ముగింపు దశకు కరోనా

ABN , First Publish Date - 2021-11-09T07:26:29+05:30 IST

కరోనా వ్యాప్తి ప్రస్తుతం ముగింపు దశలో ఉందని వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ) డా.రమే్‌షరెడ్డి తెలిపారు.

ముగింపు దశకు కరోనా

ఇంకొన్ని రోజులు ఇలాగే ఉంటే నియంత్రణలోకి వచ్చినట్టే : డీఎంఈ రమే్‌షరెడ్డి

హైదరాబాద్‌, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాప్తి ప్రస్తుతం ముగింపు దశలో ఉందని వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ) డా.రమే్‌షరెడ్డి తెలిపారు. వైరస్‌ వ్యాప్తి పాండెమిక్‌ దశ నుంచి ఎండెమిక్‌ దశకు చేరినందు వల్లే  కొవిడ్‌-19 కేసుల ఉధృతి తగ్గిందన్నారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల మాత్రమే కేసులు బయటపడుతున్నాయని ఆయన చెప్పారు. విస్తృతంగా వ్యాక్సినేషన్‌ చేసినందు వల్లే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు. సోమవారం కోఠిలోని తన కార్యాలయంలో మీడియాతో రమే్‌షరెడ్డి మాట్లాడారు. లాక్‌డౌన్‌ను సడలించి నాలుగు నెలలైనా కొవిడ్‌ కేసుల సంఖ్య చాలా స్వల్పంగానే ఉందన్నారు. మరిన్ని రోజులపాటు పరిస్థితి ఇలాగే ఉంటే.. కొవిడ్‌-19 పూర్తి నియంత్రణకు వచ్చినట్టేనని ఆయన తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి కరోనా మూడో వేవ్‌ వచ్చే అవకాశమే లేదన్నారు. ఒకవేళ కొత్త కరోనా వేరియంట్లు పుట్టుకొచ్చినా.. రెండో వేవ్‌లో చూసిన పరిస్థితులు ఎదురుకావని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త వేరియంట్లు వ్యాపిస్తున్నాయంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. వైరస్‌ వేరియంట్లపై తాము ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించారు. చిన్నారులకు కరోనా ఇన్ఫెక్షన్‌ సోకినా తీవ్రత తక్కువగానే ఉందన్నారు. మొదటి, రెండో వేవ్‌లలో చాలా తక్కువ శాతం మంది పిల్లలు వైరస్‌ బారిన పడ్డారని గుర్తు చేశారు. అయితే వీరిలో ఎవరికీ సీరియస్‌ పరిస్థితులు తలెత్తలేదన్నారు. 

Updated Date - 2021-11-09T07:26:29+05:30 IST