శబ్ద కాలుష్యాన్ని నియంత్రించండి

ABN , First Publish Date - 2021-12-30T07:35:22+05:30 IST

డిసెంబరు 31న, అలాగే కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా శబ్ద

శబ్ద కాలుష్యాన్ని నియంత్రించండి

  •  రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు 
  •  మార్గదర్శకాలు జారీచేస్తామన్న ప్రభుత్వం

హైదరాబాద్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): డిసెంబరు 31న, అలాగే కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా శబ్ద కాలుష్యాన్ని నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. నివాస ప్రాంతాల్లో శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడానికి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాల్సిందేనని పేర్కొంది. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం.. గురువారంలోగా మార్గదర్శకాలు జారీ చేస్తామని హైకోర్టుకు హామీ ఇచ్చింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో ధ్వని కాలుష్యం నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ జూబ్లీహిల్స్‌ రెసిడెంట్స్‌ క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ అసోసియేషన్‌, పలువురు అసోసియేషన్‌ సభ్యులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.


దీనిపై ఇప్పటికే రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌తోపాటు పలు పబ్‌లు, హోటళ్లకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. తాజాగా బుధవారం ఈ అంశంపై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సుప్రీంకోర్టు తీర్పు, 2010లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం జారీచేసిన 172 జీవోను అనుసరించి నివాస ప్రాంతాల్లో పరిమితికి మించి శబ్ద కాలుష్యానికి పాల్పడేవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. ఈ అంశంపై చట్టప్రకారం ఎలాంటి చర్యలు తీసుకున్నారని అదనపు అడ్వకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావును ప్రశ్నించింది.


రెండ్రోజులు సమయం ఇస్తే వివరాలు సమర్పిస్తామని ఏఏ జీ  కోర్టుకు తెలిపారు. ఇక నుంచి నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. దీనిపై పిటిషనర్‌ తరఫు న్యా యవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. రెండ్రోజుల్లో వేడుకలు అయిపోతాయని, ఆ తర్వాత చర్యలు తీసుకోవడం వల్ల ప్రయోజనం లేదని పేర్కొన్నారు. దీంతో.. ప్రభుత్వం ఏం చేసినా ఈ నెల 31 లోగానే చేయాలని, శబ్దకాలుష్యాన్ని నియంత్రించడానికి గురువారంలోగా మార్గదర్శకాలు జారీచేయాలని హైకోర్టు స్పష్టంచేసింది.  


Updated Date - 2021-12-30T07:35:22+05:30 IST