ప్రభుత్వ వైద్యసిబ్బందిలో.. సగం మందికి వ్యాక్సినేషన్‌ పూర్తి

ABN , First Publish Date - 2021-01-20T08:32:57+05:30 IST

రాష్ట్రంలో కరోనా టీకా కార్యక్రమం ఊపందుకుంది. మూడోరోజైన మంగళవారం 894 వ్యాక్సిన్‌ కేంద్రాల్లో 73,673 మందికి టీకాలివ్వాలని

ప్రభుత్వ వైద్యసిబ్బందిలో.. సగం మందికి వ్యాక్సినేషన్‌ పూర్తి

మూడోరోజు 51,997 మందికి వ్యాక్సిన్‌

51 మందిలో స్వల్ప ఆరోగ్య సమస్యలు

ఇప్పటివరకు 69,625 మందికి టీకా

జనవరి 22నాటికి ప్రభుత్వ ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సినేషన్‌ పూర్తి

మిగిలిన వారి కోసం 24న ప్రత్యేక డ్రైవ్‌?


హైదరాబాద్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా టీకా కార్యక్రమం ఊపందుకుంది. మూడోరోజైన మంగళవారం 894 వ్యాక్సిన్‌ కేంద్రాల్లో 73,673 మందికి టీకాలివ్వాలని వైద్య ఆరోగ్యశాఖ లక్ష్యంగా పెట్టుకోగా 51,997 మంది (71 శాతం) వ్యాక్సిన్‌ తీసుకున్నారు. సగటున ప్రతి  కేంద్రంలో 58 మందికి టీకా వేశారు. మూడు రోజులో కలిపి ఇప్పటివరకు 69,625 మంది (74 శాతం) వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌లో వెల్లడించింది. మంగళవారం టీకా తీసుకున్న వారిలో 51 మందిలో స్వల్ప ఆరోగ్య సమస్యలు తలెత్తగా, ముగ్గుర్ని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. మెదక్‌ జిల్లాల్లో టీకా తీసుకున్న ఒకరు ఫిట్స్‌ తరహా సమస్యతో పడిపోవడంతో, చికిత్స అందించగా కోలుకున్నట్లు వైద్యశాఖ అధికారులు తెలిపారు.


బుధవారం వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి సెలవు కావడంతో, గురువారం మళ్లీ టీకా కార్యక్రమం జరగనుంది. మంగళవారం సాయంత్రం నాటికి వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న వారిలో దాదాపు సగం మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయినట్లేనని వైద్య వర్గాలు వెల్లడించాయి. కేవలం ఐదు నుంచి పది శాతం మంది టీకా తీసుకోకపోవడంతో పాటు వివిధ కారణాల వల్ల వ్యాక్సిన్‌కు దూరంగా ఉన్నారని తెలిపాయి. 


25 నుంచి ‘ప్రైవేటు’ సిబ్బందికి.. 

టీకా తీసుకోని వారి కోసం ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తామని, బహుశా ఆదివారం రోజున (జనవరి 24) వారికి టీకాలు ఇస్తామని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు తెలిపారు. ఒకవేళ ఆ రోజున టీకా తీసుకోని వారికి.. ఆ తర్వాత  వ్యాక్సిన్‌ ఇచ్చేది లేదని ఆయన స్పష్టం చేశారు. జనవరి 22కల్లా రాష్ట్రంలోని 1,014 సర్కారీ వైద్య సంస్థల్లో సేవలందిస్తున్న సుమారు లక్షన్నర మంది సిబ్బంది అందరికీ టీకాలివ్వడం పూర్తవుతుందన్నారు. మంగళవారం తెలంగాణకు మరో 3,48,500 కొవిషీల్డ్‌ డోసులను కేంద్రం పంపింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రానికి మొత్తం 7,32,500 డోసులు వచ్చాయి. తొలుత కొవిషీల్డ్‌ 3.64 లక్షల డోసులు రాగా, ఆ తర్వాత భారత్‌ బయోటెక్‌ వారి కొవాగ్జిన్‌ 20 వేల డోసులు వచ్చాయి. మంగళవారం వచ్చిన డోసులన్నింటిని ప్రైవేటు వైద్య సిబ్బందికి వినియోగిస్తామని డీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు. వచ్చే సోమవారం నుంచి ప్రైవేటు ఆస్పత్రుల సిబ్బందికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల వైద్య సిబ్బందికీ.. ప్రభుత్వ సిబ్బందే అక్కడికి వెళ్లి వ్యాక్సినేషన్‌ చేయనున్నారు.


తెలంగాణకు కేంద్ర సర్కారు కితాబు 

తెలంగాణలో వ్యాక్సినేషన్‌ జరుగుతున్న తీరుపై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కువ శాతం మంది ఆరోగ్య సిబ్బంది ముందుకు వచ్చి టీకాలు వేయించుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఎటువంటి పొరపాట్లు లేకుండా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రశంసించిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సయ్యద్‌ ముర్తజా రిజ్వీ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు, వైద్యవిద్య సంచాలకుడు రమేష్‌రెడ్డితోపాటు వైద్య ఆరోగ్యశాఖ యంత్రాంగానికి, జిల్లా కలెక్టర్‌లకు రిజ్వీ అభినందనలు తెలియజేశారు.  

Updated Date - 2021-01-20T08:32:57+05:30 IST