మీరొస్తారా.. రమ్మంటారా?
ABN , First Publish Date - 2021-10-28T09:31:34+05:30 IST
కొవిడ్ రెండో వేవ్ నుంచి చాలావరకు ఉపశమనం పొందినా.. జాగ్రత్తలు తీసుకోవడం, టీకా వేసుకోవడం పట్ల నిర్లక్ష్యంగా...

కొవిడ్ టీకా వేసుకోని వారిపై ప్రత్యేక దృష్టి
ఇళ్ల వద్దకే వెళ్లి వ్యాక్సిన్ ఇస్తున్న వైద్య సిబ్బంది
కార్యక్రమాన్ని ఉధృతం చేసిన వైద్య శాఖ
ప్రతీ గ్రామానికి ఒక నోడల్ అధికారి
ఇప్పటివరకు తొలిడోసు 78 శాతం పూర్తి
రెండో డోసు 41 శాతమే పూర్తి
హైదరాబాద్, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): కొవిడ్ రెండో వేవ్ నుంచి చాలావరకు ఉపశమనం పొందినా.. జాగ్రత్తలు తీసుకోవడం, టీకా వేసుకోవడం పట్ల నిర్లక్ష్యంగా ఉండొద్దని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది. తెలంగాణలో ఇంకా టీకా వేసుకోని వారు లక్షల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ‘మీరొస్తారా.. మమ్మల్ని రమ్మంటారా?’ అంటూ వైద్య సిబ్బంది టీకా తీసుకోని వారిని అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా దేశాల్లో థర్డ్ వేవ్ ప్రారంభమైంది. భారత్‌లో కూడా మూడో ముప్పు వస్తుందన్న భయం వైద్య ఆరోగ్యశాఖలో నెలకొంది. అందుకే రాబోయే 10 రోజుల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత తీవ్రతరం చేయాలని ఆ శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా బుధవారం నుంచే టీకా కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేశారు. రాష్ట్రం లో 18 ఏళ్లు పైబడిన టీకా అర్హుల సంఖ్య 2,77,67,225 ఉండగా.. ఇప్పటివరకు 2,16,80513 మంది వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. 90,90,877 మంది రెండో డోసు తీసుకున్నారు. రాష్ట్రంలో తొలిడోసు 78ు మందికి ఇచ్చారు. తొలిడోసు తీసుకున్న వారిలో కేవలం 41 శాతమే వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నారు.
రెండో డోసు వారు 41.50 లక్షల మంది
రాష్ట్రంలో తొలిడోసు వ్యాక్సిన్ తీసుకున్నంత వేగంగా రెండో డోసు కోసం ప్రజలు రావడం లేదు. ప్రస్తుతం కొవిడ్ ఉధృతి తగ్గడంతో టీకాలు తీసుకోవడానికి ఆసక్తి చూపడంలేదు. రెండో డోసు గడువు ముగిసినవారు 41.50లక్షల మంది ఉన్నారని వైద్య ఆరోగ్యశాఖ లెక్కలు తీసింది. వారందరికీ 10రోజుల్లో వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని ప్రభుత్వం వైద్యశాఖకు ఆదేశాలు జారీ చేసింది.
ఇళ్లవద్దకే వెళ్లి వ్యాక్సినేషన్
రెండో డోసు గడువు ముగిసిన వారందరి జాబితాను వైద్యశాఖ సిబ్బంది సిద్ధం చేసుకున్నారు. కొవిన్ పోర్టల్‌లో ఇచ్చిన ఫోన్ నంబరు ఆధారంగా రెండో డోసు గడువు ముగిసిన వారందరికీ వ్యక్తిగతంగా ఫోన్ కాల్ చేస్తున్నారు. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో మొబైల్ టీకా వాహనంతో వారిళ్ల వద్దకే వెళ్లి వ్యాక్సిన్ ఇస్తున్నారు. బుధవారం జీహెచ్ఎంసీ పరిధిలో ఇదే పద్ధతికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఉన్న మొబైల్ టీకా వాహనాలకు అదనంగా మరో 50 వాహనాలను రంగంలోకి దింపారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇంటింటికి తిరిగి వ్యాక్సిన్ ఇస్తున్నారు.
