పీసీసీ చీఫ్‌.. నాకు చిన్న పదవి

ABN , First Publish Date - 2021-07-12T08:23:24+05:30 IST

పీసీసీ అధ్యక్ష పదవి తన స్థాయికి చాలా చిన్న పదవి అని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని, కాంగ్రె్‌సలోనే కొనసాగుతానని తెలిపారు. అభివృద్ధే తన లక్ష్యమన్నారు. మర్రి చెన్నారెడ్డి, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మాస్‌

పీసీసీ చీఫ్‌.. నాకు చిన్న పదవి

పార్టీ మారాల్సిన అవసరం నాకు లేదు..

ఉత్తమ్‌, భట్టి తమ నియోజకవర్గాల్లో అభ్యర్థులను గెలిపించలేకపోయారు

భువనగిరి కోటను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కిషన్‌రెడ్డికి వినతి

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలు



న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జూలై 11 (ఆంధ్రజ్యోతి): పీసీసీ అధ్యక్ష పదవి తన స్థాయికి చాలా చిన్న పదవి అని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని, కాంగ్రె్‌సలోనే కొనసాగుతానని తెలిపారు. అభివృద్ధే తన లక్ష్యమన్నారు. మర్రి చెన్నారెడ్డి, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మాస్‌ లీడర్లని, వారి నియోజకవర్గాల్లో ఏ ఎన్నికలు జరిగినా తమ అభ్యర్థులను గెలిపించుకోగలిగారని చెప్పారు. ఉత్తమ్‌కుమార్‌రెడి, భట్టి విక్రమార్క నియోజకవర్గాల్లో అలా జరగలేదని, భట్టి నియోజకవర్గంలో నలుగురు కౌన్సిలర్లను కూడా గెలిపించుకోలేకపోయారని వ్యాఖ్యానించారు. ఆదివారం ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కోమటిరెడ్డి కలిశారు. కేబినెట్‌ మంత్రిగా పదోన్నతి పొందినందుకు కిషన్‌రెడ్డిని అభినందించారు. తెలంగాణకు వారసత్వ సంపదగా పరిగణిస్తున్న భువనగిరి కోటను పర్యాటక అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.


అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. తన విజ్ఞప్తికి మంత్రి కిషన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఫార్మా స్యూటికల్‌ కంపెనీలను ఒకేచోట వేలాది ఎకరాల్లో ఏర్పాటు చేయడం వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతోందని, వీటిని జనావాసాలు లేనిచోట చేయాలని కోరినట్లు చెప్పారు. ఏపీ ప్రభుత్వం అక్రమంగా చేపడుతున్న ప్రాజెక్టులను అడ్డుకోవాలని కోరినట్లు వెల్లడించారు. రాజకీయాలపై తమ మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా కోమటిరెడ్డి చెప్పారు. పార్టీలు వేరయినా కిషన్‌రెడ్డితో తనకు సత్సంబంధాలు ఉన్నాయని, ఆయన వివాద రహితుడని అన్నారు. 


అప్పుడు తమ్ముడు.. ఇప్పుడు అన్న! 

టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియమితుడైన వెంటనే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. ఆ తర్వాత సైలెంటయిన ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. తాజాగా మరోసారి తేనెతుట్టెను కదిపారు. ఆదివారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ పీసీసీ పదవి తనకు చిన్నదని, ఎవరి నియోజకవర్గంలో వారు గెలిపించుకుంటే అదే ఎక్కువని చేసిన వ్యాఖ్యలు ఆ పదవికి, పార్టీ ఇమేజ్‌కి నష్టం కలిగించేలా ఉన్నాయని కాంగ్రెస్‌ వర్గాలు వాపోతున్నాయి. గతంలో ఆయన సోదరుడు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీకి అనుకూలంగా, కాంగ్రె్‌సకు వ్యతిరేకంగా వివాదాస్పద ప్రకటనలు చేశారు. అయితే పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎ్‌సఎల్పీలో విలీనం కావడం, సభలో ఆరుగురు సభ్యులు మాత్రమే మిగిలిన నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డిపై చర్యలకు కాంగ్రెస్‌ పార్టీ వెనుకడుగు వేసింది. అయితే కొద్ది నెలలుగా ఈ విషయంలో రాజగోపాల్‌రెడ్డి సైలెంట్‌ అయ్యారు.


పీసీసీ పీఠం దక్కక పోవడంతో తాజాగా వెంకట్‌రెడ్డి నిరసన గళం వినిపిస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం తరచూ కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. రాష్ట్రంలో పలువురు బలమైన కాంగ్రెస్‌ నేతలతో సంప్రదింపులు జరుపుతున్న బీజేపీ అధిష్ఠానం.. కోమటిరెడ్డి సోదరులపైనా కొంత కాలంగా దృష్టి సారించినట్లు చెబుతున్నారు. అయితే వెంకట్‌రెడ్డి మాత్రం సుముఖత వ్యక్తం చేయలేదని అంటున్నారు. ఇదిలా ఉంటే కోమటిరెడ్డి సోదరుల కుటుంబానికి చెందిన కంపెనీ.. ఈశాన్య రాష్ట్రాల్లో పలు నిర్మాణకాంట్రాక్టులు చేస్తోందని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని కలిసిన అనంతరం వెంకట్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమయిందని పార్టీ నేత ఒకరు అన్నారు.

Updated Date - 2021-07-12T08:23:24+05:30 IST