మహానది టు కావేరి.. వయా గోదావరి!

ABN , First Publish Date - 2021-02-08T09:10:52+05:30 IST

కేసీఆర్‌ సర్కారు కోరినట్లుగానే నదుల అనుసంధాన ప్రాజెక్టును చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మహానది నుంచి నీటిని గోదావరికి

మహానది టు కావేరి.. వయా గోదావరి!

రాష్ట్రం కోరినట్టుగానే నదుల అనుసంధానం

మహానదిలో 360 టీఎంసీల మిగులు నీరు

అందులోంచి గోదావరి, కృష్ణా ద్వారా కావేరికి..

సాధ్యాసాధ్యాల నివేదిక సిద్ధం చేసిన కేంద్రం

అభిప్రాయాన్ని చెప్పాలని తెలంగాణకు సూచన

3 రాష్ట్రాల్లో సాగులోకి 11.15 లక్షల హెక్టార్లు


హైదరాబాద్‌, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్‌ సర్కారు కోరినట్లుగానే నదుల అనుసంధాన ప్రాజెక్టును చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మహానది నుంచి నీటిని గోదావరికి తరలించి, తర్వాత ఈ నీటిని కృష్ణా బేసిన్‌ మీదుగా కావేరిలోకి తీసుకెళ్లాలని నిశ్చయించింది. ఈ కొత్త ప్రతిపాదనకు సంబంధించిన సాధ్యాసాధ్యాల నివేదికను కేంద్రం సిద్ధం చేసింది. దాన్ని పరిశీలించి, అభిప్రాయాన్ని చెప్పాల్సిందిగా రాష్ట్రానికి సూచించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి నివేదికను పంపినట్లు తెలిసింది. దక్షిణాది రాష్ట్రాల నదులను అనుసంధానం చేయాలని కేసీఆర్‌ సర్కారు జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ)కు ప్రతిపాదించిన విషయం తెలిసిందే.


అందులో భాగంగా గోదావరిలోని సుమారు 247 టీఎంసీల నీటిని లిప్టుల ద్వారా తరలించి, కృష్ణా, పెన్నా బేసిన్ల ద్వారా తమిళనాడులోని కావేరి బేసిన్‌లోకి తీసుకెళ్లాలని తొలుత నిర్ణయించారు. దానిప్రకారం దుమ్ముగూడెం బ్యారేజీకి ఎగువన అకినేపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి, అక్కడి నుంచి నీటిని లిఫ్టు చేసి.. దుమ్ముగూడెం-సాగర్‌ టెయిల్‌ పాండ్‌ కాలువకు కొంత ఎగువ ప్రాంతంలో ప్రత్యేక కాలువను తవ్వాలని ప్రతిపాదించారు. ఆ కాలువ ద్వారా నీటిని సాగర్‌లోకి తరలించాలని భావించారు. గోదావరికి వరద వచ్చే రోజుల్లో అకినేపల్లి బ్యారేజీ నుంచి రోజుకు రెండు టీఎంసీల చొప్పున తరలించాలని అంచనా వేశారు. దీని ద్వారా మొత్తం 247 టీఎంసీలను సాగర్‌లోకి తరలించాలని ప్రతిపాదించారు. ఇందుకోసం అకినేపల్లి వద్ద 20 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 72.50 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మించాలని ప్రతిపాదించారు. ఇక్కడి నుంచి రెండు దశల్లో నీటిని లిప్టు చేసి సాగర్‌లోకి తరలించి, అక్కడి నుంచి సోమశిల, కండలేరు వరద కాలువ ద్వారా తమిళనాడుకు తరలించాలని భావించారు. ఈ అనుసంధాన ప్రాజెక్టుకు రూ.45,049 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టు పట్ల తెలంగాణ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. గోదావరిలో ప్రస్తుతం మిగులు నీరు లేదని, రాష్ట్ర అవసరాలు చాలా ఉన్నాయని పేర్కొంది. రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాత మిగిలే నీటినే తీసుకెళ్లాలని కోరింది. అప్పటి వరకు ఈ ప్రాజెక్టును చేపట్టవద్దని కోరింది. అలా కాకుండా మహానది నుంచి నీటిని గోదావరికి తీసుకొచ్చి, అక్కడ్నుంచి కావేరికి తరలిస్తే తమకు అభ్యంతరంలేదని కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. 


రాష్ట్ర అభ్యంతరాల నేపథ్యంలోనే..

తెలంగాణ అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకుని తాజాగా ఎన్‌డబ్ల్యూడీఏ కొత్త ప్రతిపాదనను సిద్ధం చేసింది. ఛత్తీ్‌సగఢ్‌, ఒడిసాల్లో ప్రవహించే మహానది నీటిని గోదావరిలోకి తీసుకురావాలని ఈ ప్రతిపాదనలో చేర్చినట్టు తెలిసింది. దీంతో ప్రాజెక్టు అంచనా వ్యయం కూడా రూ.10 వేలకోట్లు పెరుగుతుందని భావిస్తున్నారు. మహానదిలో 360 టీఎంసీల మిగులు నీరు ఉందని కేంద్రం తన ప్రతిపాదనల్లో పేర్కొంది. ఈ నీటిలో కొంత భాగాన్ని మహానది, గోదావరి, కృష్ణా మీదుగా కావేరి బేసిన్‌కు తరలించనున్నారు. నదుల అనుసంధానంతో పలు రాష్ట్రాలకు ప్రయోజనం ఉంటుందని ఎన్‌డబ్ల్యూడీఏ తన ప్రతిపాదనల్లో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ అనుసంధానం వల్ల 11.15 లక్షల హెక్టార్ల ఆయకట్టు సాగులోకి వస్తుంది. ఇందులో తెలంగాణలో 3.10 లక్షల హెక్టార్లు, ఏపీలో 4.04 లక్షల హెక్టార్లు, తమిళనాడులో 4.01 లక్షల హెక్టార్లకు సాగునీరు అందనుందని పేర్కొంది. ఫలితంగా ఏటా సుమారు రూ.13 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. కేంద్రం రూపొందించిన ఈ కొత్త ప్రాజెక్టుపై రాష్ట్రం తన అభిప్రాయాన్ని చెప్పాల్సి ఉంటుంది. 

Updated Date - 2021-02-08T09:10:52+05:30 IST