నిమ్స్‌లో కార్పొరేట్‌ వైద్యం

ABN , First Publish Date - 2021-12-08T09:19:34+05:30 IST

నిమ్స్‌ ఆస్పత్రిని బలోపేతం చేసి పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందిస్తామని, ఇందుకోసం రూ.154 కోట్లను మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు.

నిమ్స్‌లో కార్పొరేట్‌ వైద్యం

  • రూ.154 కోట్లు మంజూరు.. అదనంగా 200 ఐసీయూ పడకలు
  • మరో 120 కొత్త వెంటిలేటర్లు
  • 45 రోజులలో ఏర్పాటుకు చర్యలు:హరీశ్‌


హైదరాబాద్‌ సిటీ/హైదరాబాద్‌, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): నిమ్స్‌ ఆస్పత్రిని బలోపేతం చేసి పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందిస్తామని, ఇందుకోసం రూ.154 కోట్లను మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. మంగళవారం నిమ్స్‌లో ఆయన పలు అత్యాధునిక వైద్య పరికరాలు, పలు విభాగాలను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. అదనపు పడకలు, కొత్త వెంటిలేటర్లు, ఆధునిక విభాగాలు, పరికరాలతో నిమ్స్‌ రూపురేఖలను మారుస్తున్నట్లు చెప్పారు. రోబోటిక్‌ సర్జరీ వ్యవస్థను అందుబాటులోకి తేవడానికి 12 కోట్లు అవసరమవుతాయని, ఈ అంశంపై పరిశీలిస్తామన్నారు. రేడియో థెరపీలో లినాక్‌ పరికరం ఏర్పాటు కోసం రూ.20 కోట్లు ఖర్చు అవుతుందని, ఈ మొత్తాన్ని మంజూరు చేయాల్సిందిగా ఆంకాలజీ విభాగం వైద్యులు కోరినట్లు మంత్రి చెప్పారు. ప్రస్తుత నిమ్స్‌లో 155 పడకలున్నాయని, అదనంగా 200 ఐసీయూ పడకలను మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ అదనపు పడకలు జనవరి 15 నాటికి అందుబాటులో తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. 


ఆస్పత్రిలో 89 వెంటిలేటర్లు మాత్రమే ఉన్నాయని, వీటికి అదనంగా 120 వెంటిలేటర్లు అందుబాటులోకి తెస్తామన్నారు. నిమ్స్‌లో గైనకాలజీ విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 200 పడకల ఎంసీహెచ్‌ ఆస్పత్రిని నిమ్స్‌కు అనుబంధంగా తేవాలనీ నిర్ణయం తీసుకున్నామన్నారు.  ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా అందుబాటులో లేని బోన్‌ డెన్సిటివ్‌ మీటర్‌ను నిమ్స్‌లో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆరోగ్యశ్రీ కింద ఒక రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా బోన్‌ మారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేస్తున్నామని తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద చేరే రోగులతో పాటు.. నగదు చెల్లించి చికిత్స పొందుతున్న వారికీ ఉచితంగా భోజనం అందించాలని నిమ్స్‌ డైరెక్టర్‌ను ఆదేశించినట్లు చెప్పారు ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ఆయన కోరారు.  సర్కారీ దవాఖానాలకు వచ్చే రోగులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని మంత్రి హరీశ్‌రావు నిమ్స్‌ ఆస్పత్రి ఉన్నతాధికారులకు సూచించారు. నిమ్స్‌ను సందర్శించిన నేపథ్యంలో  విభాగాధిపతులతో దాదాపు 4 గంటల సేపు సమీక్ష నిర్వహించారు. 

Updated Date - 2021-12-08T09:19:34+05:30 IST