రూ.10 ఫీజుతో కరోనా వైద్యం
ABN , First Publish Date - 2021-05-24T09:27:49+05:30 IST
కరోనా సోకి ఆస్పత్రుల్లో చేరితే వైద్యానికి లక్షల్లో ఖర్చవుతోంది. ఆ చికిత్సకే ఆస్తులన్నీ అమ్ముకుంటున్న వారూ ఉన్నారు.

- నిరుపేదలకైతే ఉచితంగానే ఓపీ
- పరీక్షలు, ఇంజక్షన్లూ తక్కువ ధరలకే
- రూ.20 వేలలో కరోనా పూర్తి చికిత్స
- వైద్యుడు విక్టర్ ఇమ్మాన్యుయెల్ ఆదర్శం
పీర్జాదిగూడ, మే 23 (ఆంధ్రజ్యోతి): కరోనా సోకి ఆస్పత్రుల్లో చేరితే వైద్యానికి లక్షల్లో ఖర్చవుతోంది. ఆ చికిత్సకే ఆస్తులన్నీ అమ్ముకుంటున్న వారూ ఉన్నారు. అలాంటిది కన్సల్టెన్సీ ఫీజుగా రూ. 10 తీసుకొని, కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారో వైద్యుడు. బాధితులు నిరుపేదలైతే ఆ రూ.10 కూడా తీసుకోవడం లేదు. కరోనాకు సంబంధించిన వివిఽధ పరీక్షలను తక్కువ ధరకే చేస్తున్నారు. మందులనూ అందుబాటు ధరలకే ఇస్తున్నారు. కొవిడ్ వైద్యం ఖరీదైన వ్యవహారంగా మారిన పరిస్థితుల్లో పీర్జాదిగూడలో ప్రజ్వల క్లినిక్ నిర్వహిస్తున్న డాక్టర్ విక్టర్ ఇమ్మాన్యుయెల్ ఆదర్శమిది. ఆయన జనరల్ మెడిసిన్ స్పెషలైజేషన్‌తో ఎంబీబీఎస్ చేశారు. వివిధ ఆస్పత్రుల్లో పనిచేసిన ఆయన తర్వాత సొంతంగా క్లినిక్ పెట్టుకున్నారు క్లినిక్ పెట్టినప్పటి నుంచి తన దగ్గరకు వచ్చే రోగులకు కన్సల్టెన్సీ ఫీజు కింద రూ.200 తీసుకుంటున్నారు. పేదరోగుల నుంచి రూ.10 మాత్రమే తీసుకుంటున్నారు. దేశం కోసం సరిహద్దుల్లో పోరాడే సైనికులు, ప్రజలకు అన్నం పెట్టే రైతులు, అనాథలు, దివ్యాంగులకు ఫీజు సహా జబ్బు నయం అయ్యే దాకా మందులతో సహా ఉచిత వైద్యాన్ని అందిస్తున్నారు. కొందరు దాతలు సహకరిస్తే నిరుపేద రోగులకు టెస్టులు సహా మందులూ ఉచితంగానే అందిస్తున్నారు. కొవిడ్ సోకిన నిరుపేద రోగులకు ల్యాబ్ పరీక్షలు మొదలుకుని మందులు, ఇంజక్షన్‌లు సైతం తక్కువ ధరకే అందిస్తున్నారు.
కరోనా వైద్యం 15 వేలలోపే
కరోనా చికిత్సలో భాగంగా ఆక్సిజన్, రెమ్‌డెవివిర్ ఇంజెక్షన్లు సామాన్యులకు దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే రోగులకు ఇవన్నీ తక్కువ ధరకే సమకూర్చుతున్నారు డాక్టర్ ఇమ్మాన్యుయెల్. ఇందుకు ఇతర వైద్యుల సహాయాన్ని ఆయన తీసుకుంటున్నారు. ఇంటి వద్ద వైద్యం చేయించుకునే రోగుల కోసం నర్సులను పంపుతున్నారు. ఇందుకు రోగులే రవాణా ఖర్చులను భరించాల్సి ఉంటుంది. మొత్తంగా కరోనా చికత్స కోసం రూ.15వేల నుంచి రూ.20లోపే ఖర్చయ్యేలా చేస్తున్నానని ఇమ్మాన్యుయెల్ పేర్కొన్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో లక్షలు ఖర్చవుతుండగా రూ.15 వేలకే కరోనా వైద్యం అందిస్తుండడంతో ఇమ్మాన్యుయెల్ నడిపిస్తున్న ప్రజ్వల క్లినిక్‌కు వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. పీర్జాదిగూడ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొవిడ్ ఐసొలేషన్ సెంటర్‌లోనూ డాక్టర్ ఇమ్మాన్యుయెల్ ఏడాదిగా కరోనా బాధితులకు ఉచితంగా వైద్య సేవలందిస్తున్నారు. తన వద్దకు వచ్చిన రోగుల్లో నిరుపేదలుంటే వారిని పీర్జాదిగూడ ఐసొలేసన్ సెంటర్‌లో చేర్పించి వారికి పూర్తిస్థాయిలో ఉచితంగానే వైద్యం చేయిస్తున్నారు. కరోనా చికిత్స భరించలేని పేదవారికి తక్కువ ధరకు వైద్యం అందించాలనే సంకల్పంతోనే ఇదంతా చేస్తున్నానని విక్టర్ చెప్పారు.