పెళ్లి తెచ్చిన తంట... ఊరంతా కరోనా

ABN , First Publish Date - 2021-05-30T20:48:10+05:30 IST

ఓ వివాహ వేడుక ఆ గ్రామంలో కరోనా చిచ్చు పెట్టింది. పెళ్లి వేడుకకు హాజరైన వారిలో చాలామంది మాస్కులు ధరించకుండా..

పెళ్లి తెచ్చిన తంట... ఊరంతా కరోనా

ఖమ్మం: ఓ వివాహ వేడుక ఆ గ్రామంలో కరోనా చిచ్చు పెట్టింది. పెళ్లి వేడుకకు హాజరైన వారిలో చాలామంది మాస్కులు ధరించకుండా.. శానిటైజర్లు వాడకుండా కలివిడిగా తిరిగారు. ఇక అంతే వారం తర్వాత ఆ గ్రామంలో కొవిడ్‌ బాధితుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అంతేకాదు ఆ గ్రామంలో నలుగురు మృతి చెందారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని 250 మంది జనాభా ఉన్న ఓ గ్రామంలో ఈనెల 14న ఓ వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకకు హాజరైన ఓ వ్యక్తికి కరోనా సోకింది. సదరు వ్యక్తి వివాహ వేడుకలో పాల్గొన్న సమయంలో తన బంధువులు, మిత్రులతో కలివిడిగా తిరిగాడు. అక్కడి వారు అతడితో కలిసి ఆడిపాడి సందడి చేశారు.


ఈ క్రమంలో 20వతేదీ వరకు ఒకటి, రెండు కేసులు నమోదువుతూ వస్తున్న ఆ గ్రామంలో కేసులు ఒక్కసారిగా పెరిగాయి. రోజుకు పదికిపైగానే కేసులు నమోదవుతున్నాయి. గ్రామంలో కరోన పాజిటివ్ వచ్చిన వారిని గాంధీ పురంలో ఐసీసీ లోషన్ ఏర్పాటు చేసి అక్కడికి అధికారులు తరలించారు. వారం వ్యవధిలో కరోనాతో నలుగురు మృతిచెందారు. బుధవారం రోజు 38, 51 ఏళ్ల వయసున్న ఇద్దరు మృతిచెందారు. వీరిలో ఒకరు పెళ్లి కుమారుడి తండ్రి. అయితే అతడి అంత్యక్రియలకు ఎవరూ ముందుకు రాకపోవడంతో సదరు గ్రామ పంచాయతీ కార్యదర్శి తన సిబ్బందికి పీపీవీ కిట్లు ఏర్పాటు చేసి దహన సంస్కారాలు పూర్తిచేయించారు. ప్రస్తుతం ఆ గ్రామంలో వందకుపైగా కేసులు ఉండటంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

Updated Date - 2021-05-30T20:48:10+05:30 IST