సెప్టెంబరులో రాహుల్‌ సభ

ABN , First Publish Date - 2021-08-20T09:24:46+05:30 IST

కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ వచ్చే నెల 10-17 తేదీల మధ్య తెలంగాణకు వస్తారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. వరంగల్‌లో నిర్వహించే దళిత, గిరిజన దండోరా సభలో రాహుల్‌ పాల్గొంటారని పేర్కొన్నారు. గురువారం దళిత, గిరిజన ఆత్మ గౌరవ..

సెప్టెంబరులో రాహుల్‌ సభ

వరంగల్‌లో దండోరా సభకు హాజరు

10, 17 తేదీల మధ్య రాష్ట్రానికి కాంగ్రెస్‌ అగ్రనేత

కాంగ్రెస్‌కు అధికారం ఖాయం.. 72 సీట్లు గెలుస్తాం

కార్యకర్తలు గట్టిగా పని చేస్తున్నారు: రేవంత్‌రెడ్డి

దళిత, గిరిజన దండోరా సమన్వయ నేతలతో భేటీ

టీఆర్‌ఎస్‌ అవినీతిపై పోరాటాలు చేయాలి: ఠాగూర్‌

24న సీఎం దత్తత గ్రామంలో 48 గంటల దీక్ష 


హైదరాబాద్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ వచ్చే నెల 10-17 తేదీల మధ్య తెలంగాణకు వస్తారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. వరంగల్‌లో నిర్వహించే దళిత, గిరిజన దండోరా సభలో రాహుల్‌ పాల్గొంటారని పేర్కొన్నారు. గురువారం దళిత, గిరిజన ఆత్మ గౌరవ దండోరా నియోజకవర్గ సమన్వయకర్తల సమావేశంలో రేవంత్‌ మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లో పార్టీ కచ్చితంగా 72 సీట్లు గెలుస్తుందని చెప్పారు. ఈ సారి కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని, దాన్ని ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. ఇంద్రవెల్లి, రావిర్యాల సభలను కాంగ్రెస్‌ కార్యకర్తలు విజయవంతం చేయడంతో రాష్ట్రంలో పార్టీ చాలా బలోపేతమైందన్నారు. కార్యకర్తలు గట్టిగా పనిచేస్తున్నారని, నాయకులూ అదే తీరులో కొట్లాడాలని సూచించారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అనేక పథకాలు తీసుకొచ్చి దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడాయని గుర్తు చేశారు. దళిత బంధు పథకాన్ని ఒక నియోజక వర్గానికే పరిమితం చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఈ విషయమై ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వాన్ని నిలదీయాల్సి ఉందన్నారు. 


హామీలివ్వడం కేసీఆర్‌కు అలవాటే

ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇవ్వడం.. తర్వాత మర్చిపోవడం కేసీఆర్‌కు అలవాటేనని రేవంత్‌ ఎద్దేవా చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ముందు.. హైదరాబాద్‌ వరదల్లో దెబ్బతిన్న కుటుంబాలకు రూ.10వేల చొప్పున సాయం చేస్తానని చెప్పి తర్వాత ఎగవేశారన్నారు. హైదరాబాద్‌లో రూ.10వేలే ఇవ్వని కేసీఆర్‌.. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులకు రూ.10లక్షలు ఇస్తారా? అని ప్రశ్నించారు. సెప్టెంబర్‌ 17 వరకూ జరిగే దళిత, గిరిజన దండోరా కార్యక్రమాన్ని డీసీసీలు సీరియ్‌సగా తీసుకుని పనిచేయాలని సూచించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మణిక్కం ఠాకూర్‌ మాట్లాడుతూ.. ఈ సమావేశానికి రాని వారికి షోకాజ్‌ నోటీసులు జారీ చేసి, వారి స్థానంలో వేరే వారిని నియమించాలని పార్టీ నాయకత్వానికి సూచించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతిపై నిరంతరం పోరాటం చేయాలన్నారు.


సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దళిత బంధు పథకంలో కేసీఆర్‌ ఇస్తామంటున్న రూ.10 లక్షలు ఆయన సొంత డబ్బు కాదని, గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు చేపట్టిన అనేక కార్యక్రమాల్లో ఒక భాగం మాత్రమేనన్నారు. దళిత, గిరిజనులకు కేసీఆర్‌ చేసిన నమ్మక ద్రోహాన్ని ప్రజలకు వివరించి వారిలో చైతన్యం తేవాలని ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ గౌడ్‌ పిలుపునిచ్చారు. కాగా, దళిత, గిరిజన దండోరా కార్యక్రమం అమలు కోసం నియమించిన నియోజకవర్గ సమన్వయకర్తల్లో కరీంనగర్‌ నియోజకవర్గ సమన్వయకర్త సుప్రభాత్‌రావు పనితీరు బాగున్నట్లు  తేల్చారు. జనగామ డీసీసీ అధ్యక్షుడు తనను పని చేయనివ్వడం లేదంటూ నియోజకవర్గ సమన్వయకర్త ఫిర్యాదు చేశారు. 


మూడు చింతలపల్లిలో దీక్ష

దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమంలో భాగంగా 24న మేడ్చల్‌ జిల్లాలో 48 గంటల దీక్ష చేపట్టనున్నట్లు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ మహేశ్వర్‌రెడ్డి ప్రకటించారు. సీఎం దత్తత గ్రామమైన మూడు చింతలపల్లిలో నిర్వహించనున్న దీక్షలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఇతర ముఖ్య నేతలు పాల్గొననున్నట్లు చెప్పారు.  బహిరంగ సభలకు కొనసాగింపుగానే ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. కాగా, దళిత, గిరిజన దండోరా కార్యక్రమం ముగింపు సభకు రాహుల్‌గాంధీని ఆహ్వానిస్తూ తీర్మానాన్ని ఆమోదించిన కార్యవర్గం.. 17వ తేదీనే(తెలంగాణ విమోచన దినం రోజునే) ఆ సభ ఉండేలా ప్రయత్నించాలన్న అభిప్రాయానికి వచ్చింది. దళిత, గిరిజన సభల తేదీలుసహా పలు నిర్ణయాలు ఏకపక్షంగా జరుగుతున్నాయని పలువురు నేతలు ఠాగూర్‌కు ఫిర్యాదు చేశారు. ఇక మీదట రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయాల మేరకే అన్నీ జరుగుతాయని ఠాకూర్‌ చెప్పినట్లు సమాచారం. హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాదిగ వర్గానికి చెందిన నేతను ప్రకటించాలంటూ బక్క జడ్సన్‌ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించగా.. ఆ బాధ్యతను  రాజనర్సింహకు అప్పగించామని ఠాగూర్‌బదులిచ్చారు. 


ఆ భేటీకి అందరినీ పిలవాలి ఠాగూర్‌కు జగ్గారెడ్డి వినతి 

ప్రతి శనివారం జరిగే టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశానికి పార్టీ ముఖ్యనేతలతోపాటు సీనియర్‌ ఉపాధ్యక్షులనూ పిలవాలని ఠాగూర్‌ను టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి కోరారు. ప్రస్తుతం ఈ సమావేశంలో రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, కమిటీల చైర్మన్లు పాల్గొంటున్నారు. వీరితోపాటుగా టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షులు, పీసీసీ మాజీ అధ్యక్షులు, సీఎల్పీ మాజీ నేతలు, మాజీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ప్రస్తుత పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, రాష్ట్రానికి చెందిన ఏఐసీసీ కార్యదర్శులు, ఏఐసీసీ అధికార ప్రతినిధులు,  కోదండరెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, బలరాం నాయక్‌, రేణుకా చౌదరిలనూ సమావేశానికి పిలవాలని ఠాగూర్‌కు ఆయన వినతిపత్రం ఇచ్చారు. 

Updated Date - 2021-08-20T09:24:46+05:30 IST