పిల్లలపై ప్రభావం చూపని కరోనా

ABN , First Publish Date - 2021-03-22T07:56:14+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ప్రభావం చిన్నపిల్లలపై కనిపించడం లేదు.

పిల్లలపై ప్రభావం చూపని కరోనా

  • తక్కువ మందిపైనే కరోనా వైరస్‌ తీవ్రత
  • అడ్డుగా పనిచేస్తున్న ఇతర వ్యాక్సిన్లు
  • బతికి బయటపడిన బ్లడ్‌ కేన్సర్‌ బాధితులు
  • కరోనా సోకిన 508 మందికి చికిత్స
  • వారిలో 43 మంది నవజాత శిశువులు
  • 20 మంది బ్లడ్‌ కేన్సర్‌ బాధితులు
  • 508 మందిలో కేవలం 18 మంది మృతి

నారాయణఖేడ్‌కు చెందిన చిన్నారి వయసు 23 రోజులు. ఆ వయస్సులోనే తాత నుంచి ఆ చిన్నారికి కరోనా సోకింది. తల్లికి పరీక్షలు చేస్తే నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. వెంటనే ఆ చిన్నారిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేశారు. పాపకు తల్లి పాలు ఇవ్వాల్సి రావడంతో ఆమెను కూడా పిలిపించి అక్కడే ఉంచారు. 14 రోజులు గడిచిన తర్వాత చిన్నారికి పరీక్షలు చేస్తే నెగిటివ్‌ వచ్చింది. తల్లికి కూడా వైరస్‌ సోకినట్లు నిర్దారణ కాలేదు. 

(హైదరాబాద్‌ సిటీ-ఆంధ్రజ్యోతి) : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ప్రభావం చిన్నపిల్లలపై కనిపించడం లేదు. పిల్లలకు రోగనిరోధక వ్యవస్థ సమర్థంగా ఉండడం, చిన్నవయసులో వారు తీసుకునే ఇతరత్రా వ్యాక్సిన్లే ఇందుకు కారణమని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా.. కరోనా పాజిటివ్‌ తల్లుల పాలు తాగినా.. పిల్లలకు వైరస్‌ సోకకపోవడం గమనార్హం. గత ఏడాది వ్యవధిలో కరోనా సోకిన 508 మంది చిన్నారులకు గాంధీ ఆస్పత్రిలో చికిత్స చేశారు. వారిలో 20 మంది బ్లడ్‌ కేన్సర్‌ బాధితులే. ఆ 20 మందిలో ఒక్కరు తప్ప.. మిగతా 19 మందికి చికిత్సతో నెగెటివ్‌ వచ్చింది. అలాగే.. 43 మంది నవజాత శిశువులకు కరోనా సోకగా.. 40 మంది కోలుకుని ఇళ్లకు క్షేమంగా చేరుకున్నారు. ఇతరత్రా గుండె, మెదడు, మూత్రపిండాల జబ్బులున్నవారు దాదాపు 30 మంది దాకా ఉన్నారు. ఈ 508 మందిలో.. చనిపోయినవారు ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్న 18 మందే. పిల్లలపై కరోనా ప్రభావం తక్కువగా ఉందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. ఐదేళ్లలోపు పిల్లలకు కరోనా సోకినా 99ు మందికి ఎలాంటి సమస్యలు రావట్లేదు. ఐదు-పదేళ్లలోపు పిల్లల్లో మాత్రం అతి కొద్దిమందిలో తీవ్ర సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఇందులో 9, 10 ఏళ్ల పిల్లలు కొందరికి తీవ్రత ఎక్కువగా ఉండడంతో అత్యవసర చికిత్స అందించాల్సి వచ్చిందని గాంధీ ఆస్పత్రిలో పిల్లల వైద్యుడు డాక్టర్‌ శ్రీకాంత్‌ తెలిపారు. కరోనా బారిన పడిన పెద్దల్లో ఎక్కువగా కనిపించిన సమస్యలు.. రక్తనాళాలు దెబ్బతినడం, రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలేవీ పిల్లల్లో కనిపించలేదు. వారిలో శ్వాస సంబంధిత సమస్యలు కూడా తక్కువగా ఉన్నట్టు గమనించామని మెడికవర్‌ ఆస్పత్రిలో బాలల వైద్యుడు డాక్టర్‌ జనార్దన్‌ రెడ్డి తెలిపారు.


వందలో 8 మందే..

కరోనా వచ్చిన ప్రతి వంద మందిలో... ఎనిమిది మంది మాత్రమే పిల్లలు. పెద్ద వాళ్లతో పోలిస్తే పిల్లలో రిస్కు శాతం కూడా చాలా తక్కువగా ఉంది.  ఇమ్యూనిటీ ప్రబావం ఎక్కువగా ఉండడం వల్ల వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ ముప్పు వారిలో తక్కువగా ఉంటుంది. తట్టు, గవదబిళ్లలు, ఇతర జబ్బులు రాకుండా వారికి ఇచ్చే వ్యాక్సిన్ల వల్ల కూడా వారిలో కరోనాను ఎదుర్కొనే శక్తి ఎక్కువగా ఉంటుంది.

 డాక్టర్‌ జనార్దన్‌రెడ్డి, పిల్లల వైద్యుడు, 

మెడికవర్‌ వుమెన్‌ అండ్‌ చైల్డ్‌ ఆస్పత్రి

Updated Date - 2021-03-22T07:56:14+05:30 IST