నవంబరు 8 లోగా 100ు వ్యాక్సినేషన్
కొవిడ్ వ్యాక్సినేషన్ కోసం ప్రతీ గ్రామానికి ఒక నోడల్ అధికారిని ప్రభుత్వం నియమించింది. నవంబరు 8లోగా 100ు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని వైద్యశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖలతో పాటు మహిళా శిశు సంక్షేమశాఖ సిబ్బంది సహకారం తీసుకుంటున్నారు. ఇక పట్టణ ప్రాంతాల్లో పురపాలక శాఖతో పాటు మహిళాశిశు సంక్షేమశాఖ సిబ్బందిని భాగస్వామ్యం చేశారు. క్షేత్రస్థాయిలో దాదాపు 10ు వరకు ఆఫ్‌లైన్‌లో వేసిన వ్యాక్సినేషన్ డేటాను కొవిన్ పోర్టల్ అప్లోడ్ చేయలేదని వైద్యశాఖ గుర్తించింది. తక్షణమే ఆ డేటాను అప్లోడ్ చేయాల్సిందిగా క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించింది. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 50లక్షల టీకా డోసులు నిల్వ ఉన్నట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి.
రెండో డోసు తీసుకోని 1.26 లక్షల మంది ఫ్రంట్‌లైన్ వర్కర్స్
రాష్ట్రంలో వైద్య సిబ్బందిలోనూ ఇప్పటిదాకా రెండు డోసులు పూర్తిగా తీసుకోనివారు ఇంకా 58 వేల మంది ఉన్నారు. ఇప్పటివరకు 3,07,098మంది తొలిడోసు తీసుకోగా, 2,49,089 మందే రెండో డోసు తీసుకున్నారు. అలాగే ఫ్రంట్‌లైన్ వర్కర్స్ విషయానికొస్తే.. తొలిడోసు 3,18,224మంది తీసుకోగా.. రెండో డోసు 2,49,976మందే తీసుకున్నారు. మొత్తంగా హెల్త్, ఫ్రంటల్లైన్ వర్కర్స్ లో ఇంకా 1.26 లక్షల మంది రెండో డోసు తీసుకోవాల్సివుంది. థర్డ్‌వేవ్ వస్తే.. ముందుగా ప్రభావం పడేది హెల్త్‌కేర్ సిబ్బందిపైనే. వారే టీకా విషయంలో నిర్లక్ష్యంగా ఉంటుండంపై విమర్శలు వస్తున్నాయి.
కొవిడ్ టీకాతో కొండ కోనలకు..
కొండ కోనల్లో నివసించే గొత్తికోయలకు వ్యాక్సినేషన్ చేసేందుకు ములుగు డీఎంహెచ్‌వో అల్లం అప్పయ్య తమ సిబ్బందితో బుధవారం అడవిబాట పట్టారు. తాడ్వాయి మండలం కొడిశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని రమపట్నం గొత్తికోయగూడెంలోని ప్రజలకు టీకాలు ఇచ్చేందుకు వాగులు, వంకలు దాటుకుంటూ 15 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటికే ఆ గ్రామంలోని గొత్తికోయలకు మొదటి డోసు వేయగా, తాజాగా రెండో డోసు ఇచ్చారు. దీంతో రమపట్నంలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తయిందని డీఎంహెచ్‌వో వెల్లడించారు.
- తాడ్వాయి
2.82 లక్షల మందికి టీకా.. కొత్తగా 186 మందికి పాజిటివ్
రాష్ట్రంలో మంగళవారం 1.35 లక్షల మందికి తొలిడోసు, 1.47 లక్షల మందికి రెండో డోసు కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చారు. దీంతో మొత్తం డోసుల విని యోగం 3.07 కోట్లకు చేరింది. ఇందులో తొలిడోసు 2.16 కోట్ల మందికి, 90 లక్షల మందికి రెండో డోసు ఇచ్చారు. మరోవైపు కొత్తగా 186 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసు ల సంఖ్య 6.70లక్షలకు పెరిగింది. వైరస్‌తో మరొకరు మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4146 యాక్టివ్ కేసులున్నాయి. హైదరాబాద్‌లో 65, కరీంనగర్లో 16, ఖమ్మంలో 11, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో పది చొప్పున కేసులు నమోదయ్యాయి.