళిత కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి. కుటుంబ ఆదాయ మార్గాలు, ఆస్తులు తెలుసుకోవడమే లక్ష్యంగా సర్వే చేస్తుండడంతో ఏం చెబితే ఏం జరుగుతుందోనని ఆందోళనకు గురవుతున్నాయి. కాగా, అనుకోని ఆపద వచ్చినప్పుడు దళిత బంధు లబ్ధిదారులకు అండగా ఉండేందుకు ఏర్పాటు చేయనున్న ‘దళిత రక్షణ నిధి’ని ఒక సొసైటీగా రిజిస్టర్‌ చేయించనున్నారు. ఎలాంటి సమయంలో రక్షణ నిధి నుంచి సాయం అందించాలన్నది కలెక్టర్‌ చైర్మన్‌గా ఏర్పాటయ్యే ఎగ్జిక్యూటివ్‌ కమిటీ  నిర్ణయిస్తుంది. 

Updated Date - 2021-08-27T09:19:50+05:30 IST