చారిత్రక నగరాన్ని చీల్చవద్దు

ABN , First Publish Date - 2021-06-23T05:21:07+05:30 IST

చారిత్రక నగరాన్ని చీల్చవద్దు

చారిత్రక  నగరాన్ని చీల్చవద్దు
మాట్లాడుతున్న తక్కళ్లపల్లి శ్రీనివాసరావు

 సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ  సభ్యుడు శ్రీనివాసరావు

సుబేదారి, జూన్‌ 22: వరంగల్‌ ఉమ్మడి జిల్లాను మరోసారి అశాస్ర్తీయంగా విభజించి, ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు కోరారు. హన్మకొండ బాలసముద్రంలోని సీపీఐ జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాను ఆరు ముక్కలుగా చేశారని, ప్రస్తుతం వరంగల్‌ చారిత్రక నగరాన్ని కూడా ముక్కలుగా చేయాలని చూడటం పద్ధతి కాదన్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లాకు జిల్లా కేంద్రం లేదన్న సాకుతో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఒత్తిడితో వరంగల్‌ నగరాన్ని విడదీస్తున్నారని ఆరోపించారు. పరిపాలన సౌలభ్యం కోసమే జిల్లాల విభజన అని చెప్పిన ప్రభుత్వం నేటికి తగినంత సిబ్బందిని నియమించకపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజల డిమాండ్‌ మేరకే వరంగల్‌, హన్మకొండ జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు చారిత్రక నగరాన్ని విభజించాలని కోరుకున్న ప్రజలెవరో చెప్పాలన్నారు. ప్రజల డిమాండ్‌ పేరుతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పబ్బం గడుపుకోవాలని చూస్తే వారే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మేకల రవి, మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య, సీపీఐ నాయకులు నేదునూరి జ్యోతి, కర్రె బిక్షపతి, షేక్‌ బాషుమియా, మోతె లింగారెడ్డి, తోట బిక్షపతి, రమేష్‌, రవీదర్‌, బిక్షపతి మద్దెల ఎల్లేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-23T05:21:07+05:30 IST