తొమ్మిది ఆస్పత్రుల్లోనే రెండో డోసు
ABN , First Publish Date - 2021-05-09T05:27:15+05:30 IST
తొమ్మిది ఆస్పత్రుల్లోనే రెండో డోసు

ఆదివారం వ్యాక్సినేషన్ లేదు..
డీఎంహెచ్వో అప్పయ్య
ములుగు, మే 8: జిల్లాలోని తొమ్మిది ఆస్పత్రుల్లోనే రెండో డోసు కరోనా వ్యాక్సినేషన్ ఉంటుందని డీఎంహెచ్వో డాక్టర్ అల్లెం అప్పయ్య తెలిపారు. ఆదివారం వ్యాక్సినేషన్ ఉండదని చెప్పారు. ములుగులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కొవిడ్ టెస్టింగ్ సెంటర్, జాకారం క్వారంటైన్ కేంద్రాలను శనివారం ఆయన సందర్శించారు. క్వారంటైన్ కేంద్రంలో ఉన్న రోగుకు మనోధైర్యాన్ని ఇచ్చారు. అక్కడే భోజనం చేశారు. జిల్లాలోని ములుగు ఏరియా వైద్యశాల, ఏటూరునాగారం, వెంకటాపురం(నూగూరు) సామాజిక వైద్యశాలలు, రాయినిగూడెం, వెంకటాపూర్(రామప్ప), గోవిందరావుపేట, తాడ్వాయి, కన్నాయిగూడెం, మంగపేట పీహెచ్సీలలో మాత్రమే వ్యాక్సిన్లు వేస్తామని చెప్పారు. కోవాగ్జిన్ మొదటి డోసు తీసుకొని నాలుగు వారాలు గడిచిన వారు, కొవీషీల్డ్ తీసుకొని ఆరు వారాలు గడిచిన వారు ఆయా కేంద్రాల్లో రెండో డోసు టీకా తప్పకుండా వేసుకోవాలని సూచించారు. ముందస్తు రిజిస్ర్టేషన్లు అవసరం లేదని, కేంద్రం వద్దే స్పాట్ రిజిస్ర్టేషన్ చేస్తారని వెల్లడించారు. నిబంధనలు అతిక్రమించి ఎవరికైనా మొదటి డోసు టీకా వేసినట్లయితే బాధ్యులపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇంటింటి సర్వే వేగంగా జరుగుతోందని, లక్షణాలున్న వారికి మెడికట్ కిట్లను అందజేసి రెండు వారాలపాటు వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించేలా ప్రణాళిక రూపొందించామని అన్నారు. ఎవరైనా తీవ్ర అనారోగ్య బారిన పడితే తక్షణమే ఏరియా వైద్యశాలకు తరలించి మెరుగైన చికిత్స అందిస్తామన్నారు.