తెలంగాణలో అధికారంలోకి కాంగ్రెస్‌

ABN , First Publish Date - 2021-07-08T07:42:00+05:30 IST

‘‘టీపీసీసీ కొత్త టీమ్‌ను ప్రకటించే ముందు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నన్ను ఒకటే అడిగారు. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నారు. అధికారంలోకి తీసుకువస్తామని నేనూ మేడమ్‌కు మాటిచ్చాను’’ అని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి

తెలంగాణలో అధికారంలోకి కాంగ్రెస్‌

సోనియమ్మకు మాటిచ్చాను: మాణిక్కం ఠాగూర్‌ 

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలి: ఉత్తమ్‌ 

ఎమ్మెల్యేలు సిగ్గు లేకుండా పార్టీ మారారు: యాష్కి

కలిసికట్టుగా పనిచేద్దాం: భట్టి


హైదరాబాద్‌, జూలై 7 (ఆంధ్రజ్యోతి): ‘‘టీపీసీసీ కొత్త టీమ్‌ను ప్రకటించే ముందు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నన్ను ఒకటే అడిగారు. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నారు. అధికారంలోకి తీసుకువస్తామని నేనూ మేడమ్‌కు మాటిచ్చాను’’ అని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ అన్నారు. ఇందుకు రాష్ట్రంలోని ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్తా పార్టీ గెలుపు కోసం శ్రమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. బుధవారం టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ అనంతరం జరిగిన సభలో ఠాగూర్‌ సహా పార్టీ ముఖ్యనేతలు మాట్లాడారు. ఉత్తమ్‌ మాట్లాడుతూ రేవంత్‌ నేతృత్వంలోని పీసీసీ కొత్త కమిటీ 2023 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకువస్తారని ఆశిస్తున్నానన్నారు. ఈ ప్రభుత్వానికి, అధికార పార్టీ నేతలకు తగిన బుద్ది చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్రాన్నిచ్చిన కాంగ్రెస్‌ పార్టీ గురించి ప్రజలు ఆలోచన చేయాల్సి ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఇందుకోసం పార్టీ నాయకులమంతా కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు.


సిగ్గు లేకుండా మారారు..

కాంగ్రెస్‌ పార్టీ పెట్టిన భిక్షతో ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారు సిగ్గులేకుండా పార్టీ మారారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌ అన్నారు. కార్పొరేటర్‌ స్థాయి నుంచి ఎమ్మెల్యే అయిన సుధీర్‌రెడ్డి, మహిళ అని మంత్రిని చేసినందుకు సబితా ఇంద్రారెడ్డి కూడా సిగ్గు లేకుండా పార్టీ మారారంటూ ధ్వజమెత్తారు. సుధీర్‌రెడ్డి భూ భాగోతాలు తమకు తెలుసునని, ఆయన బండారం బయటపెడతామని హెచ్చరించారు. కాంగ్రెస్‌ కార్యకర్తలపై చేయి వేస్తే  విరగ్గొడతామన్నారు. రాహుల్‌ సూచన మేరకు అందరమూ కలిసి పనిచేస్తామన్నారు. ఈ సభకు ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ అధ్యక్షత వహించగా అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ స్వాగతం పలికారు. పార్టీ ముఖ్యనేత గాలి అనిల్‌కుమార్‌, రేణుకా చౌదరి,  కొండా సురేఖ, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కోమటిరెడ్డి సోదరులు హాజరు కాలేదు. 


కాంగ్రెస్‌కు ఒడిదుడుకులు అలవాటే..

కాంగ్రెస్‌ పార్టీకి ఒడిదుడుకులు అలవాటేనని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గీతారెడ్డి అన్నారు. సీనియర్‌.. జూనియర్‌ అనకుండా అంతా కలిసి పనిచేసే బాధ్యత తమపై ఉందన్నారు. కాగా, రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కావడం చారిత్రక సందర్భమని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. తెలంగాణను నిలువునా దోచుకున్న దొంగ కేసీఆర్‌ అని, ఆయన అవినీతిని త్వరలోనే బయటపెడతానని అన్నారు. ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ దామోదర్‌ రాజనర్సింహ మాట్లాడుతూ.. ఏపీలో కాంగ్రెస్‌ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా.. మాటకు కట్టుబడి తెలంగాణకు న్యాయం చేయాలన్న సంకల్పంతో సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని అన్నారు. రేవంత్‌రెడ్డి రాకతో సీఎం కేసీఆర్‌కు కొత్త రేషన్‌ కార్డులు, 57 ఏళ్లకే పెన్షన్‌, ప్రజలు గుర్తుకు వస్తున్నారని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ మహేశ్వర్‌రెడ్డి అన్నారు.

Updated Date - 2021-07-08T07:42:00+05:30 IST