కొత్త సచివాలయంలో మసీదులకు శంకుస్థాపన
ABN , First Publish Date - 2021-11-26T08:58:09+05:30 IST
కొత్త సచివాలయంలో రెండు మసీదుల నిర్మాణ పనులకు గురువారం శంకుస్థాపన జరిగింది. జామియా నిజామియా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ముఫ్తీ ఖలీల్ అహ్మద్ శంకుస్థాపన చేశారు.

అద్భుతమైన శైలిలో నిర్మిస్తాం: మహమూద్ అలీ
హైదరాబాద్, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): కొత్త సచివాలయంలో రెండు మసీదుల నిర్మాణ పనులకు గురువారం శంకుస్థాపన జరిగింది. జామియా నిజామియా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ముఫ్తీ ఖలీల్ అహ్మద్ శంకుస్థాపన చేశారు. రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, ఎంఐఎం శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పాషా ఖాద్రి, ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సేన్, వక్ఫ్ బోర్డు చైర్మన్ సలీం, జీహెచ్‌ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ పాల్గొన్నారు. పాత సచివాలయ భవనాన్ని కూల్చివేసిన సందర్భంలో అదే ఆవరణలో ఉన్న మసీదులు, నల్ల పోచమ్మ ఆలయాన్ని కూల్చేసిన సంగతి తెలిసిందే. వీటిని మళ్లీ అద్భుతంగా నిర్మిస్తామంటూ కేసీఆర్ హామీ ఇచ్చారు. దరిమిలా సచివాలయ ఆవరణలో గురువారం రెండు మసీదుల నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. వీటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.2.9 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటికే రూ.కోటి వరకు నిధులు విడుదలయ్యాయి. ఇదివరకు సీ బ్లాక్‌కు ఎడమవైపు పెద్ద మసీదు ఉండేది. అదే ప్రదేశానికి సమీపంలో మసీదును నిర్మిస్తున్నారు. మసీదులను అద్భుతమైన శైలిలో నిర్మిస్తామని ఈ సందర్భంగా మహమూద్ అలీ చెప్పారు. టర్కీ మసీదుల డిజైన్‌ల ప్రకారం వీటిని నిర్మిస్తామన్నారు. పాత సచివాలయంలో 700 గజాల విస్తీర్ణంలో మసీదులు ఉండేవని, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో ఒకేసారి ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా రెండు మసీదులకు కేసీఆర్ 1500 గజాల స్థలాన్ని కేటాయించారని వివరించారు. పెద్ద మసీదులో మహిళలు ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు ఉంటాయన్నారు.