ఇచ్చంపల్లి నుంచే అనుసంధానం

ABN , First Publish Date - 2021-02-26T07:51:00+05:30 IST

నదుల అనుసంధానంలో భాగంగా గోదావరి నుంచి కృష్ణా, పెన్నార్‌ బేసిన్లకు మళ్లించే జలాలపై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు కేటాయించిన వాటా ప్రకారం హక్కు ఉంటుందని... నదీజలాల అనుసంధానంపై కేంద్రం

ఇచ్చంపల్లి నుంచే అనుసంధానం

‘గోదావరి-మహానది’కి ఈ ఏడాదే డీపీఆర్‌.. టాస్క్‌ఫోర్స్‌ నిర్ణయాలు


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): నదుల అనుసంధానంలో భాగంగా గోదావరి నుంచి కృష్ణా, పెన్నార్‌ బేసిన్లకు మళ్లించే జలాలపై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు కేటాయించిన వాటా ప్రకారం హక్కు ఉంటుందని... నదీజలాల అనుసంధానంపై కేంద్రం నియమించిన టాస్క్‌ ఫోర్స్‌ పేర్కొంది. ఆ నీటిని ఆయా రాష్ట్రాలు తమ ప్రణాళికలకు అనుగుణంగా ఉపయోగించుకోవచ్చునని వెల్లడించింది. అయితే, ఈ ప్రణాళికలను జాతీయ విధానంలో భాగంగా చేపడితే కేంద్రం వాటి అమలుకు సహాయపడుతుందని, వివిధ రాష్ట్రాల ప్రతిపాదనలను ఉమ్మడి లక్ష్యాలకు అనుగుణంగా విలీనం చేయడం సాధ్యపడుతుందని పేర్కొంది. ఢిల్లీలో గురువారం టాస్క్‌ఫోర్స్‌ చైర్మన్‌ శ్రీరామ్‌ వెదిరే నేతృత్వంలో గురువారం జరిగిన సమావేశంలో కేంద్ర జలసంఘం చైర్మన్‌ ఎస్‌కే హల్దర్‌, జాతీయ నదీ జలాల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ భోపాల్‌ సింగ్‌, జలశక్తి ఆర్థిక సలహాదారు జగ్‌ మోహన్‌ గుప్తాతోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇచ్చంపల్లి నుంచి నదుల అనుసంధానాన్ని చేపడితే తెలంగాణలోని దుర్భిక్ష ప్రాంతాలకూ ఉపయోగపడుతుందని టాస్క్‌ఫోర్స్‌ సూచించింది. గోదావరి జలాల తరలింపుతో తమిళనాడు పరిధిలోని కావేరీ డెల్టా రైతుల కష్టాలు తీరడంతోపాటు కొంత నీటిని కేరళ, కర్ణాటక రాష్ట్రాలు ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని తెలిపింది. అయితే, ప్రాజెక్టు అనుసంధాన మార్గంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు తమకు కేటాయించిన నీటిని వినియోగించుకునేలా చూసిన తర్వాతే ఇది జరగాలని అభిప్రాయపడింది. మహానది(బారాముల్‌)- గోదావరి(ధవళేశ్వరం) అనుసంధాన ప్రాజెక్టుకు సంబంధించి ఈ ఏడాదే సవివర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ను రూపొందించేందుకు టాస్క్‌ఫోర్స్‌ సభ్యులు ఆమోదముద్ర వేశారు. 

Updated Date - 2021-02-26T07:51:00+05:30 IST