చీడ పురుగులను ఏరివేయండి!

ABN , First Publish Date - 2021-10-25T07:41:39+05:30 IST

లంచాల కోసం క్రయవిక్రయదారులను వేధిస్తున్న సబ్‌ రిజిస్ట్రార్లపై వేటుకు రంగం సిద్ధమైంది. చిత్ర, విచిత్రమైన కొర్రీలతో ప్రజల జేబులకు చిల్లు పెడుతున్న అవినీతి సబ్‌ రిజిస్ట్రార్లపై చర్యలకు ఆ శాఖ కమిషనర్‌ సిద్ధమయ్యారు.

చీడ పురుగులను ఏరివేయండి!

  • లేదంటే అవినీతి అధికారులపై చర్యలు 
  • తీసుకోవాలంటూ నేనే ఏసీబీకి లేఖ రాస్తా
  • డీఐజీలను హెచ్చరించిన స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ శేషాద్రి
  • ‘ఆంధ్రజ్యోతి’ కథనం నేపథ్యంలో మీటింగ్‌
  • అసమర్థులు సెలవుపై వెళ్లాలంటూ ఆగ్రహం
  • తొలుత 10మంది సబ్‌రిజిస్ట్రార్లపై వేటు?
  • చీడ పురుగులను ఏరివేయండి!


హైదరాబాద్‌, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): లంచాల కోసం క్రయవిక్రయదారులను వేధిస్తున్న సబ్‌ రిజిస్ట్రార్లపై వేటుకు రంగం సిద్ధమైంది. చిత్ర, విచిత్రమైన కొర్రీలతో ప్రజల జేబులకు చిల్లు పెడుతున్న అవినీతి సబ్‌ రిజిస్ట్రార్లపై చర్యలకు ఆ శాఖ కమిషనర్‌ సిద్ధమయ్యారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలోని చీడ పురుగులను ఏరివేయాలని కమిషనర్‌ శేషాద్రి డీఐజీ (డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌)లకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ‘మీరు చర్యలు తీసుకోకపోతే అవినీతి సబ్‌ రిజిస్ట్రార్లపై విచారణ కోరుతూ నేనే స్వయంగా ఏసీబీకి లేఖ రాస్తా’ అంటూ డీఐజీలకు వార్నింగ్‌ ఇచ్చారు. ‘అయినా.. లంచం తప్పట్లేదు’ శీర్షికన ఈ నెల 19న ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. కొందరు సబ్‌ రిజిస్ట్రార్‌ (ఎస్‌ఆర్‌)లు లంచాల కోసం క్రయవిక్రయదారులను వేధిస్తున్న వైనంపై పక్కా ఆధారాలతో ప్రచురితమైన ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగింది. ప్రభుత్వ పెద్దల నుంచి ఆ శాఖ ఉన్నతాధికారులకు మొట్టికాయలు పడినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలోనే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌.. డీఐజీలతో అంతర్గత సమావేశం నిర్వహించి అవినీతి, అసమర్థుల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. డీఐజీల పర్యవేక్షణ లోపం వల్లే జిల్లా రిజిస్ట్రార్‌ (డీఆర్‌)లు అవినీతి ఎస్‌ఆర్‌లను కాపాడుతున్నారని కమిషనర్‌  అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అనంతరం ఆరుగురు డీఐజీలతో కలిసి 33 జిల్లాల రిజిస్ట్రార్లతో జూమ్‌ మీటింగ్‌ నిర్వహించిన కమిషనర్‌.. అసమర్థ, అవినీతి అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలిసింది.


అసమర్థులు సెలవుపై వెళ్లాలంటూ ఒకరిద్దరు డీఆర్‌లపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సక్రమంగా పని చేయని డీఆర్‌లపై వేటు పడుతుందని కూడా హెచ్చరించినట్లు తెలిసింది. కమిషనర్‌ ఆదేశాల నేపథ్యంలో తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎస్‌ఆర్‌ల జాబితాను సిద్ధం చేసిన డీఐజీలు.. దాన్ని శనివారం కమిషనర్‌కు అందించినట్లు తెలిసింది. వీరిపై నేడో రేపో వేటు పడుతుందని, ముగ్గిరిని సస్పెండ్‌ చేసే అవకాశం ఉందని, మిగిలిన వారిపై బదిలీ వేటు పడుతుందని ఓ ఉన్నతాధికారి ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. ఉద్యోగ సంఘాల నాయకులు కొందరు కమిషనర్‌ శేషాద్రిని కలిసి అవినీతి అధికారులపై మాత్రమే చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం. 

Updated Date - 2021-10-25T07:41:39+05:30 IST