పసిడి పేరుతో పచ్చి మోసం

ABN , First Publish Date - 2021-12-15T05:39:14+05:30 IST

పసిడి పేరుతో పచ్చి మోసం

పసిడి పేరుతో పచ్చి మోసం

  నకిలీ బంగారు ఆభరణాలు 

అంటగట్టే ముఠా అరెస్టు

  నిందితులిద్దరూ కర్ణాటక వాసులు

  రూ. 10.40 లక్షల నగదు స్వాధీనం

హనుమకొండ క్రైం, డిసెంబరు 14: నకిలీ బంగారాన్ని విక్రయిస్తున్న ఇద్దరు సభ్యుల ముఠాను ఇంతేజార్‌గంజ్‌ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు రూ. 10.40 లక్షల నగదుతో పాటు సెల్‌ఫోన్లు, నకిలీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో మంగళవారం సీపీ తరుణ్‌జోషి నిందితుల వివరాలను వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం మాన్‌ద్వా జిల్లా శ్రీరంగపట్నంకు చెందిన మోహన్‌లాల్‌ పరమర్‌, సోలంకి ధర్మ అనే ఇద్దరు వ్యక్తులు కలిసి తక్కువ ధరకు బంగారం విక్రయిస్తామని నకిలీ బంగారంతో వివిధ రాష్ట్రాల్లో సంవత్సర కాలంగా తిరుగుతూ అమాయకులకు అంటగట్టేవారు. ఈక్రమంలో ఢిల్లీలో రెండు కిలోల రోల్డ్‌గోల్డ్‌ గుండ్ల హారాలు కొనుగోలు చేసి తెలంగాణకు వచ్చారు.   

 గత అక్టోబరు 23న వరంగల్‌ ఏనుమాముల మార్కెట్‌ సమీపంలో పురుగు మందుల వ్యాపారం చేస్తున్న వ్యక్తిని కలిసి గులాబీ చెట్లకు మందులు కొనుగోలు చేసి వెళ్లారు. పక్కా ప్లాన్‌తో మర్నాడు వచ్చి తమ వద్ద బంగారు సొత్తు ఉందని, తమ చెల్లి పెళ్లికి డబ్బులు అవసరం ఉన్నందున తక్కువ ధరకు అమ్ముతామని చెప్పారు. మచ్చుకు నిజమైన బంగారాన్ని చూపించి పరీక్షించుకోవాలని చెప్పి, అడ్రస్‌ కూడా ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వారు చెప్పిన ప్రకారం బంగారాన్ని పరీక్షించి చూడగా, నిజమైనదిగా తేలింది. తక్కువ ధరకు బంగారం సొత్తు దక్కుతుందన ఆశపడిన సదరు వ్యాపారి తన  భార్యను వెంటబెట్టుకొని అక్టోబరు 29న ఖమ్మంకు వెళ్లి వారిని కలిసాడు. రూ. 12 లక్షలు ఇవ్వగా వారు  రెండు కిలోల బరువున్న బంగారు గుండ్లహారాలను అప్పగించారు. ప్రస్తుత మార్కెట్‌ ప్రకారం రెండుకిలోల(200 తులాలు) బంగారు ఆభరణాల విలువ కోటి రూపాయల వరకు ఉంటుంది.  కోటి విలువైన బంగారం రూ.12 లక్షలకే దక్కిందని, లక్కు చిక్కిందని సదరు వ్యాపారి సంబరపడ్డాడు. ఖమ్మం నుంచి వరంగల్‌కు వచ్చిన తర్వాత గుండ్ల హారాలను కరిగించి చూడా అ వి నకిలీవని తేలింది.  దీంతో తాను మోసపోయానని తెలుసుకొని, లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు.  ఇంతేజార్‌గంజ్‌  పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

నిందితులు ఇద్దరు కర్ణాటకకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.  మంగళవారం వారు ఖమ్మం నుంచి వరంగల్‌కు వస్తున్నట్టు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఇంతేజార్‌గంజ్‌   సీఐ మల్లేశ్‌ ఇద్దరిని వరంగల్‌ రైల్వే స్టేషన్‌లో అరెస్టు చేసి విచారించగా చేసిన తప్పును ఒప్పుకున్నారు. వారి నుంచి నగదు, నకిలీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన సెంట్రల్‌జోన్‌ డీసీపీ పుష్ప, సీఐ మల్లేశ్‌, ఏఏవో సల్మాన్‌పాష, హెడ్‌కానిస్టేబుల్‌ నర్సింహులు, కానిస్టేబుళ్లు సంతోష్‌, శివకృష్ణ, అలీ, నరేష్‌, సర్ధార్‌, రాంరెడ్డి, హోంగార్డు ఐలయ్యలను సీపీ ప్రశంసించారు.  

Updated Date - 2021-12-15T05:39:14+05:30 IST