కరోనా బులెటిన్లు కొనసాగించండి

ABN , First Publish Date - 2021-02-26T07:14:25+05:30 IST

కరోనా కేసులపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న రోజువారీ బులెటిన్లను నిలిపివేయడం సరికాదని హైకోర్టు పేర్కొంది. కేసుల వివరాలతో రోజూ బులెటిన్‌ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. రోజువారీ బులెటిన్‌ విడుదల

కరోనా బులెటిన్లు కొనసాగించండి

రోజువారీ వివరాలను వెల్లడించండి

టీకా కేంద్రాల సమాచారం వెబ్‌లో పెట్టండి

ప్రింట్‌, ఎలకా్ట్రనిక్‌ మీడియాలో ప్రచారం 

చేయండి.. సర్కార్‌కు హైకోర్టు ఆదేశం


హైదరాబాద్‌, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): కరోనా కేసులపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న రోజువారీ బులెటిన్లను నిలిపివేయడం సరికాదని హైకోర్టు పేర్కొంది. కేసుల వివరాలతో రోజూ బులెటిన్‌ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. రోజువారీ బులెటిన్‌ విడుదల చేయడంతో పాటు సమాచారాన్ని వెబ్‌సైట్‌లోనూ ఉంచాలని తెలిపింది. వైర్‌సపై ప్రజలను అప్రమత్తం చేయడానికి విస్తృత ప్రచారం కల్పించాలని సూచించింది. కరోనా టీకాలను 45 ఏళ్లకు పైబడి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి, 60 ఏళ్లు దాటిన వారందరికీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున.. వ్యాక్సిన్‌ ఇచ్చే కేంద్రాల వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రింట్‌, ఎలకా్ట్రనిక్‌ మీడియాల్లో విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించింది. దేశంలో సెకండ్‌ వేవ్‌ కేసులు విస్తరిస్తున్నందున సరిహద్దు రాష్ట్రాల నుంచి వచ్చే వారి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం గురువారం ఆదేశాలు జారీచేసింది. 


కరోనా వ్యాప్తి, అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై న్యాయవాది సమీర్‌ అహ్మద్‌ నిరుడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖను ధర్మాసనం సుమోటోగా విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంతోపాటు మరికొన్ని వ్యాజ్యాలు మళ్లీ విచారణకు వచ్చాయి. కరోనా కేసుల తీవ్రతను గుర్తించేందుకు సీరో సర్వే చివరిసారిగా రాష్ట్రంలో ఎప్పుడు చేశారని ధర్మాసనం ఆరా తీసింది. గత డిసెంబరులో చేసినట్లు ఏజీ తెలిపారు. ఇప్పటి వరకు మూడు సార్లు సీరో సర్వే చేసినట్లు వివరించారు. తిరిగి కల్పించుకున్న ధర్మాసనం.. ఖమ్మం జిల్లాలో ఒకరి అంత్యక్రియల్లో పాల్గొన్న వారిలో 30 మందికి కరోనా సోకినట్లు పత్రికల్లో చూశామని గుర్తుచేసింది. ‘‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతోపాటు క్రమేణా పలు వెసలుబాట్లు కల్పిస్తూ వచ్చాయి. సినిమా హాళ్లు తెరిచారు. ఇతర సామాజిక సమావేశాలు, వేడుకల్లో ప్రజలు పెద్దఎత్తున పాల్గొంటున్నారు. సెకండ్‌ వేవ్‌ ప్రారంభమైంది. 


సరిహద్దు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి’’ అని సూచించింది. జనవరి 25 నుంచి ఫిబ్రవరి రెండో వారం వరకు ఎన్ని కరోనా పరీక్షలు నిర్వహించారని ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ను ప్రశ్నించింది. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 12 వరకు 1,03,737 ఆర్టీపీసీఆర్‌ టెస్టులు, 4,83,266 ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులు (ఆర్‌ఏటీ) చేసినట్లు ఏజీ తెలిపారు. ఆర్‌ఏటీ టెస్టుల్లో 100 శాతం కచ్చితమైన ఫలితాలు ఉండవని, కచ్చితత్వం బాగా ఉండే ఆర్టీపీసీఆర్‌ టెస్టులే ఎక్కువగా చేయాలని ధర్మాసనం సూచించింది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో సెకండ్‌ వేవ్‌ మొదలైనందున తక్షణ చర్యలు ఉండాలని స్పష్టం చేసింది.


ప్రజలు గుమిగూడే ప్రదేశాలపై దృష్టి సారించాలని పేర్కొంది. . ఏజీ వివరణ ఇస్తూ.. పాజిటివ్‌ కేసులు ఎక్కువగా వచ్చే ప్రాంతాలను గుర్తించి ఆయా జిల్లాల్లో సర్వే చేస్తామన్నారు. ఆయన వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం తదుపరి విచారణ నాటికి పూర్తి వివరాలు కోర్టు ముందుంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 18కి వాయిదా వేసింది. కాగా, పాఠశాలలు ప్రారంభమైనందున ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు టీకాల్లో ప్రాధాన్యం కల్పించినట్లుగా ఉపాధ్యాయులకూ ఇవ్వాలన్న అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం టీకాలు వేస్తారని, ముందే కావాలంటే తగిన ధర చెల్లించి ప్రైవేటుగా వేయించుకోవచ్చని సూచించింది. 

Updated Date - 2021-02-26T07:14:25+05:30 IST