ఉద్యోగులు కష్టించి పనిచేసి అభివృద్ధిలో భాగం కావాలి: సీఎస్‌

ABN , First Publish Date - 2021-09-02T21:37:48+05:30 IST

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆశయాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కష్టించి పనిచేసి అభివృద్ధిలో భాగం కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉద్బోధించారు.

ఉద్యోగులు కష్టించి పనిచేసి అభివృద్ధిలో భాగం కావాలి: సీఎస్‌

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆశయాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కష్టించి పనిచేసి అభివృద్ధిలో భాగం కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉద్బోధించారు. సెక్రటేరియట్‌లోని 122 మంంది ఉద్యోగులకు ప్రమోషన్‌ లభించిన నేపధ్యంలో తెలంగాణ సెక్రటేరియట్‌ అసోసియేషన్‌ సీఎస్‌ను బిఆర్‌కె భవన్‌లో ఘనంగా సన్మానించింది. ఈసందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ ఉద్యోగులు మరింత కష్టపడి పనిచేస్తూ పారదర్శకంగా వ్యవహరించాలని, తద్వారా సామాన్యులకు ఉత్తమ సేవలు అందుతాయని అన్నారు. 


ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకే అన్నిశాఖల్లోని ఉద్యోగులందరికీ ప్రమోషన్‌ డ్రైవ్‌ నిర్వహించినట్టు ఆయన తెలిపారు. ప్రమోషన్‌ల ప్రక్రియ మూడు సంవత్సరాలు దాటితేనే కొనసాగేంది. కానీ ముఖ్యమంత్రి  రెండుసంవత్సరాలకు తగ్గించారు. దీంతో రెండేళ్ల సర్వీసు పూర్తిచేసిన వారందరికీ ప్రమోషన్‌లు లభిస్తాయని చెప్పారు. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే 30శాతం పీఆర్‌సిని ఇచ్చారని గుర్తుచేశారు. ఉద్యోగుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు హ్యూమన్‌ రీసోర్స్‌ ద్వారా వారికి శిక్షణ ఇస్తామని సీఎస్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సెక్రటేరియట్‌ ఉద్యోగుల  సంఘం అధ్యక్షుడు నరేందర్‌ రావు, జీఏడీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వికాస్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-02T21:37:48+05:30 IST