గురుకులాలను వీడని కరోనా

ABN , First Publish Date - 2021-03-22T06:49:17+05:30 IST

గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లను కరోనా వీడడం లేదు. విద్యార్థులపై పెద్ద ఎత్తున పంజా విసురుతోంది.

గురుకులాలను వీడని కరోనా

  • పాల్మాకులలో 45 మంది విద్యార్థులకు వైరస్‌
  • హైదరాబాద్‌ పాతనగరంలో తొమ్మిది మందికి
  • నిర్మల్‌లో 17 మందికి..
  • ఇళ్లకు వెళ్తున్న విద్యార్థులు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లను కరోనా వీడడం లేదు. విద్యార్థులపై పెద్ద ఎత్తున పంజా విసురుతోంది. తాజాగా ఆదివారం పలు గురుకులాలు, హాస్టళ్లలో కొత్తకేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలంలోని పాల్మాకుల గ్రామంలోని జ్యోతిరావుపూలే బీసీ వెల్ఫేర్‌ హాస్టల్‌లో 45 మంది విద్యార్థినులకు ఆదివారం కొవిడ్‌-19 నిర్ధారణ అయ్యింది. ఇక్కడ 800 మంది విద్యార్థులు ఉండగా.. అనుమానం ఉన్నవారికి ఆదివారం పరీక్షలు నిర్వహించారు. 45 మంది విద్యార్థులకు పాజిటివ్‌ అని తేలింది. కరోనా సోకిన విద్యార్థులను ఐసోలేషన్‌కు హాస్టల్‌లోని ఓ హాల్‌ను కేటాయించారు. పెద్దషాపూర్‌ వైద్య సిబ్బంది వీరికి చికిత్స అందిస్తున్నారు. అయితే.. పాజిటివ్‌ అని తేలిన విద్యార్థులెవరికీ కరోనా లక్షణాలు కనిపించడం లేదని, వారు ఆరోగ్యంగా ఉన్నారని హెల్త్‌ సూపర్‌వైజర్లు తెలిపారు. హైదరాబాద్‌ పాతనగరంలోని రాజన్నబాయి వద్ద ఉన్న బీసీ బాలికల సంక్షేమ హాస్టల్‌లో ఆదివారం 70 మంది విద్యార్థునులకు కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించగా.. 9 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. నిర్మల్‌ జిల్లా ముథోల్‌లోని గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో 125 మంది బాలికలకు పరీక్షలు నిర్వహించగా 17మందికి పాజిటివ్‌ తేలింది. 


రాష్ట్రంలో మరో 394 కేసులు

రాష్ట్రంలో శనివారం కొత్తగా మరో 394 పాజిటివ్‌లు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 3,03,118 కు పెరిగింది. మరో 194 మంది డిశ్చార్జ్‌ అవ్వడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 2,98,645కు చేరింది. వైరస్‌ కారణంగా మరో ముగ్గురు మృతి చెందడంతో మరణాల సంఖ్య 1669కు పెరిగింది. మొత్తం 2,804 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌లో 81, మేడ్చల్‌-మల్కాజిగిరిలో 34, రంగారెడ్డిలో 64, జగిత్యాల, మహబూబ్‌నగర్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, వరంగల్‌ అర్బన్‌ జిల్లాల్లో పదేసి,  కరీంనగర్‌, సంగారెడ్డి, ఆదిలాబాద్‌లో 11 చొప్పున, ఖమ్మంలో 17, నాగర్‌ కర్నూల్‌, నల్లగొండలో 12 కేసులు నమోదయ్యాయి. కాగా, ఏపీలోని గుంటూరు నగరంలో ఒక్కరోజే 79 కరోనా కేసులు నమోదవగా, కర్నూలులో 49 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది.  

Updated Date - 2021-03-22T06:49:17+05:30 IST