ఆ రైతు కుటుంబాలకు పరిహారం

ABN , First Publish Date - 2021-12-26T08:22:51+05:30 IST

ఇంటికి ఆర్థికంగా దన్నుగా పెద్ద మనిషే ఆత్మహత్య చేసుకోవడంతో దిక్కూమొక్కులేక అవస్థలు పడుతూ ఏడేళ్లుగా పరిహారం కోసం ఎదురు చూస్తున్న రైతు కుటుంబాల్లో కొన్నింటికి ఊరట లభించింది.

ఆ రైతు కుటుంబాలకు పరిహారం

  • ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో 133 కుటుంబాలకు వర్తింపు
  • రూ.7.95 కోట్ల మంజూరు.. కుటుంబానికి 6లక్షల మేర సాయం
  • జిల్లాల వారీగా వివరాల వెల్లడి.. మిగతా 117 మందికి ఎప్పుడు?


హైదరాబాద్‌, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఇంటికి ఆర్థికంగా దన్నుగా పెద్ద మనిషే ఆత్మహత్య చేసుకోవడంతో దిక్కూమొక్కులేక అవస్థలు పడుతూ ఏడేళ్లుగా పరిహారం కోసం ఎదురు చూస్తున్న రైతు కుటుంబాల్లో కొన్నింటికి ఊరట లభించింది. రైతు బీమా పథకం ప్రవేశపెట్టడానికి ముందు ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో 133 కుటుంబాలకు పరిహారం కింద రూ.7.95 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. రూ.6 లక్షల  పరిహారం చెల్లింపునకు రెవెన్యూ, విపత్తుల శాఖ ప్రభుత్వ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా ఉత్తర్వులిచ్చారు. 2014 జూన్‌ 2- 2018 ఆగస్టు 14 మధ్య రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్యకు పాల్పడిన రైతుల్లో 250 మందికి రూ.15 కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని పలు సంఘాలు పేర్కొన్నాయి. వీరిలో 133 మందికి  మంజూరు చేయడం ద్వారా సాయం చేస్తామన్న మాటను ప్రభుత్వం కొంత మేరకు  నిలబెట్టుకున్నట్టయిందని చెప్పాయి. బడ్జెట్‌ లేదనే సాకుతో కాలయాపన చేస్తూ వచ్చిన సర్కారు అందరికీ చెల్లింపులు జరపాలని రైతు స్వరాజ్య వేదిక డిమాండ్‌ చేసింది.  ఈనెల 16న హైదరాబాద్‌లో చేపట్టిన పబ్లిక్‌ హియరింగ్‌కు విస్తృత ప్రచారం వచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అనేకమంది ప్రముఖులు ట్విటర్‌ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో ఎట్టకేలకు స్పందించి నిధులు విడుదల చేసిందని పేర్కొంది. 


250 బాధిత కుటుంబాలకు పరిహారం వస్తుందని అందరూ భావించినప్పటికీ 133 మందినే ఎంపిక చేయడం పట్ల సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. మిగతా 117 మంది రైతులకు పరిహారం ఎప్పుడు? ఇంతకీ వారికి అసలు చెల్లిస్తుందా? అనే విషయంపై స్పష్టత లేదు.  ఈ విషయమ్మీద సంబంధిత విభాగాలు మౌనం దాల్చాయి. 


‘ఆంధ్రజ్యోతి’ కథనాలతో..

ఏడేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం కాలయాపన చేస్తున్న అంశాన్ని ప్రస్తావిస్తూ  ‘ఆంధ్రజ్యోతి’  వరుస కథనాలు ప్రచురించింది. ‘పరిహారం.. అదనంత దూరం.. ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు దక్కని న్యాయం’ శీర్షికన 2020 డిసెంబరు 16న బాధిత కుటుంబాల ఆవేదనను వివరిస్తూ కథనం ప్రచురితమైంది. ‘ఉత్తరాది రైతులకు సరే.. మనోళ్ల మాటేంటి?’ అనే శీర్షికతో గత నవంబరు 22న ఓ కథనం ప్రచురితమైంది. ‘పరిహారమో చంద్రశేఖరా’ శీర్షికతో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల ఆవేదనా భరిత కథనం ఈనెల 16న కథనం ప్రచురితమైంది. ఇలా తమకు అండగా ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాల కారణంగానే ప్రభుత్వం స్పందించి పరిహారం చెల్లింపునకు ముందుకు వచ్చిందని బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. Updated Date - 2021-12-26T08:22:51+05:30 IST