ధరల పెరుగుదలపై కాంగ్రెస్‌ కన్నెర్ర

ABN , First Publish Date - 2021-12-19T05:50:21+05:30 IST

ధరల పెరుగుదలపై కాంగ్రెస్‌ కన్నెర్ర

ధరల పెరుగుదలపై కాంగ్రెస్‌ కన్నెర్ర
సిలిండర్‌ నెత్తిన పెట్టుకుని ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే సీతక్క

ములుగు కలెక్టరేట్‌, డిసెంబరు 18: పెట్రో, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ ములుగులోని జాతీయ రహదారిపై కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో శనివారం భారీ ర్యాలీని నిర్వహించారు. ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క నెత్తిన గ్యాస్‌ సిలిండర్‌ మోస్తూ, మెడలో కూరగాయల దండ  ధరించి వినూత్న నిరసన తెలిపారు. ఈ సంరద్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ పోకడకు పాల్పడుతోందని విమర్శించా రు. కార్పొరేట్‌ కంపెనీలతో కుమ్మక్కై ధరలు పెంచు తూ పేదల నడ్డివిరుస్తోందని మండిపడ్డారు. దేశంలో పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌, కూరగాయలు, ఇతర నిత్యావసర సరుకుల ధరలు  రోజురోజుకూ ఆకాశా న్నంటున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం విధానాల కారణంగా రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారులు, వేతనజీవులు దుర్భర జీవితాన్ని గడపాల్సి వస్తోందని అన్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు.  పెట్రో ధరలు పెంచడం ద్వారా ఏడేళ్లలో కేంద్ర ప్రభుత్వం రూ.23 లక్షల కోట్లు ఆర్జించిందని, ఈడబ్బంతా ఎక్కడికి పోతుందో దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.  యూపీఏ ప్రభుత్వ హయాంలో ఎల్‌పీజీ వంటగ్యాస్‌ ధర రూ.410 ఉంటే మోదీ ప్రభుత్వం రూ.990కు పెంచిందని విమర్శించారు. 2014 నుంచి అంతర్జాతీయంగా పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు తగ్గుతున్నా భారత్‌లో మాత్రం పెరిగిపోతున్నాయని  అన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం భారతదేశ ఆస్తులు, సంస్థలను అమ్మేస్తోందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలను తగ్గించాలని,  ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కిసాన్‌సెల్‌ జిల్లా అధ్యక్షుడు గొల్లపెల్లి రాజేందర్‌గౌడ్‌, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు బానోత్‌ రవిచందర్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బైరెడ్డి భగవాన్‌రెడ్డి, నాయకులు మల్లాడి రాంరెడ్డి, ఎమ్డీ.చాంద్‌పాషా, చెన్నోజు సూర్యనారాయణ, ఎమ్డీ.అప్సర్‌పాషా, జాలపు అనంతరెడ్డి, బండి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-12-19T05:50:21+05:30 IST